Telugu Global
National

ప్రధాని నిర్ణయాన్ని ముందే చెప్పేసిన కేజ్రీవాల్

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వచ్చే మంగళవారంతో ఆ గడువు కూడా పూర్తి కావొస్తుండటంతో ఇవాళ ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపు అంశాలపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించడం ద్వారా కరోనాను మరింతగా నియంత్రించవచ్చని మెజార్టీ సీఎంలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, మహారాష్ట్ర, […]

ప్రధాని నిర్ణయాన్ని ముందే చెప్పేసిన కేజ్రీవాల్
X

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వచ్చే మంగళవారంతో ఆ గడువు కూడా పూర్తి కావొస్తుండటంతో ఇవాళ ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపు అంశాలపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించడం ద్వారా కరోనాను మరింతగా నియంత్రించవచ్చని మెజార్టీ సీఎంలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిషా, తెలంగాణ సీఎంలు లాక్‌డౌన్‌ను కొనసాగించడానికే మొగ్గు చూపారు. కాగా, మరి కొందరు సీఎంలు మాత్రం లాక్‌డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరారు.

ఏపీ సీఎం జగన్ కూడా తన అభిప్రాయాన్ని పీఎం మోడీతో పంచుకున్నారు. రాష్ట్రంలో 676 మండలాలు ఉండగా.. కేవలం 81 మండలాల్లోనే కరోనా ప్రభావం ఉందని చెప్పారు. ఆ మండలాలను రెడ్ జోన్లుగా ప్రకటించి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని.. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు సడలించాలని జగన్ కోరారు. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, బార్లను యధావిధిగా మూసేసి ఉంచడం మేలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లాక్‌డౌన్‌ను రెండు వారాల పాటు పొడిగించాలని కోరారు. ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మరో 14 రోజులు పొడిగింపే సరైన నిర్ణయమని ఆయన ప్రధానికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, పీఎం కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రేపు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అప్పుడే లాక్‌డౌన్ నిర్ణయం బయటకు వస్తుందని అందరూ భావించారు. కానీ మిగిలిన రాష్ట్రాల సీఎంలు సమావేశంలో జరిగిన చర్చలను బయట పెట్టకపోయినా.. కేజ్రీవాల్ మాత్రం లాక్‌డౌన్ పొడిగింపు వార్తను బయటపెట్టారు. ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సరైన నిర్ణయం తీసుకున్నారని… చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనం ముందుగానే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవడం వల్లే కరోనాను కట్టడి చేయగలిగామని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

First Published:  11 April 2020 12:31 PM IST
Next Story