Telugu Global
International

త్రిశంఖులో టోక్యో ఒలింపిక్స్?

కరోనా ముప్పు ను రూపుమాపడానికి ఓవైపు ప్రపంచ దేశాలన్నీ ఓవైపు నానాపాట్లు పడుతుంటే… మరోవైపు టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేసే విషయమై అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్యతో పాటు జపాన్ ఒలింపిక్స్ సంఘం సైతం మల్లగుల్లాలు పడుతోంది. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ జపాన్ రాజధాని టోక్యో నగరంలోని 43 రకాల వేదికల్లో జరగాల్సిన ఒలింపిక్స్ నిర్వహణ కోసం జపాన్ ప్రభుత్వంతో పాటు…టోక్యో మెట్రోపాలిటన్ సైతం లక్షల కో్ట్ల రూపాయలను మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేసింది. […]

త్రిశంఖులో టోక్యో ఒలింపిక్స్?
X

కరోనా ముప్పు ను రూపుమాపడానికి ఓవైపు ప్రపంచ దేశాలన్నీ ఓవైపు నానాపాట్లు పడుతుంటే… మరోవైపు టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేసే విషయమై అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్యతో పాటు జపాన్ ఒలింపిక్స్ సంఘం సైతం మల్లగుల్లాలు పడుతోంది.

జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ జపాన్ రాజధాని టోక్యో నగరంలోని 43 రకాల వేదికల్లో జరగాల్సిన ఒలింపిక్స్ నిర్వహణ కోసం జపాన్ ప్రభుత్వంతో పాటు…టోక్యో మెట్రోపాలిటన్ సైతం లక్షల కో్ట్ల రూపాయలను మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేసింది.

అంతేకాదు…పోటీలు వాయిదా వేయటం అంత తేలికకాదని… ఒలింపిక్స్ ను వాయిదా
వేయటం అంటే… శనివారం జరగాల్సిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ను ఆదివారం నిర్వహిస్తామనడం లాంటిది కానేకాదని అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య అధ్యక్షుడు థామస్ బెక్ చెప్పారు.
ఒలింపిక్స్ నిర్వహణ వెనుక గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న కష్టం, ప్లానింగ్, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నాయని థామస్ బెక్ గుర్తు చేశారు.

క్రీడల ప్రారంభానికి మరో నాలుగుమాసాల సమయం ఉందని, ఈ లోగా కరోనావైరస్ అదుపులోకి వస్తే, సాధరణ పరిస్థితులు ఏర్పడితే ..ముందుగా నిర్ణయించిన ప్రకారమే…జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ ఒలింపిక్స్ నిర్వహించాలన్న పట్టుదలతో నిర్వాహక సంఘం ఉంది.

టోక్యోలో సరికొత్త నిర్మాణాలు…

ఒలింపిక్స్ నిర్వహణ కోసం టోక్యో మహానగరంలోని 43 రకాల వేదికలను ఎంపిక చేసి అత్యాధునిక సౌకర్యాలతో తీర్చి దిద్దారు. టోక్యో నగరం నడిబొడ్డునే ఉన్న అత్యంత ఖరీదైన వేదికను 68వేల సీటింగ్ సామర్థ్యంతో.. ప్రధాన స్టేడియంగా తీర్చి దిద్దారు.

ఒలింపిక్స్ ముగిసిన తరువాత అంతర్జాతీయ ప్రదర్శనలకు వేదికగా ఈ ప్రధాన స్టేడియాన్ని ఉపయోగించాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు..ఆగస్టు నెల వరకూ మాత్రమే ఒలింపిక్స్ కోసం ఈ ప్రధాన స్టేడియాన్ని లీజుకు తీసుకొన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఒలింపిక్స్ నిర్వహించాలన్నా ఈ స్టేడియం అందుబాటులో ఉండే అవకాశమే లేదు.

ఒలింపిక్స్ విలేజ్ కూ చిక్కులు…

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, అధికారుల కోసం…టోక్యో బే సమీపంలో 14 నుంచి 18 అంతస్తులతో కూడిన మొత్తం 21 టవర్లను సిద్ధం చేశారు.

ఇందులో ఒలింపిక్స్ కోసం 18వేల పడకలను, ఆ తర్వాత జరిగే పారా ఒలింపిక్స్ కోసం 8 వేల పడకలను అందుబాటులో ఉంచారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ముగిసిన వెంటనే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కు ఈ టవర్స్ ను స్వాధీనం చేయాల్సి ఉంది.

ఒక వేళ ఒలింపిక్స్ వాయిదా పడితే… ఇప్పటికే టవర్స్ లోని అపార్ట్ మెంట్లను బుక్ చేసుకొన్న వేలాదిమందికి భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అంతేకాదు… క్రీడల్లో పాల్గొనటానికి వివిధ దేశాల నుంచి వచ్చే అధినేతలు, ప్రధాన అతిథులు, ప్రముఖులు బస చేయటానికి వీలుగా… టోక్యో నగరంలోని అత్యంత ఖరీదైన హోటెల్ గదులను భారీ అడ్వాన్సులతో ఇప్పటికే బుక్ చేశారు.

