మరో మూడు నెలలు మహబూబా నిర్బంధం
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. మాజీ మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు అలీ మహమ్మద్ సాగర్, పి.డి.పి. సీనియర్ నాయకుడు సర్తాజ్ మదానీ నిర్బంధాన్ని కూడా మూడు నెలలపాటు పొడిగించారు. ఆయన మహబూబా ముఫ్తీకి దగ్గరి బంధువు. ప్రజా భద్రతా చట్టం (పి.ఎస్.ఏ.) కింద నిర్బంధంలో ఉన్న వీరి నిర్బంధ గడువు కొద్ది గంటలలో ముగుస్తుందనగా నిర్బంధ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. మహబూబా ముఫ్తీ […]
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. మాజీ మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు అలీ మహమ్మద్ సాగర్, పి.డి.పి. సీనియర్ నాయకుడు సర్తాజ్ మదానీ నిర్బంధాన్ని కూడా మూడు నెలలపాటు పొడిగించారు. ఆయన మహబూబా ముఫ్తీకి దగ్గరి బంధువు.
ప్రజా భద్రతా చట్టం (పి.ఎస్.ఏ.) కింద నిర్బంధంలో ఉన్న వీరి నిర్బంధ గడువు కొద్ది గంటలలో ముగుస్తుందనగా నిర్బంధ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు.
మహబూబా ముఫ్తీ ప్రస్తుతం తన స్వగృహం “ఫేర్ వ్యూ”లోనే నిర్బంధంలో ఉన్నారు. ఆమె ఇంటిని సబ్ జైలుగా మార్చారు. సాగర్, మదానీ గోక్ పూర్ లోని ఓ ప్రభుత్వ భవనంలో నిర్బంధంలో ఉన్నారు.
గత సంవత్సరం ఆగస్టు 5న జమూ-కశ్మీర్ రాష్ట్రప్రతిపత్తిని రద్దు చేసి ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన దగ్గర నుంచి మహబూబా నిర్బంధంలో ఉన్నారు. ముందు ఆమెను ఆరు నెలల పాటు ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలో ఉంచారు. అప్పుడే మహబూబా ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కూడా నిర్బంధించారు.
మహబూబా ఎనిమిది నెలల పాటు సబ్ జైళ్లుగా మార్చిన ప్రభుత్వ భవనాల్లో నిర్బంధంలో ఉన్న తరవాత ఏప్రిల్ ఏడో తేదీని ఆమె స్వగృహంలోనే నిర్బంధంలో ఉంచారు.
నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లాను కూడా ఆగస్టు 5ననే నిర్బంధించారు. ఆయనను కూడా ప్రజా భధ్రతా చట్టం కిందే నిర్బంధించినట్టు తరవాత ప్రకటించారు. కాని ఆయనను మార్చిలో విడుదల చేశారు. ఫారూఖ్, ఒమర్ పై ప్రజా భద్రతా చట్టాన్ని ఉపసంహరించారు.
మహబూబా నిర్బంధాన్ని సవాలు చేస్తూ ఆమె కూతురు ఇల్తిజా ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ దాఖలైన తరవాత ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచి జమూ-కశ్మీర్ పాలనా విభాగానికి నోటీసులు జారీ చేసి కేసు విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. కానీ ఈ లోగా కరోనా వ్యాధి ప్రబలడంతో విచారణ జరగనే లేదు.