Telugu Global
NEWS

గల్లీగల్లీకో బెల్ట్ షాపు.... యధేచ్చగా మద్యం అమ్మకాలు

కరోనా మహమ్మారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో నిత్యావరాల వస్తువులు అమ్మే దుకాణాలు, మెడికల్ షాపులు, పెట్రోలు బంకులు తప్ప ఇతర వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. గత 10 రోజులకు పైగా మద్యం దుకాణాలు మూసేసి ఉంచడంతో.. చుక్క పడితే కాని పూట గడవని మందుబాబులకు పిచ్చెక్కిపోతోంది. అయితే మద్యం అసలు దొరకట్లేదా అంటే పెద్ద అబద్దమనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మద్యం అమ్మకాలు ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో […]

గల్లీగల్లీకో బెల్ట్ షాపు.... యధేచ్చగా మద్యం అమ్మకాలు
X

కరోనా మహమ్మారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో నిత్యావరాల వస్తువులు అమ్మే దుకాణాలు, మెడికల్ షాపులు, పెట్రోలు బంకులు తప్ప ఇతర వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. గత 10 రోజులకు పైగా మద్యం దుకాణాలు మూసేసి ఉంచడంతో.. చుక్క పడితే కాని పూట గడవని మందుబాబులకు పిచ్చెక్కిపోతోంది.

అయితే మద్యం అసలు దొరకట్లేదా అంటే పెద్ద అబద్దమనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మద్యం అమ్మకాలు ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బెల్టు షాపులు భారీగా వెలిశాయి. అంతే కాకుండా.. ఫోన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికే పట్టుకొచ్చి ఇచ్చే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. వైన్ షాపుల సీల్స్ తీసి.. రాత్రి పూట స్టాకును బెల్టు షాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జంట నగరాలు, శివారు ప్రాంతాల్లో లాక్‌డౌన్ సమయంలో బెల్టు షాపులు వెలిశాయి. సాధారణ రేట్లకంటే మూడింతలు అధిక ధరకు అమ్ముతున్నా.. పెగ్గు పడందే పొద్దుగడవని బ్యాచ్ అక్కడ వాలిపోతున్నారు. 110 విలువైన లైట్ బీరును 300 రూపాయలకు, 130 విలువైన స్ట్రాంగ్ బీరును 350 రూపాయలకు అమ్ముతున్నారు. అయినా సరే కొంటూనే ఉన్నారు.

ఇక విస్కీ, రమ్, బ్రాందీ ఫుల్ బాటిల్స్‌ కూడా భారీ రేటుకు అమ్ముతున్నా డిమండ్ బాగానే ఉంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు అప్పుడప్పుడు నామ్‌ కే వాస్తే దాడులు చేసి మద్యం బాటిళ్లను పట్టుకుంటున్నారు. అది కూడా ప్రజలు పిర్యాదు చేస్తేనే తప్ప వాళ్లు క్షేత్ర స్థాయికి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సివిల్, ఎక్సైజ్ పోలీసుల సహకారంతోనే ఈ అమ్మకాలు సాగుతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి.

గత నెల 21 రాత్రికే మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. ఆ తర్వాతి రోజు జనతా కర్ఫ్యూ, వెంటనే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో సోమవారం రోజు అన్ని మద్యం షాపులకు ఎక్సైజ్ పోలీసులు సీల్ వేశారు. కాని, ఆయా దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వల లెక్కలను మాత్రం చూడలేదు.

ఈ లొసుగును ఆధారంగా చేసుకొని యజమానులు మద్యాన్ని బెల్టు షాపులకు తరలిస్తున్నారు. ఎమ్మార్పీపై రెండింతలకు బెల్ట్ షాపులకు అంటగడితే.. వాళ్లు మూడింతల రేటుకు మందుబాబులకు విక్రయిస్తున్నారు. అంతిమంగా మద్యం ప్రియులే నష్టపోతున్నారు.

మరోవైపు మద్యం విక్రయాలపై పిర్యాదు చేసినా బెల్టు షాపుల యజమానులపై కేసులు కాకుండా బైండోవర్లతో సరిపెడుతున్నారు. దీంతో వాళ్లు తిరిగి అమ్మకాలు చేపడుతున్నారు. మరి ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ అక్రమ అమ్మకాలపై దృష్టిపెడతారో లేదో వేచి చూడాలి.

First Published:  2 April 2020 4:31 AM IST
Next Story