Telugu Global
National

పెరుగుతున్న మరణాలు... శ్మశానవాటికలో సరిపోని స్థలం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం సాయంత్రం నాటికి 3,314 కరోనా కేసులు నమోదు కాగా, 54 మరణాలు సంభవించాయి. అయితే ఢిల్లీ ఆసుపత్రుల్లో కేవలం స్థానికులే కాకుండా నోయిడా, హర్యాణా, ఆగ్రా నుంచి వచ్చిన బాధితులు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే కాకుండా విదేశీయులు కూడా ఉన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా మరణాలు పెరిగాయి. ముఖ్యంగా మృతదేహాలను పాతిపెట్టే ఆచారం ఉన్న […]

పెరుగుతున్న మరణాలు... శ్మశానవాటికలో సరిపోని స్థలం
X

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం సాయంత్రం నాటికి 3,314 కరోనా కేసులు నమోదు కాగా, 54 మరణాలు సంభవించాయి. అయితే ఢిల్లీ ఆసుపత్రుల్లో కేవలం స్థానికులే కాకుండా నోయిడా, హర్యాణా, ఆగ్రా నుంచి వచ్చిన బాధితులు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే కాకుండా విదేశీయులు కూడా ఉన్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా మరణాలు పెరిగాయి. ముఖ్యంగా మృతదేహాలను పాతిపెట్టే ఆచారం ఉన్న ముస్లింలకు అంత్యక్రియలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన ముస్లిం మతస్థులకు ‘న్యూ సెమెట్రీ ఫర్ మహమ్మదీయన్స్’లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో సగం భూమిని కోవిడ్-19 మృతుల కోసం కేటాయించారు.

అయితే గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు పాతిపెట్టడానికి వస్తుండటంతో శ్మశానవాటిక నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేటాయించిన ఎకరంలో సగం స్థలం అయిపోయిందని.. ఒకే రోజు నాలుగైదు మృతదేహాలను పాతిపెడుతుండటంతో త్వరగా స్థలం అయిపోతోందని సెమెట్రీ సూపర్‌వైజర్ మహమ్మద్ షమీమ్ వెల్లడించాడు.

ఏప్రిల్ 27వ తేదీన ఒకే సారి 7 మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం తీసుకొని వచ్చారు. ఒకే రోజు అన్ని మృతదేహాలు అంత్యక్రియలకు రావడం తన జీవితంలో చూడలేదని అన్నాడు. సమీపంలోని ఆసుపత్రుల నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. ఇప్పటికే సంబంధిత జోన్ పరిధి కాని శవాలకు అంత్యక్రియలు నిర్వహించమని చెప్పినట్లు షమీమ్ స్పష్టం చేశారు.

ఢిల్లీ మున్సిపల్ వర్గాలు కూడా వేరే ప్రాంతాలకు చెందిన వాటికి అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపాడు. ఆసుపత్రుల్లో మరణిస్తే సంబంధిత సిబ్బంది పూర్తి రక్షణ కవచాలు ధరించి మృతదేహాలను తీసుకొని వస్తున్నారు. ఒకరిద్దరు బంధువులను మాత్రమే రానిస్తున్నాం. కానీ ఎవరైనా సరైన రక్షణ పరికరాలు లేకుండా వస్తే బంధవులను కూడా లోపలికి అనుమతివ్వట్లేదని అన్నారు.

సాధారణంగా ఇక్కడ సమాధుల కోసం 4 అడుగుల లోతు తవ్వుతాం. కూలీలను పెట్టి ఆ పని చేయించే వాళ్లం. కాని ఇప్పుడు కోవిడ్-19 కారణంగా మరణించే వారి సమాధి కోసం 10 అడుగుల లోతు గొయ్యి తవ్వాల్సి వస్తోంది. దీనికి జేసీబీని ఉపయోగిస్తున్నాం. జేసీబీ యజమానులు 2 నుంచి 6 వేల వరకు బంధువల నుంచి వసూలు చేస్తున్నారు. సమాధుల స్థలం కోసం ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది… కానీ జేసీబీ చార్జీలపై ఎలాంటి నిబంధనలు లేవని షమీమ్ వెల్లడించాడు. ఇక్కడకు వచ్చే ఇతర ప్రాంతాల మృతదేహాలను వేరే చోటికి పంపిస్తున్నామని… కేవలం ఈ శ్మశానవాటికకు సంబంధించిన జోన్ వాళ్లు చనిపోతేనే అనుమతిస్తున్నామని అన్నారు.

మరోవైపు తనకు ఎలాంటి పీపీఈ కిట్లు అందించలేదని చెప్పాడు. అధికారులను అడిగినా.. మృతదేహాలకు దగ్గరగా వెళ్లకు అని సూచించారు అన్నాడు. ఏదైనా కరోనా లక్షణాలు కనపడితే వెంటనే వైద్య సిబ్బందికి రిపోర్టు చేయాలని చెప్పారు తప్ప మరే విషయాలు తనకు చెప్పలేదని షమీమ్ అంటున్నాడు.

First Published:  30 April 2020 2:29 PM IST
Next Story