Telugu Global
Others

మతతత్వాన్ని ఓడించిన స్థానిక శక్తి

ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై వ్యాఖ్యాతల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయినాయి. ఈ అభిప్రాయాల్లో చాలావరకు విమర్శనాత్మకమైనవే. తాము నిఖార్సైన సెక్యులర్ వాదులం అనుకునే వారు ఈ విజయాన్ని సానుకూలంగా చూడలేదు. ఈ విజయం రాజకీయంగా తమకు పొసగనిది అనుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని అంశాలపై ఉన్న వైఖరి ప్రభావం సెక్యులరిజం మీద ఉంటుంది కనక వీరు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శ చేసే వారు షాహీన్ బాగ్ విషయంలో ఆమ్ […]

మతతత్వాన్ని ఓడించిన స్థానిక శక్తి
X

ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై వ్యాఖ్యాతల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయినాయి. ఈ అభిప్రాయాల్లో చాలావరకు విమర్శనాత్మకమైనవే. తాము నిఖార్సైన సెక్యులర్ వాదులం అనుకునే వారు ఈ విజయాన్ని సానుకూలంగా చూడలేదు. ఈ విజయం రాజకీయంగా తమకు పొసగనిది అనుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని అంశాలపై ఉన్న వైఖరి ప్రభావం సెక్యులరిజం మీద ఉంటుంది కనక వీరు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శ చేసే వారు షాహీన్ బాగ్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదమిత్థమైన వైఖరి అనుసరించకపోవడాన్ని తప్పు పట్టారు. ఇలాంటి వైఖరి అనుసరించిన వారు రాజకీయ పార్టీలు సకల విషయాల్లో కచ్చితమైన వైఖరి అనుసరించాలనుకుంటారు.

మరి కొంత మంది విమర్శకులు ఆమ్ ఆద్మీ పార్టీ మతపరమైన అంశాలపై స్పష్టమైన విధానం అనుసరించలేదనీ, ఈ విషయాలను ఎన్నికల ప్రచారంలో భాగం చేయలేదని భావించారు. నిఖార్సైన రాజకీయ విధానాలు అనుసరిస్తామనుకునే వారు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే భాష మాట్లాడిందంటున్నారు. దీనివల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పు ఉందని కూడా అన్నారు.

అయితే తమ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి వ్యూహాన్ని అనుసరించకపోలేదు. కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నర్మగర్భమైన హిందుత్వ విధానాలు అనుసరించదన్నారు. ఎన్నికల ప్రచార క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మతపరమైన సంకేతాలాను, చిహ్నాలను వాడడం సెక్యులర్ విధానాలు అనుసరిస్తున్నామనుకునే వారికి ఆందోళన కలిగించింది. మతాల వారీగా ఓటర్లను చీల్చడానికి అవకాశం ఉందని భావించినందువల్ల వీరు ఈ అభిప్రాయానికి వచ్చారు.

ఇటీవలి దిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ సాధించిన ఓట్ల శాతం పెరగడాన్ని చూస్తే ఈ వైఖరి నిజమేననిపిస్తుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ సీట్లను సాధించడాన్ని బట్టి చూస్తే ఎక్కువ మంది ఓటర్లు ఆ పార్టీనే సమర్థించినట్టు అనుకోవచ్చు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం వెనక ఓ నీలి నీడ కూడా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను దేశద్రోహులను అనడం, “గోలీ మారో” లాంటి భాష వాడడం తమ తప్పేనని కొంత మంది బీజేపీ నాయకులు అంగీకరించారు. మరో వేపున ఆమ్ ఆద్మీ పార్టీ సంయమంతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం సత్ఫలితాలు ఇచ్చింది. పరుష పదజాలం వాడడంవల్ల పరిస్థితి వికటించింది అని బీజేపీకీ అర్థమైంది. ఇక ముందు బీజేపీ జాగ్రత్త పడుతుందనుకోవాలా? దీనికి సమాధానం చెప్పాల్సింది బీజేపీనే.

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బయటికి చెప్పకపోయినప్పటికీ కొంత సందిగ్ధత ప్రదర్శించిన మాట వాస్తవం. తాము అమలు చేసిన అభివృద్ధి మీదే ఎక్కువ శ్రద్ధ చూపింది. వ్యూహాత్మకంగా ఇది మెరుగైన వ్యూహమే కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించిన మతపరమైన చిహ్నాలు ఒక మతానికి చెందినవే. మాటల యుద్ధంలో బీజేపీతో తలపడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సిద్ధపడలేదు. కానీ హిందుత్వ వాదన నీరు కారేట్టు చేశారు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని విమర్శించే వారు కేవలం స్థానిక సమస్యల ఆధారంగానే విజయం సాధించింది కనక అది జాతీయ పార్టీగా ఎదిగే అవకాశం లేదంటున్నారు. ఈ విజయం స్థానికమైందే కాని జాతీయ స్థాయిలో ప్రభావం ఉండదంటున్నారు. ఏ పార్టీ ప్రభావాన్ని అయినా పరిమితం చేసి చూడడం పొరపాటే అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలుంటే 62 సీట్లు సంపాదించడమే కాక బీజేపీ విశ్వాసానికి గండి కొట్టింది. అంతకు మించి బీజేపీ జాతీయ స్థాయిలో చేస్తున్న హిందుత్వ ప్రచారంలో పస లేదని కూడా నిరూపించింది.

స్థానిక శక్తి జాతీయ స్థాయిలో విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి ఉపకరించింది. అసత్య ప్రచారాన్ని స్థానిక శక్తి వమ్ము చేయగలదని నిరూపితమైంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీని కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన శక్తిగా చూడకూడదు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సందిగ్ధ రాజకీయాలు ఎక్కువ కాలం పని చేయవు. ఈ రాజకీయాలు రాజకీయ దృకపథాన్ని తాత్కాలికంగానైనా అటకెక్కించాయి. పారమార్థిక సత్యాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గ్రహించాలి. ఆ సత్యం ప్రజల జీవనానికి ఉపకరించాలి. దీనికి అభివృద్ధి అవసరమే. అయితే ఆ జీవనంవల్ల ప్రజలకు శాంతి కూడా ఉండాలి. ప్రజల మధ్య సౌమనస్యం దిల్లీకే పరిమితమైంది కాదు. ఇవి సెక్యులరిజం, విశ్వజనీనతకు సంబంధించిన అంశాలు. స్థానిక ఎన్నికలు విశ్వజనీన అంశాలకు పట్టం కట్టి మతతత్వాన్ని ఓడించగలిగాయి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  18 March 2020 8:38 AM IST
Next Story