Telugu Global
International

కరోనా వైరస్ మనతోనే ఉంటుంది " డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ నుంచి మానవాళిని రక్షించడానికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, మరో రెండు మూడు నెలల్లో మూడో దశ ట్రయిల్స్ కూడా పూర్తవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, వైరస్ ప్రభావం తదితర విషయాలపై ఆమె జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా […]

కరోనా వైరస్ మనతోనే ఉంటుంది  డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య
X

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ నుంచి మానవాళిని రక్షించడానికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, మరో రెండు మూడు నెలల్లో మూడో దశ ట్రయిల్స్ కూడా పూర్తవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, వైరస్ ప్రభావం తదితర విషయాలపై ఆమె జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు.

”సాధారణంగా ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కనీసం 10 ఏళ్ల సమయం పడుతుంది. ఎబోలా వ్యాక్సిన్ తయారీకి 5 ఏళ్ల సమయం పట్టగా.. జికా వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్‌ను 2 ఏళ్లలోనే అభివృద్ధి చేశారు. కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్‌ను 12 నెలల్లోనే తయారు చేసి రికార్డు సృష్టిస్తారేమో చూడాలి. అయితే, ఈ రికార్డు సాధ్యం కావాలంటే ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన అందరూ ఏకతాటిపైకి రావల్సి ఉంది. వ్యాక్సిన్ తయారీలో పోటీ పడటం కంటే.. ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చు” అని సౌమ్య అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. వీటిలో 7 వ్యాక్సిన్లు మానవునిపై ప్రయోగానికి సిద్దంగా ఉన్నాయి. చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ వరకు వచ్చాయి. ఇక ఇండియా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ ప్రీక్లినికల్ దశలో ఉందన్నారు.

రాబోయే రెండు మూడు నెలల్లో వీటిలో కొన్ని మూడో దశ ట్రయల్స్‌కు చేరుకుంటాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి 2021 జనవరి వరకు సమయం పట్టొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి సంబంధించిన చికిత్స, వ్యాక్సిన్, వ్యాధి నిర్థారణకు ఒక నిర్థిష్ట ప్రమాణికాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. ఇది కొత్త వైరస్ కనుక ముందుగా జంతువులపై పరీక్షించి ఆ తర్వాత ముందుకు వెళ్లాల్సిందే.

అయితే అందరూ ఒకే రకమైన పరీక్షా విధానాన్ని అవలంభించరు కాబట్టి.. వ్యాక్సిన్ యొక్క నాణ్యతను పరీక్షించాల్సిన బాధ్యత డబ్ల్యూహెచ్‌వోపై ఉంటుంది. ఇప్పుడు తయారవుతోన్న 100కు పైగా వ్యాక్సిన్లు మూడో దశ వరకు వెళ్లవు. వీటిలో రెండు నుంచి 5 వ్యాక్సిన్లు మాత్రమే అన్ని పరీక్షలను తట్టుకొని చివరి దశకు చేరుకుంటాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి డబ్ల్యూహెచ్‌వో నిబంధనలు పాటించాల్సిందే. ఆ తర్వాత వచ్చే వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని సౌమ్య చెప్పారు.

ప్రస్తుతం ఇండియా, ఆఫ్రికాలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు కాకపోవడంపై అనేక సిద్దాంతాలు, ఊహాగానాలు వినపడుతున్నాయి. కాని వాటిలో ఏవి నిజమనే విషయం కచ్చితంగా చెప్పలేం. ఇప్పటికే అనేక ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల ఇక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగిందని.. అందుకే కరోనాను ఎదుర్కుంటున్నారనే థియరీని కొట్టిపారేయలేం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్ల, ముఖ్యంగా భౌతిక దూరం పాటించడం వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయి. అసలు ఈ వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో ఇంత వరకు పరిశోధనలకు కూడా తేలలేదు. ఇప్పుడు ఈ వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కానీ చలికాలంలో లేదా లాక్‌డౌన్ ఎత్తేశాక కేసులు పెరగవచ్చు. ఒక విషయం మాత్రం నిజం. ఇప్పటికే విస్తృతంగా వ్యాపించిన ఈ వైరస్ ఇక మనతో పాటే ఉంటుందన్నారు.

