Telugu Global
International

అమెరికా, చైనా మాటల యుద్ధం చివరకు డబ్ల్యూహెచ్‌వో మెడకు

కరోనా వైరస్‌పై మొదటి నుంచి అమెరికా, చైనాల మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. ప్రతీ సారి ‘చైనా వైరస్’ అంటూ బాహాటంగానే దుమ్మెత్తి పోస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సారి ఏకంగా డబ్ల్యూహెచ్‌వోపై విరుచుకుపడ్డారు. చైనాకు తొత్తుగా మారిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ వైరస్ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వకుండా తాత్సరం చేసిందని అమెరికా విమర్శలు చేస్తోంది. ఇదే విషయాన్ని రేపు (ఏప్రిల్ 9) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కరోనాపై […]

అమెరికా, చైనా మాటల యుద్ధం చివరకు డబ్ల్యూహెచ్‌వో మెడకు
X

కరోనా వైరస్‌పై మొదటి నుంచి అమెరికా, చైనాల మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. ప్రతీ సారి ‘చైనా వైరస్’ అంటూ బాహాటంగానే దుమ్మెత్తి పోస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సారి ఏకంగా డబ్ల్యూహెచ్‌వోపై విరుచుకుపడ్డారు.

చైనాకు తొత్తుగా మారిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ వైరస్ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వకుండా తాత్సరం చేసిందని అమెరికా విమర్శలు చేస్తోంది. ఇదే విషయాన్ని రేపు (ఏప్రిల్ 9) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కరోనాపై చైనాను నిలదీస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇది క్రమంగా డబ్ల్యూహెచ్‌వో మెడకు చుట్టుకున్నట్లే అనిపిస్తోంది.

అసలు అమెరికాలో భారీ ఎత్తున కరోనా పాజిటీవ్ కేసులు, మరణాలు నమోదు కావడానికి డబ్ల్యూహెచ్‌వో, చైనానే ముఖ్యకారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కరోనా తీవ్రత తెలిసి కూడా ముందుగా హెచ్చరికలు జారీ చేయలేదని ఆయన మండిపడ్డారు.

ఏప్రిల్ 9న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ కరోనా సంక్షోభంపై సభ్య దేశాలకు వివరించనున్నారు. అదే సమయంలో చైనా, అమెరికా ఆరోపణలపై అనధికార చర్చ జరగనుంది. ఈ సమయంలో చైనాను ఉతికి ఆరేయాలని అమెరికా నిర్ణయించింది.

కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధిక నిధులు అమెరికా నుంచే అందుతున్నాయి. అయినా సరే ఆ సంస్థ చైనాకు అనుకూలంగా పని చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ పదవికి 2017లో ఎన్నికలు జరిగినప్పుడు అమెరికా డేవిడ్ నబారోని నిలబెట్టింది. కాగా, ఆ ఎన్నికల్లో చైనా బలపర్చిన టెడ్రో అధనమ్ గెలుపోందారు. దాంతో ఆయన చైనాకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ అమెరికా అంటోంది.

2019 నవంబర్ 17న వూహాన్‌లో తొలి కేసు నమోదు అయితే.. డబ్ల్యూహెచ్‌వో 2020 మార్చి 12న మహమ్మారిగా ప్రకటించిందని.. అంత ఆలస్యంగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని అమెరికా ప్రశ్నిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో మహమ్మారిగా ప్రకటించే సమయానికికే ఆ వైరస్ అమెరికా, యూరోప్‌ లకు పాకిపోయిందని.. యూరోప్‌లో అప్పటికే 1000 మందికి పైగా మరణించారని అమెరికా చెబుతోంది.

చైనాకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ తొత్తుగా వ్యవహరించడం వల్లే ఇంత నష్టం సంభవించిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వోపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న అమెరికా ఆ సంస్థకు ఇవ్వాల్సిన నిధులను నిలిపేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఆ సంస్థపై తీవ్రమైన ఆరోపణలు చేసిన డొనాల్డ్ ట్రంప్.. చైనా అనుకూల వైఖరిపై మండి పడ్డారు. చైనాకు ప్రయాణాలు నిషేధిస్తే డబ్ల్యూహెచ్‌వో వ్యతిరేకించిందని.. ఆ తప్పుడు నిర్ణయమే పలు దేశాల పాలిట శాపమైందని అమెరికా అంటోంది. మరోవైపు అమెరికా నిధులు ఆపేయడంతో పలు దేశాల్లో కరోనా సహాయక చర్యలకు నిధుల కొరత ఏర్పడనుంది.

First Published:  8 April 2020 6:34 AM IST
Next Story