కరోనా మరింత కాలం మనతోనే ఉంటుంది... ఏపీ సీఎం వ్యాఖ్యలు సరైనవే...
కరోనాతో రాబోయే కాలంలో కలిసి జీవించాల్సిన అవసరం ఏర్పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. కరోనాతో మరి కొంత కాలం పాటు జీవించకతప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ ఎత్తివేయగానే కరోనా వెళ్లిపోయే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. కరోనా అన్నది వెంటనే సమసిపోయే సమస్య కాదని… మునుముందు కూడా కొనసాగుతుందన్నారు. సరైన వైద్య విధానం కూడా కరోనాకు లేదని… కాబట్టి ఇలాంటి సమయంలో ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం […]
కరోనాతో రాబోయే కాలంలో కలిసి జీవించాల్సిన అవసరం ఏర్పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. కరోనాతో మరి కొంత కాలం పాటు జీవించకతప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్ ఎత్తివేయగానే కరోనా వెళ్లిపోయే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. కరోనా అన్నది వెంటనే సమసిపోయే సమస్య కాదని… మునుముందు కూడా కొనసాగుతుందన్నారు. సరైన వైద్య విధానం కూడా కరోనాకు లేదని… కాబట్టి ఇలాంటి సమయంలో ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం కోసం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్నారు.
ఇది కూడా ఒక సాధారణ జ్వరం లాంటిదే అన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన లక్ష్మీనారాయణ… సాధారణంగా మన ఇళ్లలోని పిల్లలకు జ్వరం వస్తే వారిలో ధైర్యం నింపేందుకు ఏమీ కాదు అని చెబుతుంటామని గుర్తు చేశారు. ప్రస్తుతం టీవీ ఆన్ చేస్తే కరోనా వార్తలే వస్తున్నాయని… ప్రజలు కూడా ఒక విధమైన భయంలో ఉన్నారని… ఇలాంటి సమయంలో ప్రజలకు స్వాంతన చేకూర్చేలా, వారిలో ధైర్యం నింపేందుకు ముఖ్యమంత్రి ఇది కూడా ఒక సాధారణ జ్వరమే భయపడవద్దు అని చెప్పి ఉంటారని.. అలా చెప్పడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్స్ రావడానికి ఇంకా చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి… కరోనా ఇంకా కొద్దికాలం పాటు మనతో ఉండబోతోందని లక్ష్మీనారాయణ చెప్పారు. జాగ్రత్తలు తీసుకుని కరోనాతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కూడా ఇదే చెప్పినట్టుగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఏపీలో ఇటీవల ఎక్కువ కేసులు నమోదు అవడంపైనా లక్ష్మీనారాయణ స్పందించారు.
కంటైన్‌మెంట్ జోన్లలో భారీగా పరీక్షలు నిర్వహించడం వల్లే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో ప్రతి 10 లక్షల మందికి సగటున 453 పరీక్షలు మాత్రమే చేస్తున్నారని.. అదే ఆంధ్రప్రదేశ్‌లో 1400 మందికి పరీక్షలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలా ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరగడం సహజమన్నారు.
ఇటీవల రాష్ట్రాల సీఎస్‌లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కూడా… ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని… ఆ సంఖ్యను చూసి భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్ని లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీలో ఎక్కువ పరీక్షల వల్లే కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.