Telugu Global
National

బాబు, బాలయ్య అవుటాఫ్ సెగ్మెంట్‌

కరోనా విజృంభిస్తున్న వేళ అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు చురుగ్గా ఫీల్డ్‌లో ఉంటున్నారు. పేదలకు సాయం చేయడం, నిరాశ్రయులకు ఆహారం అందించడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు రంగంలోకి దిగి ప్రజల్లో, సిబ్బందిలో మనోధైర్యం కల్పిస్తున్నారు. దాదాపు ఏపీలో ఎమ్మెల్యేలంతా ముఖ్యంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలంతా వారివారి నియోజకవర్గాల్లో ఉంటున్నారు. టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీలో కుప్పం, హిందూపురంలో […]

బాబు, బాలయ్య అవుటాఫ్ సెగ్మెంట్‌
X

కరోనా విజృంభిస్తున్న వేళ అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు చురుగ్గా ఫీల్డ్‌లో ఉంటున్నారు. పేదలకు సాయం చేయడం, నిరాశ్రయులకు ఆహారం అందించడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు రంగంలోకి దిగి ప్రజల్లో, సిబ్బందిలో మనోధైర్యం కల్పిస్తున్నారు.

దాదాపు ఏపీలో ఎమ్మెల్యేలంతా ముఖ్యంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలంతా వారివారి నియోజకవర్గాల్లో ఉంటున్నారు. టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఏపీలో కుప్పం, హిందూపురంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాయలసీమ నుంచి టీడీపీ తరపున ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలవగా వారిలో బాలకృష్ణ, చంద్రబాబు ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు ఏపీలో కనిపించడం లేదు.

చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసానికి పరిమితమయ్యారు. ఆయన ఎవరినీ కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదట. చివరకు మీడియా సమావేశాలు కూడా జూమ్ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచే ప్రభుత్వాలపై విమర్శలు చేయడం, లేఖలు రాయడం, సూచనలు చేయడం చేస్తున్నారు.

దాంతో కుప్పం నియోజకవర్గంలో అధికారులే పనులు చేస్తున్నారు. ఫోన్ ద్వారా కూడా చంద్రబాబు కుప్పంలోని పరిస్థితులపై ఆరా తీస్తున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా ఉండిఉంటే రాష్ట్రాన్ని మొత్తం చూడాల్సి ఉంటుంది కాబట్టి నేరుగా నియోజకవర్గంలో పర్యటించకపోయినా అర్థం చేసుకోవచ్చని… కానీ ఇప్పుడు సీఎంగా లేకపోయినా, కావాల్సినంత సమయం ఉన్నా కుప్పంపై చంద్రబాబు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

అటు బాలకృష్ణది అదే పరిస్థితి. అనంతపురం జిల్లాలో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నది హిందూపురంలోనే. కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరు. దాంతో అధికారులు, మంత్రులే హిందూపురంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

నేరుగా ప్రజల వద్దకు రాని బాలకృష్ణ … ప్రజలకు సూచనలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. ప్రజల మనోధైర్యం ముందు కరోనా ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ విపత్కర సమయంలో పేదలకు, నిరుపేద కార్మికులకు అందరూ అండగా ఉండాలని ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజల కోసం శ్రమిస్తున్న వారి కోసం ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేద్దామని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

చంద్రబాబుగానీ, బాలకృష్ణ గానీ, ఇతర ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజవకర్గంలో పర్యటించాలనుకుంటే వైద్యపరీక్షలు చేసి ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

కానీ లాక్‌డౌన్ నేపంతో ఎమ్మెల్యేలుగా ఉన్న చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు ప్రజలకు దూరంగా సురక్షితంగా మేడల్లో కూర్చుని కబుర్లు చెబుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

First Published:  15 April 2020 3:52 AM IST
Next Story