Telugu Global
International

మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు " ప్రధాని మోడీ

దేశంలో పెరుగుతున్న కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను పొడిగించడం తప్ప వేరే మార్గం లేదని.. ఈ రోజు రాత్రితో ముగియనున్న లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన సీఎంల కాన్ఫరెన్స్‌లో అందరూ లాక్‌డౌన్ పొడిగించమనే చెప్పారు. చాలా మంది మేధావులు, నిపుణులు కూడా లాక్‌డౌన్ పెంచడమే సరైనదని సలహా ఇచ్చారని.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాయని.. […]

మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు  ప్రధాని మోడీ
X

దేశంలో పెరుగుతున్న కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను పొడిగించడం తప్ప వేరే మార్గం లేదని.. ఈ రోజు రాత్రితో ముగియనున్న లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.

మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన సీఎంల కాన్ఫరెన్స్‌లో అందరూ లాక్‌డౌన్ పొడిగించమనే చెప్పారు. చాలా మంది మేధావులు, నిపుణులు కూడా లాక్‌డౌన్ పెంచడమే సరైనదని సలహా ఇచ్చారని.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాయని.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే కరోనా కట్టడిలో భారత్ ఎంతో ముందుందని మోడీ అన్నారు. మన దగ్గర ఒక్క కేసు కూడా నమోదు కాక మునుపే ఎయిర్ పోర్ట్స్‌లో విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ చేపట్టామని, 100 కేసులు దాటకముందే విదేశీ ప్రయాణికులను ఐసోలేషన్‌లో పెట్టడంతో పాటు దేశ వ్యాప్తంగా మాల్స్, థియేటర్లు, పబ్స్, బార్లు అన్నీ మూసేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.

మన దగ్గర 550 కరోనా కేసులు దాటకముందే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామని ప్రధాని అన్నారు. సమస్య పెరిగే వరకు ఏనాడూ ఎదురు చూడలేదని.. కరోనా కట్టడిపై ఎప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వేరే దేశాలతో మనం పోల్చుకోవడం భావ్యం కాదు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం అవడానికి చెబుతున్నానని అన్నారు. కరోనా ప్రారంభ రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పాటే మన దగ్గరా కేసులు నమోదయ్యాయి. కానీ మనం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశాం. ఇప్పుడు ఆయా దేశాల్లో మన దగ్గర కంటే 25 నుంచి 30 రెట్లు ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా అక్కడ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

గత 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశ ప్రజలందరూ విజయవంతం చేశారని, అందుకే కరోనాను దాదాపు చాలా వరకు కట్టడి చేయగలిగామన్నారు. చాలా మంది తినడానికి ఆహారం లేక, ఇండ్ల నుంచి కుటుంబం నుంచి దూరమై చాలా కష్టాలు పడుతున్నారు. కానీ ఈ విపత్తు సమయంలో అందరూ దేశం కోసం ఒక నిబద్దత కలిగిన సైనికుడిలా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని మోడీ కొనియాడారు. లాక్ డౌన్ వల్ల మనకు ఆర్థికంగా నష్టమే. కాని ప్రజల జీవితాలకంటే అదేం అంత ముఖ్యం కాదని ప్రధాని అన్నారు.

రాబోయే రోజుల్లో పేదలు, వలస కూలీలకు మరింత సాయం చేస్తామని అన్నారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతి. ఆయన రచించిన రాజ్యాంగంలోనే ‘వీ ద పీపుల్’ అని ఉంటుంది. అలాగే మన దేశంలోని ప్రజలందరూ కలసి కట్టుగా కరోనాను ఎదుర్కోవడానికి ఆయన జీవితమే స్పూర్తి కావాలని ఆయన అన్నారు. మనందరం లాక్‌డౌన్‌ను సక్రమంగా పాటించి, దేశప్రజలందరూ ఒక్కటే అని చాటించడమే అంబేత్కర్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.

రాబోయే రోజుల్లో కరోనా కట్టడి విజయవంతమైతే హాట్ స్పాట్లు, రెడ్ జోన్లలో ఆంక్షలు సడలించే అవకాశం ఉంటుందని మోడీ చెప్పారు. ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించాలని, తప్పకుండా మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్‌ను పాటించి కరోనా నుంచి విజయం సాధించాలని ఆయన కోరారు.

First Published:  14 April 2020 6:18 AM IST
Next Story