చావు బతుకుల మధ్య కిమ్ జోంగ్..?
అగ్రరాజ్యం అమెరికా మాట కూడా వినని దేశాధ్యక్షుడు అతను.. సొంత ప్రజలను బానిసలుగా చూసే నియంత అతను. తాత, తండ్రి వారసత్వాన్ని పొంది రాటుదేలిన రాజకీయ నాయకుడతను. ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడుతుంటే క్షిపణి పరీక్షలు చేపట్టిన విచిత్ర మనస్థత్వం అతడిది. ఇప్పటికే అర్థమైయ్యుంటుంది అతనెవరో. అవును అతనే ఉత్తర కొరియా సుప్రిం లీడర్, అధ్యక్షుడు కిమ్ జోంగ్. ఉత్తర కొరియాకు సంబంధించిన అంతర్గత విషయాలు బయటకు పొక్కకున్నా.. అడపాదడపా కిమ్ అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఎదో […]
అగ్రరాజ్యం అమెరికా మాట కూడా వినని దేశాధ్యక్షుడు అతను.. సొంత ప్రజలను బానిసలుగా చూసే నియంత అతను. తాత, తండ్రి వారసత్వాన్ని పొంది రాటుదేలిన రాజకీయ నాయకుడతను. ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడుతుంటే క్షిపణి పరీక్షలు చేపట్టిన విచిత్ర మనస్థత్వం అతడిది. ఇప్పటికే అర్థమైయ్యుంటుంది అతనెవరో. అవును అతనే ఉత్తర కొరియా సుప్రిం లీడర్, అధ్యక్షుడు కిమ్ జోంగ్.
ఉత్తర కొరియాకు సంబంధించిన అంతర్గత విషయాలు బయటకు పొక్కకున్నా.. అడపాదడపా కిమ్ అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఎదో ఒక దేశాన్ని విమర్శిస్తూనో.. క్షిపణి పరీక్షలు చేస్తూనో మీడియాకు లీకులిస్తూ ఉంటాడు. కానీ గత కొన్ని వారాలుగా కిమ్ జోంగ్ ఉన్ అసలు పత్తా లేకుండా పోయారు.
ఉత్తర కొరియా అంతా ఎంతో వైభవంగా జరుపుకునే తన తాత జయంతి ఉత్సవాలకు కూడా ఆయన హాజరుకాక పోవడంతో ఇప్పుడు కిమ్ జోంగ్‌కు ఏమయ్యిందనే అనుమానాలు మొదలయ్యాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడా? కొరియా ప్రభుత్వం ఈ విషయాలను బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
ఉత్తర కొరియాలో అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేది కిమ్ ఇల్ సంగ్ జయంతి వేడుకలు. ఉత్తర కొరియా తొలి అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 1948లో బాధ్యతలు చేపట్టి అతను మరణించే వరకు.. అనగా 1994 వరకు పాలించాడు. దీంతో ఆయన జయంతి ఉత్సవాలను ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజును ‘డే ఆఫ్ ది సన్’గా వ్యవహరించడమే కాక జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.
ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరు కాలేదు. తన తాత జయంతి వేడుకల్లో ఎక్కడా కనిపించకపోవడమే కాకుండా.. కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ సన్‌లో జరిగిన వేడుకల్లో కొంత మంది సీనియర్ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. కనీసం దేశ ప్రజలను ఉద్దేశించి కూడా గత కొంత కాలంగా కిమ్ ప్రసంగాలు చేయడం లేదు.
కరోనాకు సంబంధించిన వార్తలు కూడా ఆ దేశం నుంచి అసలు రావడం లేదు. వీటన్నింటిపై ఉత్తర కొరియా గోప్యత పాటిస్తోంది. కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్, తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఇద్దరూ దేశాధ్యక్షులుగా పని చేశారు. వీరిద్దరూ చైన్ స్మోకర్లు మాత్రమే కాక ఊబకాయులు. వీరిద్దరూ గుండె పోటు తోనే మరణించారు.
వీరి వారసుడైన కిమ్ జోంగ్ ఉన్ కూడా ఊబకాయుడే కాకుండా చైన్ స్మోకర్ కూడా. ఇంతకు మునుపు కూడా శ్వాస సంబంధ వ్యాదులకు కిమ్ చికిత్స తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో అతనికి కనుక కరోనా వస్తే అది మరింత అపాయమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గత కొంత కాలంగా గొంతు సంబంధిత వ్యాదితో బాధపడుతున్నాడు కిమ్.
కాగా, కిమ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని.. ఆయన ఆయుష్షు ఇవాళో రేపో అన్నట్లుగా ఉందంటూ సీఎన్ఎన్ న్యూస్ ఒక వార్తా కథనం ప్రసారం చేసింది. ఈ విషయాలన్నీ అమెరికా ప్రభుత్వంలోని కీలక అధికారి చెప్పినట్లు తెలిపింది.
కాగా, ఈ కథనాన్ని దక్షిణ కొరియా మాత్రం కొట్టి పారేసింది. కిమ్ ఆరోగ్యం గురించి మాకు ఏమీ తెలియదని.. సీఎన్ఎన్ కథనాన్ని మేం నమ్మట్లేదని చెప్పింది.
మరోవైపు ఉత్తర కొరియా మాత్రం కిమ్ ఆరోగ్యం గురించి అసలు స్పందించడం లేదు. దీంతో కిమ్‌కు రహస్యంగా చికిత్స జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆయన వేడుకలకు గైర్హాజరవడంపై రకరకాల కారణాలను చెప్పడం అసమంజసమని మాత్రమే పేర్కొంది.