భారత్ లో విజృంభిస్తున్న కరోనా.... నిర్లక్ష్యమే ఈ పరిస్థితులకు కారణమా?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధిని చేజేతులా మనమే పెద్దది చేసి మన నెత్తికి తెచ్చుకున్నామా? ముఖ్యంగా ప్రభుత్వాలు అందులోనూ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల భారతీయ సమాజం మొత్తానికి తీవ్ర సమస్య గా పరిణమించిందా? సమాజం.. ముఖ్యంగా సివిల్ సొసైటీ గా పిలిపించుకునే వర్గాలు, ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పనిచేసేవారు, అందులోనూ వైద్య రంగానికి సంబంధించినవారు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల కూడా సమస్య తీవ్రమైందా ప్రపంచవ్యాప్తంగా కరోనా […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధిని చేజేతులా మనమే పెద్దది చేసి మన నెత్తికి తెచ్చుకున్నామా? ముఖ్యంగా ప్రభుత్వాలు అందులోనూ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల భారతీయ సమాజం మొత్తానికి తీవ్ర సమస్య గా పరిణమించిందా?
సమాజం.. ముఖ్యంగా సివిల్ సొసైటీ గా పిలిపించుకునే వర్గాలు, ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పనిచేసేవారు, అందులోనూ వైద్య రంగానికి సంబంధించినవారు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల కూడా సమస్య తీవ్రమైందా
ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తూ లక్షల సంఖ్యలో బాధితులు అవుతూ.. వేల సంఖ్యలో మరణిస్తున్నందున ఈ సమస్య నుంచి భారతదేశాన్ని అతీతంగా కాపాడటం సాధ్యం కాదు కాబట్టి ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదని వాదించేవారూ వున్నారు. అది ఒక కోణమే అయినప్పటికీ ఆఫ్రికా ఖండంలోని దేశాలతోపాటు సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా, హాంగ్‌కాంగ్, ఉత్తర కొరియా లాంటి అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో సమస్య తీవ్రంగా వుందనే చెప్పాలి.
మరీ ముఖ్యంగా పశ్చిమ తీరంలో వున్న రాష్ట్రలు, అందులోనూ కేరళ, మహారాష్ట్ర, కర్ణటక, గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రలు సమస్య తీవ్రత, వ్యాధి అధికంగా వ్యాప్తి చెందుతుండటంతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి రావడానికి సామాజిక వర్గాలతోపాటు ప్రభుత్వాలది కూడా బాధ్యత వుందనే విషయం మన దేశంలో విస్తరిస్తున్న తీరు, అందుకు సంబంధించిన సమాచారం (డేటా)…. చైనాతో సహా కొన్ని దేశాల్లో అదుపు చేసిన తీరు పరిశీలిస్తే మన నిర్లక్ష్యం స్పష్టంగానే కనిపిస్తోంది.
కరోనా వైరస్‌కు సంబంధించిన చరిత్ర, పూర్వాపరాలు పెద్దగా మనం ఇక్కడ చర్చించాల్సిన పని లేదు. అయితే మూలాల్లోకి వెళ్ళి పరిశీలించినపుడే మనం ఎక్కడ నిర్లక్ష్యం చేశామో అర్ధమవుతుంది. ఈ వ్యాధి 2019 డిసెంబరులో చైనాలోని వ్యూహాన్ నగర ప్రాంతంలో మొదలైంది. ఇపుడు అక్కడ పూర్తిగా అదుపులోకి రావడంతో లాక్‌డౌన్ పరిస్థితిని ఎత్తివేయడం ద్వారా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
చైనాలో అనుసరించిన వ్యూహాలని, పద్ధతులను ఇక్కడ మనం పాటించలేకపోయామా? కరోనా చైనా నుంచి మనకు సంక్రమించలేదా?
భారతదేశానికి సరిహద్దున చైనా వుంది. నిజానికి చైనా నుంచి మనకు ఈ వ్యాధి నేరుగా సంక్రమించలేదనే చెప్పాలి. డిసెంబరులో ఈ వ్యాధి చైనాలో ప్రబలినపుడు వ్యూహాన్ ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఫిబ్రవరి నెలలో (1, 2, 27 తేదీల్లో) ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను కేంద్ర ప్రభుత్వం మన దేశానికి తీసుకువచ్చింది. వారిని క్వారంటైన్‌లో ఉంచిన తరువాత వారి నుంచి ఎటువంటి సమస్యా లేదని నిర్ధారణ కావడంతో ఇళ్లకు పంపించేశారు.
