Telugu Global
National

'చావనైనా చస్తాం కానీ ఇక్కడ మాత్రం ఉండం'

కరోనా ఉధృతితో విధించిన లాక్‌డౌన్ ఎందరో వలస కూలీలు, కార్మికుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చేసింది. కాసింత సంపాదించుకుందామని ఊరుగాని ఊరొచ్చిన వాళ్లకు లాక్‌డౌన్ శరాఘాతంగా మారింది. కంపెనీలు మూతబడటం, నిర్మాణాలు ఆగిపోవడంతో ఆదాయం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక కల్లోగంజో తాగి సొంతూర్లోనే ఉందాం అని లక్షలాది మంది స్వగ్రామాలకు బయలుదేరారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల రవాణా వ్యవస్థలు మూతబడటంతో లారీలు, కాలినడకే చాలా మందికి దిక్కయ్యింది. రాజస్థాన్‌కు చెందిన ఒక బృందం తమిళనాడులోని కోయంబత్తూరుకు […]

చావనైనా చస్తాం కానీ ఇక్కడ మాత్రం ఉండం
X

కరోనా ఉధృతితో విధించిన లాక్‌డౌన్ ఎందరో వలస కూలీలు, కార్మికుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చేసింది. కాసింత సంపాదించుకుందామని ఊరుగాని ఊరొచ్చిన వాళ్లకు లాక్‌డౌన్ శరాఘాతంగా మారింది. కంపెనీలు మూతబడటం, నిర్మాణాలు ఆగిపోవడంతో ఆదాయం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక కల్లోగంజో తాగి సొంతూర్లోనే ఉందాం అని లక్షలాది మంది స్వగ్రామాలకు బయలుదేరారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల రవాణా వ్యవస్థలు మూతబడటంతో లారీలు, కాలినడకే చాలా మందికి దిక్కయ్యింది.

రాజస్థాన్‌కు చెందిన ఒక బృందం తమిళనాడులోని కోయంబత్తూరుకు వలస వచ్చింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో కరోలీ జిల్లాలోని స్వగ్రామం గౌరెడకు బయలుదేరారు. 18 మందితో కూడిన ఈ బృందంలో మదీన, గాయత్రి అనే ఇద్దరు మహిళలు నిండు గర్భిణిలు. ప్రస్తుతం మదీన ఏప్రిల్ 30న 9 నెలలు నిండి ఏ క్షణమైనా ప్రసవం కావడానికి సిద్దంగా ఉంది. ఒక గాయత్రి 8 నెలల గర్భిణి. ఏ విధంగానైనా 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి చేరుకోవాలని బయలు దేరారు. నడుచుకుంటూ వెళ్లినా 50 రోజుల్లో వెళ్తాం అనే సంకల్పంతో బయలుదేరారు.

నెలన్నర క్రితం ఎంతో కష్టపడి కోయంబత్తూరు నుంచి ఏపీ సరిహద్దు డోన్‌కు చేరుకున్నారు. కాని ఏపీ అధికారులు వారిని అక్కడే నిలిపేసి క్యాంపునకు తరలించారు. 40 రోజుల పాటు క్యాంపులోనే గడిపిన వాళ్లను అధికారులు సొంతూరుకి వెళ్లమని రెండు రోజుల క్రితం విడిచిపెట్టారు. కాని ఎలా వెళ్లాలో వారికి అర్థం కాలేదు. ప్రత్యేక రైలు కూడా అందుబాటులో లేదు. కాని పలు వాహనాలు మారుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ వాళ్లను మహారాష్ట్రలో దింపుతాను అని చెప్పి పెద్దాపూర్‌లో దింపేశాడు.

ఇక అక్కడి నుంచి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. ”ఏం జరుగుతుందో జరగనివ్వండి. చావనైనా చస్తాం కానీ మా సొంతూరికి వెళ్లిపోతాం. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించాం.. కాని ఇక ఇక్కడ ఉండం” అని ఆ గర్భిణి స్త్రీలు ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘మా ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు మా గురించి చాలా బెంగ పెట్టుకున్నారు. అక్కడ కనీసం వాళ్లు తిండికూడా తినడం లేదు. ఇప్పటికే ఒక క్యాంపులో 40 రోజులు ఉన్నాం. కోయంబత్తూరులో బయలుదేరి 50 రోజులు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ క్వారంటైన్ అంటే మా వల్ల కాదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ కాళ్లు పట్టుకుంటాం’ అని అదే బృందంలోని విజయేందర్, సోను అనే వ్యక్తులు మీడియా ప్రతినిధుల ముందు వాపోయారు.

కాగా, రాజస్థానీ బృందంలో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉన్నారని తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి రాధోడ్, సదాశివపేట సీఐ శ్రీధర్ రెడ్డి, ఎమ్మార్వో ఆశాజ్యోతి వెంటనే వారున్న ప్రదేశానికి వెళ్లారు. ఇద్దరినీ వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యపరీక్షలు చేశారు. కానీ అక్కడ ఉండటానికి మాత్రం వారిద్దరితో సహా బృంద సభ్యులెవ్వరూ ఒప్పుకోలేదు. చివరకు ఒక ట్రక్ డ్రైవర్ నాగ్‌పూర్ వరకు తీసుకెళ్తానని ప్రామిస్ చేయడంతో ఆ లారీలో వెళ్లిపోయారు.

ఇది ఒక్క మదీన, గాయత్రిల పరిస్థితే కాదు దేశ వ్యాప్తంగా ఎంతో మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఎండలను సైతం లెక్క చేయకుండా స్వగ్రామాల బాట పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీరి గోడును పట్టించుకోవడం లేదు. ఉన్న చోట పని దొరుకుతుందనే భరోసా లేక.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సొంతూర్లకు వెళ్లిపోతున్నారు.

First Published:  9 May 2020 8:20 PM GMT
Next Story