వైరస్ వల్ల భారీ కేసులు నమోదైన చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ దేశాల్లో ఇప్పుడు కొత్త కేసుల నమోదు చాలా తక్కువగా ఉంది. వీటిని తగ్గించడంలో ఆయా దేశాలు ఒక్కో రకమైన మార్గాన్ని ఎంచుకున్నాయి. వాళ్లు లాక్‌డౌన్ ఎత్తేసినా టెస్టులు చేయడం ఆపలేదు. ఇంకా క్వారంటైన్, ఐసోలేషన్ చేస్తూనే ఉన్నారు. ఇండియాలో కూడా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రాంతాలను విభజించి వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరికీ వైరస్ వ్యాపించడం లేదు. కేవలం ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేసి వచ్చిన వారి నుంచే వైరస్ వ్యాపిస్తోందని ఆమె అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం వల్ల ఆర్థిక, సామాజిక కుదుపునకు లోనైన విషయం నిజమే. ముఖ్యంగా ఏయే దేశాల్లో అయితే ఎక్కువ జనాభా దినసరి కూలీలుగా, ప్రతీ రోజు తమ ఆదాయాన్ని సంపాదించుకుంటారో వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్న విషయం వాస్తవమే. కాని ప్రస్తుత పరిస్థితిలో వైరస్ వల్ల ఏర్పడే నష్టాన్ని తగ్గించాలంటే అలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. అయితే ఫార్మా, వ్యవసాయ రంగాలకు అన్ని దేశాలు మినహాయింపులు ఇచ్చాయి. దీనివల్ల కాస్త కోలుకునే అవకాశం ఏర్పడిందన్నారు.

ఇక ఇది ల్యాబ్‌లో తయారు చేసిన వైరస్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ వైరస్‌ను పరిశీలించినప్పుడు జంతువుల నుంచి సహజసిద్దంగా వ్యాపించిందనే ఆనవాళ్లు కనిపించాయి. ఈ వైరస్ జీనోమ్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది గబ్బిలం నుంచి వ్యాపించింది అనడానికి రుజువులు కూడా ఉన్నాయి. బ్యాట్ కరోనా వైరస్‌కు కోవిడ్ -19కు చాలా పోలికలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అయితే కచ్చితంగా ఏ జంతువు ద్వారా మనిషిలోకి ప్రవేశించింది అనేదానిపై మాత్రం కచ్చితమైన ఆధారాలు లేవు. మెర్స్ వ్యాధి ఒంటె నుంచి, సార్స్ వ్యాధి పునుగు పిల్లి నుంచి వ్యాపించినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే కోవిడ్ – 19 పెంపుడు జంతువు వల్ల వచ్చిందా.. అడవి జంతువుల వల్లా అనేది నిర్థారణ కాలేదని ఆమె అన్నారు. ఈ విషయాన్ని నిర్థారించేందుకు ఇప్పటికే చైనా శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో పరిశోధన జరుగుతోందని సౌమ్య చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులు నిలిపివేయడంపై సౌమ్య స్పందిస్తూ.. ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా డబ్ల్యూహెచ్‌వోకు నమ్మదగిన స్నేహితుడిగా అమెరికా ఉంది. ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిచ్చింది. కేవలం ఆర్థికంగానే కాకుండా సాంకేతికపరమైన సహకారాన్ని కూడా అందించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో అమెరికా తన మనసును మార్చు కొని ప్రపంచ ఆరోగ్య సంస్థకు మరింత తోడ్పాటు అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

First Published:  30 April 2020 6:12 AM IST
Next Story