మహిళా క్రికెట్ కు ఇక ప్రత్యేక ప్రసారహక్కులు
టీ-20 ప్రపంచకప్ ఆదరణతో ఐసీసీ ఐడియా 2020 ఫైనల్ ను వీక్షించిన 90 లక్షల మంది ఇప్పటివరకూ పురుషుల క్రికెట్ ద్వారా వచ్చిన ఆదాయం, అండదండలతో తన అస్థిత్వాన్ని కాపాడుకొంటూ వచ్చిన ప్రపంచ మహిళా క్రికెట్ కు… సొంత ఆదాయ వనరులు కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. పురుషుల క్రికెట్ ప్రసారహక్కుల ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయల ఆదాయం నుంచే కొంతమొత్తాన్ని మహిళా క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ వినియోగిస్తోంది. అయితే…ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ […]
- టీ-20 ప్రపంచకప్ ఆదరణతో ఐసీసీ ఐడియా
- 2020 ఫైనల్ ను వీక్షించిన 90 లక్షల మంది
ఇప్పటివరకూ పురుషుల క్రికెట్ ద్వారా వచ్చిన ఆదాయం, అండదండలతో తన అస్థిత్వాన్ని కాపాడుకొంటూ వచ్చిన ప్రపంచ మహిళా క్రికెట్ కు… సొంత ఆదాయ వనరులు కల్పించాలని ఐసీసీ భావిస్తోంది.
పురుషుల క్రికెట్ ప్రసారహక్కుల ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయల ఆదాయం నుంచే కొంతమొత్తాన్ని మహిళా క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ వినియోగిస్తోంది.
అయితే…ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ కు లభించిన ఆదరణ, అత్యధిక జనాదరణతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో… ఉబ్బితబ్బిబయిన ఐసీసీ… ఇక పురుషుల క్రికెట్ నుంచి మహిళల క్రికెట్ ప్రసారహక్కులను వేరు చేసి…విక్రయించాలని నిర్ణయించింది.
టీ-20 ప్రపంచకప్ తో సరికొత్త చరిత్ర…
ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరం పలు సరికొత్త రికార్డులకు నాంది పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య… ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే నిర్వహించిన ఈ మ్యాచ్ కు.. గతంలో ఎన్నడూ లేనంతగా 86వేల 174 మంది ప్రత్యక్షంగా హాజరయ్యారు.
మహిళా క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్ కు ఇంత భారీసంఖ్యలో అభిమానులు హాజరు కావడం ఇదే మొదటిసారి. అంతేకాదు… టీవీ ప్రత్యక్షప్రసారం ద్వారా ఈ మ్యాచ్ ను 90 లక్షల 20వేల మంది భారతీయులు వీక్షించినట్లుగా అధికారిక బ్రాడ్ కాస్టర్ ప్రకటించింది.
ఆస్ట్ర్రేలియాలోని పలు వేదికల్లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకూ… రెండు వారాలపాటు సాగిన ఈటోర్నీని ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 5 కోట్ల 40 లక్షల మంది వీక్షించినట్లు..ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మహిళా క్రికెట్ కు పెరిగిన ఆదరణగా అభివర్ణించింది.
మహిళా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్ చేరిన భారత జట్టు…టైటిల్ సమరంలో మాత్రం స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించలేకపోడం… భారత అభిమానులను తీవ్రనిరాశకు గురిచేసింది. మరోవైపు…ఆస్ట్ర్రేలియా రికార్డుస్థాయిలో ఐదోసారి విశ్వవిజేతగా నిలిచి… సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
ఈ ఆదరణను అవకాశంగా మలచుకొని ప్రపంచ మహిళా క్రికెట్ తనకుతానుగా సంపాదించుకొనే స్థాయికి ఎదగాలని, స్వయం సమృద్ధం కావాలని ఐసీసీ భావిస్తోంది.
అయితే… మహిళా క్రికెట్ కు అంతసీనుందా? పురుషుల క్రికెట్ తో సమానంగా ఆదరణ పొందగలదా?అన్నది అనుమానమే.!