నాడు ఉపవాసం-నేడు గృహవాసం!
భారత్ వ్యాప్తంగా నేడు జనతా కర్ఫ్యూ 1965 లో శాస్త్రి- 2020లో మోడీ చరిత్ర పునరావృతమవుతూనే ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా మానవాళి ప్రవర్తిస్తే, పేట్రేగిపోతే, పట్టపగ్గాలు లేకుండా పోతే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాగా నా అంతటివాడు లేడంటూ విర్రవీగిపోతే…చివరకు కంటికి కనిపించని వైరస్ ముందు మోకరిల్లక తప్పదని, చిన్నబోక తప్పదని, బ్రతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పదని మరోసారి కరోనా వైరస్ రూపంలో చరిత్ర గుర్తు చేసింది. వందేళ్లకో మహమ్మారి… అడ్డుఅదుపులేకుండా పెరిగిపోతున్న జనాభా చేస్తున్న […]
- భారత్ వ్యాప్తంగా నేడు జనతా కర్ఫ్యూ
- 1965 లో శాస్త్రి- 2020లో మోడీ
చరిత్ర పునరావృతమవుతూనే ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా మానవాళి ప్రవర్తిస్తే, పేట్రేగిపోతే, పట్టపగ్గాలు లేకుండా పోతే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాగా నా అంతటివాడు లేడంటూ విర్రవీగిపోతే…చివరకు కంటికి కనిపించని వైరస్ ముందు మోకరిల్లక తప్పదని, చిన్నబోక తప్పదని, బ్రతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పదని మరోసారి కరోనా వైరస్ రూపంలో చరిత్ర గుర్తు చేసింది.
వందేళ్లకో మహమ్మారి…
అడ్డుఅదుపులేకుండా పెరిగిపోతున్న జనాభా చేస్తున్న విధ్వంసాన్ని అదుపు చేయటానికి ప్రకృతి తనకుతానుగా తీసుకొనే చర్యలు, ప్రతీకారమే ప్రకృతి విలయాలు, భయకరమైన రోగాలు, విపత్తులు. చరిత్రను ఓసారి తిరగేస్తే ప్రతి వంద సంవత్సరాలకు… కలరా, మశూచీ, స్పానిష్ వైరస్ రూపాలలో రోగాలు మానవాళిపై దాడి చేసి… కోట్లమందిని పొట్టనపెట్టుకోడం ఇదే మొదటసారికాదు.
18, 19 శతాబ్దాలలో కలరా,మశూచి లాంటి మహమ్మారిలు ప్రళయం, అంతులేని విధ్వంసం సృష్టిస్తే…ప్రస్తుత 20వ శతాబ్దంలో…కరోనా వైరస్ అనుకోని అతిధిలా దూసుకొచ్చింది.
వూహాన్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా….
చైనాలోని వూహాన్ రాష్ట్రంలో గబ్బిలాల లాలాజలం ద్వారా ఉద్భవించిన కరోనా వైరస్ అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు విస్తరించింది.
ప్రధానంగా విలాసాలు, భోగలాలసత్వానికి, విచ్చలవిడి తనానికి మరోపేరుగా నిలిచే పాశ్చాత్య దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచీకరణ పుణ్యమా ఇంటూ..ఈ మహమ్మారి..జనాభాలో రెండో అతిపెద్ద దేశం భారత్ లో సైతం అడుగుపెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా 114 దేశాలకు పాకిన కరోనా వైరస్..2 లక్షల 80వేల మందికి పైగా సోకింది. ఇప్పటికే 11వేల మందికి పైగా కరోనా మృతులుగా తేలారు.
భారత్ లో సైతం….
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ను సైతం కరోనా వైరస్ తాకింది. విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా ప్రవేశించిన ఈ వైరస్ మృతుల సంఖ్య…మూడుగా మాత్రమే ఉంది.
వైరస్ బారిన పడిన భారతీయుల సంఖ్య 300 పైగా ఉండగా…. 25 మంది విదేశీ పౌరులు సైతం ఉన్నారు. తెలుగు రాష్ట్ర్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో సైతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనా…రెండు రాష్ట్ర్రప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.
జనతా కర్ఫ్యూకి ప్రధాని పిలుపు…
కరోనా వైరస్ కమ్ కోవిడ్ 19 ముప్పు నుంచి బయటపడాలంటే…మార్చి 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశంలోని ప్రతిఒక్కరూ ఇంటిపట్టునే ఉండి జనతా కర్ఫ్యూను పాటించి తీరాలంటూ భారత ప్రధాని పిలునిచ్చారు.
