ఏప్రిల్ 30 వరకు తెలంగాణ లాక్‌డౌన్
తెలంగాణ కేబినెట్ నిర్ణయం వైరస్ ప్రభావం తగ్గే వరకు ఇదే కొనసాగింపు రాష్ట్రంలో 243 కంటైన్మెంట్ జోన్లు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్ వెల్లడించిన సీఎం కేసీఆర్ చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి మన దేశంలో కూడా అత్యధిక ప్రభావం చూపిస్తున్న కరోనా కారణంగా కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. మరో మూడు రోజుల్లో లాక్‌డౌన్ పూర్తవుతోందనగా.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు తెలంగాణ రాష్ట్రంలో […]
- తెలంగాణ కేబినెట్ నిర్ణయం
- వైరస్ ప్రభావం తగ్గే వరకు ఇదే కొనసాగింపు
- రాష్ట్రంలో 243 కంటైన్మెంట్ జోన్లు
- 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్
- వెల్లడించిన సీఎం కేసీఆర్
చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి మన దేశంలో కూడా అత్యధిక ప్రభావం చూపిస్తున్న కరోనా కారణంగా కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. మరో మూడు రోజుల్లో లాక్‌డౌన్ పూర్తవుతోందనగా.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయింయింది. శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ పలు విషయాలు వెల్లడించారు.
కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు ఆలోచిస్తామని సీఎం చెప్పారు. ప్రజలందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలని.. ఇది మన సమాజం, మన పిల్లలు, మన భవిష్యత్ సంక్షేమం కోసం నిర్ణయమని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో మర్కజ్ కారణంగా కొన్ని కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయని.. ప్రస్తుతం అక్కడకు వెళ్లిన వారందరినీ, వారితో కాంటాక్ట్ అయిన బంధువుల, మిత్రులందరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో 243 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 123, మిగతా తెలంగాణలో 120 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయన్నారు. వీరందరి క్వారంటైన్ ఈ నెల 24తో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత ఇక కరోనా పాజిటీవ్ కేసులు రావనే అనుకుంటున్నట్లు కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇక శనివారం సీఎంలతో ప్రధాని మోడీ జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరపున పలు విషయాలు విజ్ఞప్తి చేసినట్లు సీఎం చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పని చేయాలని లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రధానికి వివరించినట్లు ఆయన చెప్పారు.
మరోవైపు దాదాపు అన్ని రాష్ట్రాల్లో జీరో రెవెన్యూ ఉంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు క్యూఈ పద్దతిలో డబ్బును ఆర్బీఐ నుంచి పంప్ చేయాలని కోరామన్నారు. అమెరికా జీడీపీలో 10 శాతం, బ్రిటన్‌లో 15 శాతం ఇలాగే పంప్ చేశారు. మన దేశ జీడీపీ 203.85 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో ఐదు శాతం అంటే 10.15 లక్షల కోట్లను ఆర్బీఐ విడుదల చేసినా అవి మనకు అందుబాటులోకి వస్తాయని కేసీఆర్ అన్నారు. క్యూఈ విధానంలో డబ్బును పంప్ చేయడాన్ని ‘హెలీకాఫ్టర్ మనీ’ అంటారు. ఇలా పంప్ చేయడం ద్వారా డబ్బు రొటేట్ అయ్యి మనం తిరిగి పుంజుకునే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు.
అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు లాక్‌డౌన్ కొనసాగించమనే పీఎం మోడీని కోరారు. ఇతర రాష్ట్రాల వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కొందరు సీఎంలు కోరారు. దీనికి పీఎం అంగీకరించలేదు. ప్రస్తుత సమయంలో ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమని కేసీఆర్ చెప్పారు.
ప్రస్తుతం పాఠశాలలను తెరిచి విద్యాసంవత్సరాన్ని కొనసాగించే అవకాశం లేదు కాబట్టి.. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇక పదో తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. త్వరలోనే దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పారు.
ఇక మద్యం షాపులు తెరిచే ప్రసక్తే లేదని.. కేరళలాగా హోం డెలివరీ కూడా చేయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా ధరలు పెంచినా, నిత్యవసర సరుకుల కృత్రిమ కొరత సష్టించినా పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. ఈ విపత్కర సమయంలో దుర్మార్గంగా డబ్బులు సంపాధించుకోవడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదని కేసీఆర్ హెచ్చరించారు.