రేపటి నుంచి రోడెక్కనున్న బస్సులు..?
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి రోడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించినా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని అనుసరించి ఇతర రాష్ట్రాల అంగీకారంతో అంతర్ రాష్ట్ర సర్వీసులు, అంతర్ జిల్లా సర్వీసులు నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో సోమవారం సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ బస్సులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ బస్సులను తిప్పితే […]
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి రోడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించినా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని అనుసరించి ఇతర రాష్ట్రాల అంగీకారంతో అంతర్ రాష్ట్ర సర్వీసులు, అంతర్ జిల్లా సర్వీసులు నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో సోమవారం సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ బస్సులపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఆర్టీసీ బస్సులను తిప్పితే కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. దీంతో బస్సు లోపల పలు మార్పులు చేయాలని అధికారులు అంటున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో వరుసకు ఒక్కరే ఉండేలా ఒక నమూనా.. అదే సూపర్ లగ్జరీ అయితే వరుసకు ఒకరు లేదా సీట్లు మార్చి వరుసకు మూడు సింగిల్ సీట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ సీటింగ్ విధానంపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటారు.
ఇక తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా ఉన్నందున అక్కడికి అంతర్ రాష్ట్ర సర్వీసులు నడపకపోవచ్చు. అయితే ఏపీకి మాత్రం బస్సులను నడిపే యోచనలో ఉన్నారు. బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు కూడా బస్సులను రేపటి నుంచి కాకపోయినా.. మరో వారం తర్వాత పునరుద్దరించే అవకాశం ఉంది.
మరోవైపు హైదరాబాద్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో సిటీ బస్సులను నడపడంపై తర్జనభర్జన కొనసాగుతోంది. సిటీలో లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు నడిపితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కంటైన్మెంట్ జోన్ల నుంచి బస్సులను ఇప్పుడే నడవద్దని అనుకుంటున్నారు. కాగా, నగరం నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు మాత్రం బస్సులు నడపాలని భావిస్తున్నారు. వరుసకు ఒకరు కూర్చొని.. మధ్యలో ఒకరికి నిలబడే అవకాశం ఇవ్వాలని అధికారులు అంటున్నారు.
సిటీ బస్సుల్లో కండక్లర్లు ఉండరని.. ఆయా స్టాపుల్లో మాత్రమే కండక్టర్లు ఉంటారని చెబుతున్నారు. ముందు డోర్ల వద్ద ఒక కండక్టర్ టికెట్ ఇస్తుంటే.. మరో డోర్ వద్ద దిగే వారిని చెక్ చేస్తుంటారని అధికారులు అంటున్నారు.
మరోవైపు బస్సులను కేవలం 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడపాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటిస్తారు. దీంతో పడే అదనపు భారాన్ని ప్రయాణికులపై వేయక తప్పదు. కాబట్టి టికెట్ చార్జీలను ఏ మేరకు పెంచాలనే విషయం కూడా సాయంత్రం చర్చకు రానుంది.
ప్రతీ బస్సులో భౌతిక దూరం పాటిస్తూ.. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరిస్తేనే ప్రయాణానికి అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.