అదే సమయంలో భారతదేశంలో తొలిసారిగా కేరళ రాష్ట్రంలో జనవరి 31, ఫిబ్రవరి 2, 3 (త్రిసూర్, అలపుంజ, కాసరగడ్) లలో కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించారు. అయితే వారంతా చైనా లోని వ్యూహాన్ నుంచి వచ్చిన వారే! వారికి చికిత్స అనంతరం కోలుకోవడంతో ఫిబ్రవరి 14న వారిని డిశ్చార్జి చేశారు. దీనిని బట్టి చైనా నుంచి వచ్చిన వారి నుండి కరోనా వ్యాప్తి చెందలేదని స్పష్టమవుతోంది.
అదే సమయంలో మన దేశంలోని ఈశాన్య ప్రాంతం కానీ, దానికి సరిహద్దున వున్న బంగ్లాదేశ్, మయన్మార్ తదితర దేశాల్లో కానీ ఎక్కడా కూడా అంతగా వైరస్ ప్రభావం లేదనే చెప్పాలి. అంటే భూభాగం పక్కనున్నంత మాత్రాన వ్యాధి సంక్రమించటం లేదు. ఆ మాటకు వస్తే చైనా లోని ఇతర ప్రాంతాలకు వ్యూహాన్ నుంచి కూడా వ్యాప్తి చెందలేదు అనటం కన్నా వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగారు అనటం సబబు. దీనికి ప్రభుత్వాలను, సామాజిక వర్గాలను అభినందించాలి.
మరి మన దేశానికి ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ వ్యాధి గాలి ద్వారానో, ఇతర్రత మార్గాల ద్వారానో సంక్రమించబోదని ఇప్పటికే నిర్థారణ అయింది. అందుకు పైన పేర్కొన్న ఉదాహరణలే స్పష్టం చేస్తున్నాయి. మరి మన దేశంలోకి ఎలా వచ్చింది? అంటే ప్రజా రవాణా వ్యవస్థ (పర్యాటకులు లేదా ఇతర్రతా అవరాల కోసం వివిధ దేశాలు తిరిగేవారు) నుంచి మాత్రమే ఇది మన దేశంలోకి అడుగుపెట్టింది.
ముఖ్యంగా యూరప్, అమెరికా, కెనడా అందులోనూ ఇటలీ నుంచి అధికంగా మన దేశానికి సంక్రమించింది. కేరళలో తొలిసారిగా జనవరి 30న నమోదు అయినప్పటికీ ఫిబ్రవరి నెలలో ఎటువంటి సమస్యా ఎదురు కాలేదు. కానీ మార్చి మొదటి వారం నుంచి మన దేశానికి తీవ్రమవడం మొదలైంది.
మొత్తం కేసులు నమోదు అయినవారిలో అత్యధికులు విదేశాల నుంచి వచ్చినవారే! వారిలో 239 మంది వ్యాధి సంక్రమించిన తరువాత దేశంలో వారు ఉంటున్న ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఎటువంటి అవరోధాలు లేకండా తిరగ గలిగారు. వారికి రోగం వుందని తెలిసినా, తెలియకపోయినా విస్తృతంగా తిరగడం ద్వారా వారు వ్యాధి వ్యాప్తికి కారకులయ్యారు. ఇటలీ, ఆస్ట్రియా నుంచి ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రల్లో కరోనా బలంగా వ్యాప్తి చెందింది.
కేసు నెంబరు 6 నుంచి 27 వరకు (కరోనా భాషలో పి6 నుంచి పి27 వరకు) వ్యాధి బారిన పడ్డవారందరూ ఇటలీ నుంచి వచ్చిన వారే! అందులోనూ పి6 నుంచి పి21 వరకు నేరుగా ఇటలీ నుంచి రాజస్థాన్, హర్యానాలకు వచ్చారు. వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు (పి22 నుంచి పి28 వరకు) సోకింది. అంటే పరోక్షంగా వీరికీ ఇటలీ నుంచి సోకినట్లే. అదే విధంగా 29 నుంచి 37 వరకు (పి29 నుంచి పి37 వరకు) ఇతర రాష్ట్రల్లో ఈ వ్యాధి సోకినవారు ఇరాన్, ఒమన్, ఇటలీ తదితర దేశాల నుంచి వచ్చినవారే!
ఇక ఆ తరువాత వరుసగా ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మహరాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రల్లో ఈ వ్యాధి సోకిన వారిలో అత్యధికులు అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం దేశాల నుంచి తిరిగి వచ్చినవారే! వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కూడా సోకింది. అలాగే బ్రిటన్ నుంచి కూడా మన దేశంలో అనేక మందికి ఈ వ్యాధి చుట్టుకుంది. దీనిని బట్టి మనకు సరిహద్దున వున్న చైనా నుంచి కాకుండా ఎక్కడో దూరంగా వున్న దేశాల నుంచి వచ్చినవారి ద్వారా వ్యాప్తి చెందిందనేది స్పష్టం.
కేరళలో సోకగానే నిర్లక్ష్యం చేశామా?
మన దేశంలో తొలిసారిగా జనవరి 30న కేరళలో కరోనా వైరస్ ను గుర్తించారు. కానీ సమస్య తీవ్రతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మధ్య వరకు తీవ్రంగా పట్టించుకోలేదు. మార్చి 22న జనతా కర్ఫ్యూ ను ప్రధాని మోడీ అమలు చేయించిన తరువాతే కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
అప్పటికే కొన్ని రాష్ట్రలు, ముఖ్యంగా కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర మొదలైనవి తీవ్రంగానే పరిగణించినప్పటికీ అవసరమైన తీవ్రస్థాయిలో చర్యలు చేపట్టలేకపోయాయి. కేరళలో జనవరి 30న తొలి కేసు నమోదు కాగా, మార్చి 4వ తేదీ (మార్చి 4న ఒకే రోజు 22 కేసులు నమోదు అయ్యాయి) వరకు మన దేశంలో సమస్య అంత తీవ్రం కాలేదు. దాంతో సామాజిక వర్గాలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ మనకు అంత సమస్య లేదని భావించినట్లు కనిపిస్తోంది. మార్చి 4న రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.
అయినప్పటికీ సమస్య తీవ్రతకు తగ్గట్టుగా చర్యలు మార్చి 20వ తేదీ వరకు సమ్రగంగా ప్రారంభించలేకపోయారు. కేరళలో తొలుత సోకినపుడు అక్కడి ప్రభుత్వం పటిష్టమైన చర్యలను చేపట్టింది. అయితే వ్యాధి మాత్రం అదుపు కాలేదు. అందుకు కారణం విదేశాల నుంచి మన దేశానికి అధికంగా తరలి రావడమే! దాదాపు ఇప్పటికి 2 లక్షల మంది విదేశాల నుంచి తిరిగి వచ్చారని అనధికారిక అంచనా.
కేరళకు సోకినపుడే పటిష్టమైన విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సివిల్ సొసైటీ అమలు చేసి వుంటే సమస్య ఇంత తీవ్ర రూపం దాల్చి వుండేది కాదేమో.
ఐసిఎంఆర్ ఏం చేస్తోంది?
ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చి ఈ క్లిష్ట సమయంలో ఏం చేస్తోంది? ఇప్పటి దాకా కేవలం 27,688 కేసులను మాత్రమే పరిక్షించింది. అది కూడా మార్చి 13న కళ్ళు తెరిచింది. పైగా రోజు కేసులను పరీక్షించనే లేదు. ఈ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో ప్రామాణికమైనది. ప్రజల వైద్య ఆరోగ్య పరిస్థతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రభుత్వాలను, సమాజాన్ని ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగాన్ని హెచ్చరించాలి. కానీ ఆ పని సమర్ధంగా ఇప్పటికీ చేయలేకపోతోంది.
దేశీయ వైద్య ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి ఏమిటి?
నిజానికి మన దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా వుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మరీ బలహీనంగా వుంది. దేశం మొత్తం, రాష్ట్రల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నామమాత్రంగా తయారయ్యాయి.. ప్రయివేటీకరణ వల్ల కార్పోరేట్ హాస్పటల్స్ మాత్రమే వృద్ధి చెందాయి. ఈ ఆసుప్రతులు కరోనా వ్యాధిగ్రస్తులను ఆదుకునే పరిస్థితి లేదు.
ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య పరిశోధన బాగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వ వైద్యశాలలలో బెడ్లు, వైద్యులు, కనీస సౌకర్యాలు, ప్రధానంగా ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన ఐసియు, వెంటిలేటర్లు చాలా పరిమితంగా వున్నవి. అంతో ఇంతో ఆంధ్రప్రదేశ్ లోనే పరిస్థితి మెరుగ్గా వుంది. అత్యధికంగా 86 వేల బెడ్లు వుండగా అందులో 23,479 ఐసొలేషన్ బెడ్లు, 2,680 ఐసియు బెడ్లు వున్నవి. మొత్తానికి ఇపుడున్న పరిస్థితుల్లో మన వైద్య ఆరోగ్య వ్యవస్థ ప్రజలను ముఖ్యంగా రోగులను ఆదుకునే స్థితిలో లేదు.
– ఎస్. వి. రావ్