Telugu Global
CRIME

లాక్‌డౌన్ విషాదం... ఆకలి తీర్చలేక పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి అనే శీర్షిక చూస్తే ఆ తండ్రి మీద ఎనలేని కోపం రావొచ్చు. అక్కడే కనుక మనం ఉంటే అతను ఆత్మహత్య చేసుకోక పోతే మనమే చంపేద్దాం అనేంత కసి ఉండవచ్చు. కానీ ఆ తండ్రి మరోలా ఆలోచించాడు. నాలుగు ముద్దలు పెట్టి పిల్లలను బతికించలేకపోతున్నా.. కనీసం చంపేద్దాం అని ఆలోచించాడేమో..! పిల్లలను చంపడం చాలా పెద్ద నేరం. కానీ ఆ తండ్రి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలిస్తే మన […]

లాక్‌డౌన్ విషాదం... ఆకలి తీర్చలేక పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
X

పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి అనే శీర్షిక చూస్తే ఆ తండ్రి మీద ఎనలేని కోపం రావొచ్చు. అక్కడే కనుక మనం ఉంటే అతను ఆత్మహత్య చేసుకోక పోతే మనమే చంపేద్దాం అనేంత కసి ఉండవచ్చు. కానీ ఆ తండ్రి మరోలా ఆలోచించాడు. నాలుగు ముద్దలు పెట్టి పిల్లలను బతికించలేకపోతున్నా.. కనీసం చంపేద్దాం అని ఆలోచించాడేమో..! పిల్లలను చంపడం చాలా పెద్ద నేరం. కానీ ఆ తండ్రి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలిస్తే మన హృదయం ద్రవించకమానదు.

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్‌లో ఆర్ముగం అనే వ్యక్తి భార్య పిల్లలతో కలసి జీవించేవాడు. ఆర్ముగానికి రాజేశ్వరి (12), శాలినీ (10) అనే కూతుర్లు, సేతురామన్ (10) కుమారుడు ఉన్నారు. లాక్‌డౌన్ ముందు వరకు వీళ్లందరూ ఉన్న దాంట్లో సర్థుకొని ఎంతో హాయిగా జీవించారు. రోజూ కూలి పనికి వెళ్లి తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.

గత రెండు నెలలుగా కూలి పని దొరకక పోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. ఇంట్లోని ముగ్గురు పిల్లలకు కడుపునిండా అన్నం కూడా పెట్టలేకపోయాడు. పిల్లలు తన వద్దకు వచ్చి ‘నాన్నా.. ఆకలి’ అంటే ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. వాళ్ల బాధ చూడలేక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. కానీ, తాను చనిపోతే పిల్లలు అనాధలుగా మారిపోతారని.. ఇంతకంటే మరింత దయనీయ స్థితిలోకి నెట్టివేయబడతారని భయపడ్డాడు.

ఇక ఏం చేయాలో పాలుపోని ఆర్ముగం.. తాను పిల్లలను బయటకు తీసుకెళ్లి తిప్పుకొని వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఊరు చివర పొలాల మధ్య ఉన్న బావి దగ్గరకు తీసుకొని వెళ్లాడు. పిల్లల కాళ్లకు పెద్ద రాయి కట్టి వారిని బావిలోనికి తోసేశాడు. దీంతో పిల్లలు నీటిలో మునిగి మృతి చెందారు. ఆ తర్వాత అతను వెళ్లి పక్కనే ఒక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఆర్ముగం ఆకలి బాధకు పిల్లల ఉసురు తీసుకోవడమే కాక.. తానూ చనిపోవడంతో భార్య అనాధగా మిగిలింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ దేశంలో లాక్‌డౌన్ కారణంగా పేదలు ఎంతటి దయనీయ స్థితిని ఎదుర్కుంటున్నారో ఈ ఘటన అద్దం పడుతోందని పలువురు అంటున్నారు.

First Published:  19 May 2020 1:17 PM IST
Next Story