Telugu Global
NEWS

ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటమా?

బ్యాడ్మింటన్ సమాఖ్యను ప్రశ్నించిన సైనా-కశ్యప్ కరోనా ముప్పు ఉన్నా పోటీల నిర్వహణపై ఆందోళన భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్వని పొన్నప్ప అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్యపై మండిపడుతున్నారు. ప్లేయర్ల విలువైన ప్రాణాలతో నిర్వాహక సంఘం ఆటలాడుతోందని, కరోనా వైరస్ హెచ్చరికలు ఉన్నా ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ద్వారా.. ప్లేయర్ల జీవితాలను వైరస్ కు ఎరగావేయాలని నిర్ణయించారా అంటూ ప్రశ్నించారు. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో మార్చి […]

ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటమా?
X
  • బ్యాడ్మింటన్ సమాఖ్యను ప్రశ్నించిన సైనా-కశ్యప్
  • కరోనా ముప్పు ఉన్నా పోటీల నిర్వహణపై ఆందోళన

భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్వని పొన్నప్ప అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్యపై మండిపడుతున్నారు.

ప్లేయర్ల విలువైన ప్రాణాలతో నిర్వాహక సంఘం ఆటలాడుతోందని, కరోనా వైరస్ హెచ్చరికలు ఉన్నా ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ద్వారా.. ప్లేయర్ల జీవితాలను వైరస్ కు ఎరగావేయాలని నిర్ణయించారా అంటూ ప్రశ్నించారు.

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో మార్చి 11 నుంచి 15 వరకూ నిర్వహించిన 110వ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొన్న తైవాన్ ప్లేయర్ కు.. కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా వైద్యపరీక్షల్లో తేలినట్లుగా వార్తలు రావడంతో… భారత క్రీడాకారులు తీవ్రస్థాయిలో స్పందించారు.

లక్షడాలర్ల ప్రైజ్ మనీతో బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన 2020 ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్లో తన భర్త పారుపల్లి కశ్యప్ తో కలసి సైనా నెహ్వాల్ సైతం …తప్పని పరిస్థితుల్లో పాల్గొని వచ్చింది.

టోక్యో ఒలింపిక్స్ కు అర్హత కోసం తగిన ర్యాంకింగ్ పాయింట్లు లేకపోడంతో పురుషుల సింగిల్స్ లో కశ్యప్, మహిళల సింగిల్స్ లో సైనా పోటీకి దిగి…తొలిరౌండ్లోనే పరాజయం పొంది స్వదేశానికి తిరిగి వచ్చారు.

కరోనా వైరస్ ముప్పు ఉందని అందరూ భయపడుతున్న తరుణంలో… ఆల్ ఇంగ్లండ్ టోర్నీని ఎందుకు నిర్వహించారంటూ ఈ జోడీ ప్రశ్నిస్తున్నారు. తమతో కలసి టోర్నీలో పాల్గొన్న తైవాన్ ప్లేయర్ కు కరోనా వైరస్ ఉందని తేలిందని, దీనికి ఎవరు బాధ్యులంటూ నిలదీశారు.

మిక్సిడ్ డబుల్స్, మహిళల డబుల్స్ అంశాలలో పోటీకి దిగిన అశ్వినీ పొన్నప్ప సైతం…తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఒలింపిక్స్ నూ వాయిదా వేయాలి – గోపీచంద్

మరోవైపు… భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మరో అడుగు ముందుకు వేసి… జులై, ఆగస్టు మాసాలలో జపాన్ వేదికగా జరిగే టోక్యో ఒలింపిక్స్ ను సైతం వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు.

అథ్లెట్ల ప్రాణాలకు వైరస్ ముప్పు పొంచి ఉందని, అలానే ప్రజల విలువైన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒలింపిక్స్ ను వాయిదా వేయటం మినహా మరోదారి లేదని తేల్చి చెప్పారు.

ఇదిలాఉంటే… ఒలింపిక్స్ ను వాయిదా వేసే ప్రసక్తేలేదని… జులై నాటికి పరిస్థితి చక్కబడుతుందని, కరోనా వైరస్ పోటీల ప్రారంభంనాటికి సమసిపోతుందని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం, క్రీడల నిర్వాహక సంఘం ధీమాగా చెబుతున్నాయి.

2020 టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ, ఏర్పాట్ల కోసం… జపాన్ ప్రభుత్వం, టోక్యో నగరపాలక వర్గం లక్షల కోట్ల రూపాయలను ఇప్పటికే మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టాయి.

కరోనా వైరస్ దెబ్బతో క్రీడలు వాయిదా పడినా…లేదా రద్దులపద్దులో చేరినా… జపాన్ లాంటి దేశం ఆర్ధికంగా దెబ్బ తినడమే కాదు… దివాళాతీసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  22 March 2020 6:50 AM IST
Next Story