క్రీడలు వాయిదా పడితే ఆ అడ్వాన్సులను కోల్పోడంతోపాటు తాజా బుకింగ్ ల కోసం రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఉంది.

అంతర్జాతీయ క్యాలెండర్ గందరగోళం..

ఇప్పటికే ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్, యూరోపియన్ ఫుట్ బాల్ టోర్నీలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఒలింపిక్స్ సైతం వాయిదా పడితే… అంతర్జాతీయ క్రీడాక్యాలెండర్ సైతం ఒక్కసారిగా తారుమారైపోనుంది.

దీనికితోడు…టోక్యోలో భరించలేని ఎండవేడిమి కారణంగా మారథాన్ రేస్ లను జపాన్ ఉత్తరప్రాంత నగరం సప్పోరోవేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు.

అదే ఒలింపిక్స్ వాయిదా పడితే….టోక్యో నగరంలోనే నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడితే మారథాన్ రన్నర్లకు కష్టాలు తప్పవు.

అథ్లెట్ల గోల అథ్లెట్లది…..

కరోనా వైరస్ భయంతో నిర్భయంగా సాధన చేయలేకపోతున్న వివిధ దేశాల అథ్లెట్లు మాత్రం పోటీలను వాయిదా వేయాలంటూ వేయిదేవుళ్లను మొక్కుకొంటున్నారు.

ఇప్పటికే కెనడా ఒలింపిక్స్ సంఘం…తాము టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేయకపోతే బహిష్కరిస్తామంటూ ప్రకటించింది.

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి గత మూడుసంవత్సరాలుగా సన్నాహాలు చేసుకొంటూ, సాధన చేస్తూ కొండంత ఆశతో ఎదురుచూస్తున్న వివిధ దేశాల అథ్లెట్లు… అనుకోని అతిథిలా వచ్చిన కరోనా వైరస్ ముప్పుతో ఒణికిపోతున్నారు.

మరో నాలుగుమాసాలలో జరిగే ఒలింపిక్స్ కు సమాయత్తం కావాలో… లేక క్వారెంటైన్ లో ఉండిపోవాలో అర్థంకాక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కరోనా వైరస్ భయం నడుమ అథ్లెట్లు ఏకాగ్రతతో సాధన చేసే పరిస్థితి లేకుండా పోయిందని, తీవ్రఒత్తిడిలో పడిపోయారని అమెరికా అథ్లెటిక్స్ సమాఖ్య, అమెరికా పారా ఒలింపిక్ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఒలింపిక్స్ నిర్వహించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి.

అంతేకాదు…భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్,చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సైతం…ఒలింపిక్స్ ను వాయిదా వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.

అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ దిగ్గజం కార్ల్ లూయిస్ సైతం…టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన క్రీడాకార్యక్రమాలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయని, కరోనా దెబ్బ నుంచి కోలుకోడానికి, సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని అంటున్నారు.

పరిస్థితి సాధరణ స్థితికి వచ్చిన తర్వాతే ఒలింపిక్స్ నిర్వహిస్తే బాగుంటుందని చెబుతున్నారు. నార్వే ఒలింపిక్స్ సమాఖ్య సైతం.. క్రీడల్ని వాయిదా వేయాలంటూ ఓ లేఖను పంపింది.
కరోనా వైరస్ ను జపాన్ ప్రభుత్వం అదుపు చేసినా క్రీడలు నిర్వహించడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.

ఒలింపిక్స్ బెర్త్ లు సగమే భర్తీ….

టోక్యోనగరం వేదికగా రెండువారాలపాటు సాగే ఒలింపిక్స్ లో 27కు పైగా క్రీడాంశాలలో 204 దేశాలకు చెందిన 12వేలమంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు. వివిధ క్రీడల్లో అర్హత కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీల ద్వారా ఇప్పటికే 51 శాతం బెర్త్ లు పూర్తయ్యాయని, మరో 49 శాతం ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని నిర్వాహక సంఘం చెబుతోంది. మిగిలిన బెర్త్ ల అర్హత కోసం నిర్వహించాల్సిన పోటీలకు కరోనా దెబ్బ తగలడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

ఒలింపిక్స్ కు ఆటంకాలు మామూలే…

1896 ఏథెన్స్ ప్రారంభ క్రీడల నుంచి ఒలింపిక్స్ కు అవాంతరాలు, పరీక్షలు ఎదురుకావడం ఇదే మొదటిసారికాదు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1916, 1940, 1944 ఒలింపిక్స్ రద్దు కాగా… 1936 బెర్లిన్, 1956మెల్బోర్న్, 1964 టోక్యో, 1976 మాంట్రియెల్,1980 మాస్కో ఒలింపిక్స్, 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్.. రాజకీయ కారణాలతో బహిష్కరణలకు గురయ్యాయి.

అయితే…. వైరస్ కారణంగా ఒలింపిక్స్ సందిగ్ధంలో పడటం మాత్రం ఇదే మొదటిసారి. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నామని..నిర్వాహక సంఘంతో సవివరంగా చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకొంటామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు థామస్ బెక్ చెబుతున్నారు.

ఏదిఏమైనా…ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జులై 24న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభంకావడం అంతతేలిక ఏమాత్రం కాబోదు.

First Published:  24 March 2020 1:44 AM IST
Next Story