వైద్యసేవలు అందించేవారు, ఇతర అత్యవసర సర్వీసులకు చెందినవారు మాత్రమే తగిన జాగ్రత్తలతో తమ విధులకు హాజరుకావాలని కోరారు.
14 గంటలపాటు దేశంలోని జనమంతా తమ నివాసాలకే పరిమితమై జనతా కర్ఫ్యూని పాటిస్తే…బహిరంగ ప్రదేశాలలో 12 గంటలు మాత్రమే బ్రతికే కోవిడ్-19 వైరస్ ను నివారించడం ఏమంతకష్టంకాబోదని భావిస్తున్నారు.
1965లో శాస్త్రి- 2020లో మోడీ…
1965 యుద్ధసమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి…వారానికి ఒక పూట దేశప్రజలంతూ ఉపవాసం ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఆహారధాన్యాల కొరతను అధిగమించడానికి ఉపవాసమే విరుగుడు అంటూ నాటి ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రజలు పాటించారు.
ఆ తర్వాత…భారత ప్రజలకు …కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ప్రధాని మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపే అతిపెద్ద పిలుపుకావడం విశేషం. 1965 నాటి భారత జనాభాతో నేటి జనాభాను పోల్చిచూస్తే రెండు రెట్లుకు పైగా అధికంగా ఉండటం విశేషం.
భారత ప్రజలు 2020 మార్చి 22న పాటించే జనాతా కర్ఫ్యూనే మానవాళి చరిత్రలో అతిపెద్ద కర్ఫ్యూగా నిలిచిపోనుంది.
నమో కర్ఫ్యూకి ప్రముఖుల మద్దతు..
జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని మోడీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే…భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
దేశప్రజల హితం కోరి ప్రధాని పిలుపునిచ్చారని, ఈనెల 22న అందరమూ జనతా కర్ఫ్యూను పాటించడం ద్వారా కరోనా వైరస్ నివారణకు కలసికట్టుగా కృషి చేసినట్లవుతుందని చెప్పాడు. బాధ్యతగల భారత పౌరులుగా ప్రధాని సూచనలు పాటిద్దామని పిలుపునిచ్చాడు.
కరోనా వైరస్ వ్యాపికి అడ్డుకట్ట వేయటానికి నిరంతరం పాటుపడుతున్న లక్షలాదిమంది వైద్యసిబ్బందికి విరాట్ కొహ్లీ హ్యాట్సాఫ్ చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా.. కరోనాతో పోరాడుతున్న కోట్లాదిమంది సిబ్బందికి రుణపడి ఉంటామని అన్నాడు. అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, కరోనా వైరస్ కు మందు ఏదీలేదని, వ్యక్తిగత శుభ్రత, ముందుజాగ్రత్త చర్యలే తగిన మందు అని తెలిపాడు.
ప్రధానికి బాసటగా నిలుద్దాం- భారత చీఫ్ కోచ్
దేశంలోని కోట్లాదిమంది ప్రజల మేలుకోరి ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటల్ని ప్రతిఒక్కరు వినటమే కాదు…చిత్తశుద్ధితో ఆచరించాలని భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి కోరాడు. క్రికెట్ దేవుడు సచిన్ ,ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ప్రధాని సూచనలను పాటిద్దామంటూ తమతమే సందేశాల ద్వారా పేర్కొన్నారు.
మోడీ పిలుపును గౌరవిద్దా- అశ్విన్
130కోట్లకు పైగా జనాభాతో …ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ లో…కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించాలంటే… ప్రతిఒక్కరూ క్రమశిక్షణ పాటించాల్సిందేనని, నమ్మకం ఉన్నా లేకున్నా… మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును గౌరవించిన వారమవుతామని స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ తన ట్విట్టర్ సందేశం ద్వారా విజ్ఞప్తి చేశాడు. మాజీ స్టార్లు మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ సైతం జనతా కర్ఫ్యూకి మద్దతుగా నిలిచారు.
కుస్తీ వస్తాదులు యోగేశ్వర్ దత్, సాక్షిమాలిక్, వినేశ్ పోగట్, బబిత పోగట్, భారత హాకీ మహిళా కెప్టెన్ రాణి రాంపాల్ సైతం…మోడీ పిలుపునకు తాము కట్టుబడి ఉన్నామని…మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఇంటిపట్టునే ఉండాలని గట్టిగా నిర్ణయించుకొన్నామని ప్రకటించారు.
ఒక విధంగా చెప్పాలంటే…మార్చి 22న భారతజాతి 14 గంటలపాటు స్వయం క్వారెంటైన్ పాటిస్తున్నట్లుగానే భావించాలి మరి.