ఏపీలో లాక్‌డౌన్
సరిహద్దుల మూసివేత ప్రతీ ఇంటికి వెయ్యి రూపాయలు 29న అందరి ఇండ్లకే రేషన్ ప్రజలెవ్వరూ బయటకు రాకండి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం బాటే పట్టింది. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండటంతో కఠిన చర్యలకు పూనుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని.. బయట ఎవరూ తిరగకుండా ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటే దీన్ని అరికట్టవచ్చని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇవాళ కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష […]

- సరిహద్దుల మూసివేత
- ప్రతీ ఇంటికి వెయ్యి రూపాయలు
- 29న అందరి ఇండ్లకే రేషన్
- ప్రజలెవ్వరూ బయటకు రాకండి
- ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం బాటే పట్టింది. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండటంతో కఠిన చర్యలకు పూనుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని.. బయట ఎవరూ తిరగకుండా ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటే దీన్ని అరికట్టవచ్చని ఏపీ సీఎం జగన్ అన్నారు.
ఇవాళ కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసేశాయని.. అందుకే ఏపీకూడా తమ అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ నెల 31 వరకు ఆంధ్రప్రదేశ్‌ను లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నామని.. ఆటోలు, కార్లు, ప్రైవేటు వాహనాలు కూడా రోడ్డెక్కవద్దని ఆయన కోరారు.
కేవలం అత్యవసర సేవల కోసం వినియోగించే వాహనాలను మాత్రం ఇందుకు మినహాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు రావాలని అన్నారు. పాలు, కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని.. ఎవరైనా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అలాంటి వారిపై నిఘా పెట్టిందని సీఎం తెలిపారు.
పేదలు, కూలీలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని.. అందుకే ఈ నెల 29న తెల్లకార్డుదారుల ఇంటికే రేషన్ పంపిస్తామన్నారు. అలాగే ప్రతీ ఇంటికి 1000 రూపాయల చొప్పున ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్, థియేటర్స్, ఫంక్షన్ హాళ్లు మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలు రోడ్లపై గుంపులుగా కూడవద్దని ఆయన ఆదేశించారు. ఇది మన సామాజిక బాధ్యతగా గుర్తించి మసలు కోవాలని జగన్ సూచించారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కాకుండా వారివారి ఇండ్లలోనే ఉండాలని ఆయన చెప్పారు. కాగా, పదో తరగతి, ఇతర పరీక్షలు మాత్రం యధాతథంగా నిర్వహించనున్నట్లు సీఎ జగన్ స్పష్టం చేశారు.