Telugu Global
National

తెలంగాణలో అన్ని వ్యాపారాలకు అనుమతి

మే 31 వరకు లాక్‌డౌన్ కేంద్ర మార్గదర్శకాలు పాటిస్తాం సిటీ బస్సులు మినహా టీఎస్ఆర్టీసీకి అనుమతి తెలంగాణలో రేపటి నుంచి కంటైన్మెంట్ జోన్లను మినహా మిగతా ప్రాంతాలన్నింటినీ గ్రీన్ జోన్లుగా గుర్తిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా మంగళవారం నుంచి లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడి, లాక్‌డౌన్ నిబంధనలు, వ్యవసాయ రంగం తదితర అంశాలే ఎజెండాగా ఇవాళ ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రగతి భవన్‌లో […]

తెలంగాణలో అన్ని వ్యాపారాలకు అనుమతి
X
  • మే 31 వరకు లాక్‌డౌన్
  • కేంద్ర మార్గదర్శకాలు పాటిస్తాం
  • సిటీ బస్సులు మినహా టీఎస్ఆర్టీసీకి అనుమతి

తెలంగాణలో రేపటి నుంచి కంటైన్మెంట్ జోన్లను మినహా మిగతా ప్రాంతాలన్నింటినీ గ్రీన్ జోన్లుగా గుర్తిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా మంగళవారం నుంచి లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కరోనా వైరస్ కట్టడి, లాక్‌డౌన్ నిబంధనలు, వ్యవసాయ రంగం తదితర అంశాలే ఎజెండాగా ఇవాళ ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు.

తెలంగాణలో కూడా మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ జోన్లలో ఉన్నాయని.. అందుకే మిగతా ప్రాంతాలన్నింటినీ గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తున్నామని అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఉండే కుటుంబాలకు ప్రభుత్వమే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుందని సీఎం చెప్పారు. అక్కడ నిత్యం పోలీస్ పహారా ఉంటుందని… వాళ్లు లాక్‌డౌన్ నిబంధనలను తప్పక పాటించాలని ఆయన చెప్పారు.

మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. కాకపోతే రద్దీగా ఉండే ప్రాంతాల్లో 50+50 శాతం మేరకు దుకాణాలు తెరవాల్సి ఉంటుందన్నారు. రోజు విడిచి రోజు ఆయా ప్రాంతాల్లో షాపులు తెరవాలన్నారు.

సెలూన్లు, ఈ-కామర్స్ సంస్థలు వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని కేసీఆర్ ప్రకటించారు. కాకపోతే తప్పకుండా భౌతిక దూరం పాటించాలని, కరోనా వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ప్రజా రవాణాను మంగళవారం నుంచి అనుమతిస్తుండటంతో.. టీఎస్ఆర్టీసీ సేవలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు. హైదరాబాద్‌లో మాత్రం సిటీ బస్సులు నడవవని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నామని.. కాకపోతే ఆటోలు డ్రైవర్ మరియు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఎక్కాలన్నారు. అలాగే కారులో డ్రైవర్ మరియు ముగ్గురు మాత్రమే ప్రయాణించాలన్నారు. ఈ విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తారని సీఎం వివరించారు.

రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు తమ ఉత్పత్తులు ప్రారంభించడానికి అనుమతులు జారీ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కాకపోతే ముందస్తుగా పరిశ్రమను పూర్తిగా పరీక్షించాలని.. కార్మికులకు సరైన రక్షణ పరికరాలు అందించాలని ఆయన చెప్పారు.

రైతులు తమ ఇష్టానుసారం పంటను వేయొద్దని సీఎం కేసీఆర్ చెప్పారు. వర్షాకాలంలో మక్క పంటను వేస్తే ప్రభుత్వం కొనదని స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఈ ఏడాది అన్ని పంటలను కొన్నామని.. వచ్చే పంటల కాలం నుంచి ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  18 May 2020 8:15 PM GMT
Next Story