ప్లాస్మా థెరపీ చట్ట విరుద్దం... కేంద్రం సంచలన ప్రకటన
కరోనా సోకిన వారికి ప్లాస్మా థెరపీ అందిస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్సా విధానం కాదని, ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విధానంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధనలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. ఇంకా ప్రయోగ దశలో ఉన్న ఈ విధానాన్ని ఎవరూ అనుసరించవద్దని.. […]
కరోనా సోకిన వారికి ప్లాస్మా థెరపీ అందిస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్సా విధానం కాదని, ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విధానంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధనలు జరుపుతోందని ఆయన వెల్లడించారు.
ఇంకా ప్రయోగ దశలో ఉన్న ఈ విధానాన్ని ఎవరూ అనుసరించవద్దని.. ఇది రోగులకు మరింత ప్రమాదకరంగా పరిణమించ వచ్చని ఆయన అన్నారు. ప్లాస్మా థెరపీని అనుసరించడం చట్ట విరుద్దమని.. అనసవరంగా దీనిని రోగులపై ప్రయోగించవద్దని ఆయన చెప్పారు.
ప్లాస్మా థెరపీని రోగులకు అందిస్తామని రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్లాస్మా థెరపీపై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఐసీఎంఆర్ ప్లాస్మా థెరపీపై అధ్యయనం పూర్తి చేసి.. ఆ చికిత్సా విధానం సరైనదే అని ధృవీకరించే వరకు దీనిని కేవలం ప్రయోగ పూర్వకంగానే అనుసరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
కరోనా బారిన పడిన రోగి కోలుకున్న తర్వాత అతడి రక్తంలో యాంటీ బాడీస్ రూపొందుతాయి. ఇవి రక్తంలోని ప్లాస్మాలో ఉంటాయి. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను తీసుకొని రోగుల శరీరంలోనికి ఎక్కించడం ద్వారా కరోనాను తగ్గించవచ్చని వైద్యులు భావించారు. దీన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
ఈ విధానంపై ఆసక్తి కనబరిచిన రాష్ట్రాలు… కోలుకున్న రోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చాయి. ఇప్పుడు కేంద్రం ప్లాస్మా థెరపీని అనుసరించవద్దని చెప్పడంతో ఆయా రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి.