Telugu Global
National

దేశంలో తొలిసారిగా ఏపీలో కొవిడేతర రోగులను ఎలా ఆదుకుంటున్నారంటే ?

(ఎస్వీ రావు) “టెలీ మెడిస‌న్ ద్వారా నా భార్య (విజ‌య‌, 37 సంవత్సరాలు) పాంక్రియాస్ కాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ది. గ‌త రెండు రోజుల్లో 144, 101 కాల్ నెంబ‌ర్ల‌కు ఫోను చేసిన వెంటనే మందులు ఎస్ఎంఎస్ పంపించారు. దార్ల‌పూడి గ్రామంలో ఎఎనఎం, వాలంటీర్లు త‌క్ష‌ణ‌మే వ‌చ్చి మందులు అందించి పేషెంట్ వివ‌రాలు తెలుసుకుని చ‌క్క‌గా స్పందించారు.” – సోమిరెడ్డి, దార్ల‌పూడి, రాయ‌వ‌రం మండ‌లం, విశాఖ జిల్లా. “కిడ్నీ స‌మ‌స్య వ‌ల్ల నొప్పి ఎక్కువ కావ‌డంతో వైఎస్ఆర్ టెలీమెడిస‌న్‌కి కాల్ చేశాను. […]

దేశంలో తొలిసారిగా ఏపీలో కొవిడేతర రోగులను ఎలా ఆదుకుంటున్నారంటే ?
X

(ఎస్వీ రావు)

“టెలీ మెడిస‌న్ ద్వారా నా భార్య (విజ‌య‌, 37 సంవత్సరాలు) పాంక్రియాస్ కాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ది. గ‌త రెండు రోజుల్లో 144, 101 కాల్ నెంబ‌ర్ల‌కు ఫోను చేసిన వెంటనే మందులు ఎస్ఎంఎస్ పంపించారు. దార్ల‌పూడి గ్రామంలో ఎఎనఎం, వాలంటీర్లు త‌క్ష‌ణ‌మే వ‌చ్చి మందులు అందించి పేషెంట్ వివ‌రాలు తెలుసుకుని చ‌క్క‌గా స్పందించారు.” – సోమిరెడ్డి, దార్ల‌పూడి, రాయ‌వ‌రం మండ‌లం, విశాఖ జిల్లా.

“కిడ్నీ స‌మ‌స్య వ‌ల్ల నొప్పి ఎక్కువ కావ‌డంతో వైఎస్ఆర్ టెలీమెడిస‌న్‌కి కాల్ చేశాను. వెంట‌నే రిప్ల‌య్ కాల్ వ‌చ్చింది. డాక్ట‌రు గారు నా రోగానికి సంబంధించిన వివ‌రాలు తెలుసుకుని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. అదే రోజు మ‌ధ్యాహ్నం కొన్ని మందుల‌ను మెడిక‌ల్ స్టాఫ్ తో పంపించారు. వాటిని వాడ‌టం వ‌ల్ల నా స‌మ‌స్య త‌గ్గింది. బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో ఈ విధ‌మైన చికిత్స ఉప‌యోగ‌ప‌డింది.” – శ్రీ‌నివాస‌రావు, ఎస్‌వివిఎస్ అపార్ట్‌మెంట్స్, పాయ‌క‌రావుపేట‌, విశాఖ జిల్లా.

… ఈవిధంగా వైఎస్ఆర్ టెలీమెడిసన్ ఆప‌ద‌లో వున్న కోవిడ్ యేత‌ర రోగుల‌ను ఆదుకుంటున్న‌ది.

ఒక వైపు క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుంటే అందులో భాగంగా విల‌విల‌లాడుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇత‌ర్ర‌తా ఆరోగ్య స‌మ‌స్య‌లు ముంచెత్తుతున్నాయి. కోవిడ్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ చికిత్స‌కు సంబంధించిన ఆసుపత్రులు, వైద్యులు మినాహా ఇత‌ర్ర‌తా ఆసుపత్రుల‌ను పూర్తిగా మూసివేశారు… వేలాది మంది కోవిడ్ చికిత్స యేత‌ర డాక్ట‌ర్లు ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు.

ఈ ప‌రిస్థితుల్లో ఆక‌స్మికంగా ఇత‌ర రోగాల బారిన ప‌డిన‌వారు, దీర్ఘ‌కాలిక రోగాల‌తో బాధ‌ప‌డుతూ త‌ర‌చు, నిరంత‌రం చికిత్స అవ‌స‌ర‌మైన రోగులు తీవ్రంగా ఇబ్బంది ప‌డ‌తున్నారు. ముఖ్యంగా కిడ్నీ, హృద‌య, బిపి, షుగ‌ర్, వంటి వ్యాధుల‌తో వేలాది మంది ఇబ్బంది ప‌డుతున్నారు. వీరికి దాదాపుగా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, చికిత్స‌, మందుల అందుబాటు మొద‌లైన‌వి చాలా కీల‌క‌మైన‌వి. ఈ స‌మ‌స్య ప్ర‌తిచోటా వుంది.

అందుబాటులోకి టెలీమెడిస‌న్ విధానం

ఎపీ విష‌యానికి వ‌స్తే ఈ తీవ్ర‌త‌ను గుర్తించిన ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌డంతో పాటు డాక్ట‌ర్ వైఎస్ఆర్ టెలీ మెడిస‌న్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికింద చికిత్స చేయించుకోద‌ల‌చిన రోగులతోపాటు వారికి చికిత్స చేసే వైద్యులు వారికి అనుబంధ సిబ్బంది కూడా రిజిష్ట‌ర్ చేయించుకోవాలి.

ఆ విధంగా ఏపీలో 9,697 రోగులు చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 24న ఒక్క రోజునే 1,302 మంది న‌మోదు చేయించుకున్నారు. డాక్ట‌ర్లు 306 మంది, ఎగ్జిక్యూటివ్స్ 290 మంది న‌మోదు చేయించుకున్నారు. ఈ విభాగం ద్వారా ఇప్ప‌టి దాకా 6,843 టెలీ క‌న్స‌ల్టేష‌న్స్ నిర్వ‌హించ‌గా అందులో 4,316 మందికి చికిత్స అందించి 2,527 మందికి వైద్యులు సూచ‌న‌లు, సల‌హాలు ఇచ్చారు. 2,105 మందికి అవ‌స‌ర‌మైన మందులు ఇత‌రత్ర అత్య‌వ‌స‌రాలు ఇంటికి చేర్చారు.

కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌ను కూడా గుర్తింపు

అదే స‌మ‌యంలో టెలి మెడిస‌న్ ద్వారా చికిత్సలో కోవిడ్ 19 వ్యాధిగ్ర‌స్తుల‌ను కూడా వైద్యులు గుర్తిస్తున్నారు. ఇప్ప‌టి దాకా 119 మందిని గుర్తించ‌గా అందులో నిన్న ఒక్క‌రోజే క‌ర్నూలు, గుంటూరు, తూర్పుగోదావ‌రి, క‌డ‌ప జిల్లాల్లో 10 మందిని గుర్తించారు. అంటే ఈ విధానం రోగ పీడితుల‌కు స‌హాయం అందించ‌డ‌మే కాకుండా క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌ను కూడా గుర్తించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని నిర్ధార‌ణ అయింది.

ఇత‌ర రోగాల‌కు చికిత్స ఏదీ?

కోవిడ్ స‌మ‌స్య రాష్ట్రన్ని, ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్త‌రిస్తుంటే ఆసుపత్రుల మూత వ‌ల్ల ఇత‌ర రోగాల బారిన ప‌డిన‌వారు చికిత్స పొంద‌లేక‌పోతున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌భుత్వం కోవిడ్ ఏత‌ర చికిత్స‌ల‌కు ప్ర‌త్యేక వైఎస్ఆర్‌ టెలిమెడిస‌న్ విధానం ద్వారా ఇప్ప‌టికి 59,101 మందికి వైద్యం అంద‌జేశారు. అందులో అత్య‌ధికంగా తూర్పుగోదావ‌రి 6,372 మొద‌టి స్థానంలోను, అనంత‌పురం 6,039 తో రెండ‌వ స్థానంలోను, చిత్తూరు 5,870 రోగుల‌తో మూడ‌వ స్థానంలోను నిలిచాయి.

ఇక ఆరోగ్య చికిత్స‌లు, రోగాల వారీగా ప‌రిశీలిస్తే గ‌ర్భిణులు 16,311 మందికి చికిత్స అందిస్తే నిన్న (ఏప్రిల్ 24) ఒక్క రోజే 339 మందికి చికిత్స చేశారు. రెస్పిరేట‌రీ థెర‌పీ (ఆర్‌టి) అంటే ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు, ఆస్త‌మా మొద‌లైన‌వాటితో బాధ‌ప‌డుతున్న‌4,060 మందిని ఆదుకున్నారు. విషం బారిన ప‌డిన‌వారు 1,146 మంది చికిత్స పొందారు. ముఖ్య‌మైన రోగాలైన కిడ్నీ బాధితుల్లో 353 మందికి డయాల‌సిస్‌, హృద్రోగంతో బాధ‌ప‌డుతున్న‌వారిలో 1,330 మందికి అత్య‌వ‌స‌ర చికిత్స‌ను చేశారు.

ప‌రిస్థ‌తి ఈ విధంగా వుంటే మ‌రో రూపంలో కూడా సమ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. అవి అనుకోని విధంగా మాన‌వ నిర్ల‌క్ష్యంతో సంభ‌వించే పాముకాటులు. ఆ విధంగా పాముకాటుకు గురైన 705 మందికి ఈ కాలంలో చికిత్స చేసి బ‌తికించారు. ఇత‌ర‌త్రా రోగాల బారిన ప‌డిన‌వారు డ‌యేరీయా, క‌డుపునొప్పి, ర‌క్త గాయాలు మొద‌లైన వాటి బారిన‌ప‌డిన 34,356 మందికి ఈ విధానంలో చికిత్స చేయ‌గా ఏప్రిల్ 24న ఒక్క రోజే 408 మందికి వైద్య‌లు చికిత్స చేశారు.

అన్ని వ‌న‌రులూ సిద్ధం

ఈ చికిత్స‌లో భాగంగా ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు, మందులు, ముఖ్యంగా లైఫ్ సేవింగ్ డ్ర‌గ్స్‌ను ప్ర‌భుత్వం సిద్ధంగా వుంచింది. అందులో భాగంగా వైద్యుల ర‌క్ష‌ణ కోసం 3,18,227 పిపిఇలు (ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్ష‌న్ ఎక్విప్‌మెంట్‌లు) తోపాటు వైద్యు‌లు వినియోగించే ఎన్ 95 మాస్కులు 1,60,228 అందుబాటులో వుంచారు. ఇందుకోసం అవ‌స‌ర‌మైన అంబులెన్సుల‌ను కూడా సిద్ధంగా వుంచారు. కోవిడ్ రోగుల‌ను తీసుకువెళ్లేందుకు ఉప‌యోగిస్తున్న అంబులెన్సుల‌ను ఇక్క‌డ రోగాల కోసం ఉప‌యోగించ‌డం లేదు. కోవిడ్ ఒక‌రి నుంచి ఒక‌రికి సంక్ర‌మించే అవ‌కాశం వున్నందున అంబులెన్సుల విష‌యంలో కూడా ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఎక్కువ ప‌రీక్ష‌లు

రాష్ట్రంలో కోవిడ్ అదుపులోకి రాకుండా మ‌రీ ప్ర‌ధానంగా పైన పేర్కొన్న ఐదు జిల్లాల్లో విస్త‌రిస్తూనే వుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే అధిక సంఖ్య‌లో (ప్ర‌తి మిలియ‌న్ జన‌భా లెక్క‌లోకి తీసుకుంటే) అత్య‌ధికంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల 25 వ తేదీ నాటికి 61,266 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అందులో 1,016 కోవిడ్ బాధితులుగా గుర్తించారు. వీరిలో 31 మంది మ‌ర‌ణించ‌గా 171 మందికి మెరుగుప‌డ‌టంతో (నెగెటివ్‌) ఆసుపత్రుల నుంచి ఇళ్ల‌కు పంపించేశారు.

రాష్ట్రంలో స‌ర్వైలెన్స్‌, రాపిడ్ టెస్టింగ్ అధికంగా వున్నందున (మిగిలిన రాష్ట్రల‌తో పోలిస్తే) పాజిటివ్ కేసులు కూడా (అసింప్ట‌మ్స్‌) బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌నేది ఒక అంచ‌నా. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో వ్యాధికి గురైన‌వారు కోలుకోవ‌డానికి అధిక స‌మ‌యం ప‌డుతుండ‌ట‌తో పాటు మ‌ర‌ణిస్తున్న‌వారు అధికంగానే వున్నారు.

అయితే జాతీయ స‌గటుతో పోలిస్తే ఇది త‌క్కువేన‌ని వైద్యుల విశ్లేష‌ణ‌. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఈ వ్యాధి ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంటాక్ట్‌లోనే వుంది. మొత్తం 1016 కేసుల‌కు గానూ 335 ప్రైమ‌రీ, 119 సెకండ‌రీ కేసులు వున్నాయి. మ‌రో 64 కేసులు ఏ ర‌క‌మైన‌వ‌నేది ఇంకా నిర్ధార‌ణ కావాలి. మిగిలిన రాష్ట్రల‌తో పోలిస్తే ఏపీలో సెకండ‌రీ కేసులు త‌క్కువగానే వుండ‌టం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే అంశం.

First Published:  26 April 2020 7:23 AM IST
Next Story