Telugu Global
National

కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్… ఈ సందర్భంగా కేంద్రం వైఖరి బెల్లం కొట్టిన రాయిలా ఉందని మండిపడ్డారు. దేశం మొత్తం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఉలుకుపలుకు లేకుండా కేంద్రం ఉండడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి లేదని… ఏదైనా ధైర్యంగా మాట్లాడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తప్పుడు విధానాలను అనుసరిస్తోందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికపరిస్థితి కరోనా కంటే ముందే […]

కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కేసీఆర్‌
X

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్… ఈ సందర్భంగా కేంద్రం వైఖరి బెల్లం కొట్టిన రాయిలా ఉందని మండిపడ్డారు. దేశం మొత్తం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఉలుకుపలుకు లేకుండా కేంద్రం ఉండడం సరికాదన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి లేదని… ఏదైనా ధైర్యంగా మాట్లాడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తప్పుడు విధానాలను అనుసరిస్తోందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికపరిస్థితి కరోనా కంటే ముందే ఘోరంగా ఉందన్నారు. ఇప్పుడు కరోనా కూడా దెబ్బకొట్టిందన్నారు. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయిందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి నెలకు 15వేల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. రాష్ట్రానికి నేరుగా వచ్చే ఆదాయమే దాదాపు 11 వేల కోట్లు ఉండేదన్నారు. కానీ ఇప్పుడు నెలకు 16 వందల కోట్లు మాత్రమే వస్తోందన్నారు. జీతాలు ఇవ్వాలంటేనే మూడు వేల కోట్లు కావాల్సి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో తాము ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. ఆర్థిక వ్యవస్థపై నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్రం వద్ద మాత్రమే ఉందన్నారు. వారు అధికారాలు బదిలీ చేయడం లేదు… డబ్బులూ ఇవ్వడం లేదన్నారు.

హెలికాప్టర్‌ మనీ పేరుతో కాకుంటే మరో పేరుతో ఇవ్వాలని… కోరినా డబ్బులు కేంద్రం ఇవ్వడం లేదన్నారు. వలస కూలీలు పనులు లేక, డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వారి నుంచి కూడా రైల్వే చార్జీలు వసూలు చేయడం అన్యాయమని విమర్శించారు. చివరకు తామే నాలుగు కోట్ల రూపాయలు రైల్వేకు కట్టాల్సి వచ్చిందన్నారు. రైల్వే చార్జీలు భరించే డబ్బులు కూడా కేంద్రం వద్ద లేవా అని ప్రశ్నించారు. ఇది సిగ్గుపోయే పరిస్థితి అని మండిపడ్డారు.

డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇదా సమయం అని నిలదీశారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. దేశం మొత్తం సమస్యలో ఉన్నా కేంద్రం నుంచి ఉలుకులేదు పలుకు లేదని విమర్శించారు. కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే దేశం ఘోరంగా దెబ్బతినిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

చివరకు అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచాలని ప్రధానిని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కేంద్రం వైఖరి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. కొద్ది కాలం వేచి చూసి తమ నిరసన తెలియజేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ఈఆర్‌సీ చైర్మన్ లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండగా… ఇప్పుడు దాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది అన్యాయమని కేసీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్‌ కంటే రెండాకులు ఎక్కువగా చదివినట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున విద్యుత్‌ బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించి తీరుతామన్నారు. ఆ బిల్లును పాస్‌ కానివ్వబోమన్నారు. విద్యుత్‌ సబ్సిడీలను ఎత్తేసేందుకు కుట్ర చేస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు.

దేశం మొత్తం సమస్యలో ఉందని… కాబట్టి బెల్లం కొట్టిన రాయిలా ఉండడం మానుకుని కేంద్రం ముందుకు రావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. నాలుగు రోజులు ఎదురుచూస్తామని… కేంద్రం లిమిట్‌ దాటితే తగిన కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు.

First Published:  6 May 2020 1:35 AM GMT
Next Story