Telugu Global
National

తెలంగాణలో కరోనా పరీక్షలపై కేంద్రం అసంతృప్తి

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ లేఖ రాశారు. పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో అతి తక్కువగా పరీక్షలు చేస్తుండడంపై లేఖలో ఆందోళన వ్యక్తం చేశారామె. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు ఈ లేఖ రాశారు. తెలంగాణలో పరీక్షల సంఖ్య తక్కువగా ఉన్నా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడాన్ని లేఖలో ఆమె ప్రస్తావించారు. కరోనా వైరస్‌ […]

తెలంగాణలో కరోనా పరీక్షలపై కేంద్రం అసంతృప్తి
X

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ లేఖ రాశారు. పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో అతి తక్కువగా పరీక్షలు చేస్తుండడంపై లేఖలో ఆందోళన వ్యక్తం చేశారామె. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు ఈ లేఖ రాశారు.

తెలంగాణలో పరీక్షల సంఖ్య తక్కువగా ఉన్నా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడాన్ని లేఖలో ఆమె ప్రస్తావించారు. కరోనా వైరస్‌ మనల్ని వేటాడడానికంటే ముందే మనమే కరోనా వైరస్‌ను తరిమేయాలని వ్యాఖ్యానించారు. కాబట్టి పరిస్థితిని సమీక్షించి తక్షణం ఎక్కువ పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్‌ను ఆమె కోరారు. దేశం మొత్తం మీద జరిగిన కరోనా పరీక్షల్లో తెలంగాణ వాటా కేవలం 1.5 శాతం మాత్రమే ఉండడాన్ని లేఖలో ఎత్తిచూపారు.

ప్రతి పది లక్షల మందికి పరీక్షల సగటు దేశంలో వెయ్యి 25గా ఉంటే… తెలంగాణలో మాత్రం ప్రతి పది లక్షల మందికి కేవలం 546 పరీక్షలు మాత్రమే చేస్తున్నారని ప్రీతి సుడాన్ తెలిపారు. దేశంలో సగటున చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్‌ వస్తున్న కేసుల శాతం 4.12గా ఉండగా… తెలంగాణలో మాత్రం పాజిటివ్ రేటు 5. 26 శాతంగా ఉందని ఆమె లేఖలో ప్రస్తావించారు. కాబట్టి భారీగా పరీక్షలు చేస్తే మరిన్ని కరోనా కేసులు బయటపడుతాయని… అప్పుడు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సులువు అవుతుందని సుడాన్‌ లేఖలో సూచించారు.

తెలంగాణలో కరోనా పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లను వాడుకోకపోవడాన్ని కూడా తప్పుపట్టారు. ప్రైవేట్ ల్యాబ్‌లను వాడుకోకపోవడం బట్టి… పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు ఉన్నా వాటిని సరిగా వాడుకోవడం లేదనిపిస్తోందని ప్రీతి సూడాన్ వ్యాఖ్యానించారు.

లేఖకు స్పందించిన ఈటెల రాజేందర్‌ తాము కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గుడ్డిగా వ్యవహరించి ప్రజల్లో భయాన్ని సృష్టించదలుచుకోలేదన్నారు.

తొలుత వేగంగానే పరీక్షలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు అక్కర్లేదని ఆదేశాలు ఇచ్చింది. డెడ్‌బాడీలకు కూడా కరోనా పరీక్షలు చేయవద్దని స్పష్టం చేసింది.

డెడ్‌బాడీలకు కరోనా పరీక్షలు చేయకపోతే దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని కొందరు హైకోర్టును ఆశ్రయించగా… ఇటీవలే హైకోర్టు … డెడ్‌బాడీలకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది.

ఇప్పుడు పరీక్షలు తక్కువగా ఉండడంపై కేంద్ర వైద్య శాఖ లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచే అవకాశం ఉంది.

First Published:  20 May 2020 7:17 AM IST
Next Story