ప్రపంచకప్ ఫైనల్లో భారత్ కు గుండెకోత
టైటిల్ సమరంలో భారత మహిళల చిత్తు ప్రపంచక్రికెట్ ఫైనల్స్ లో భారతజట్లు బోల్తా కొట్టడం షరామామూలుగా మారింది. సీనియర్లు, జూనియర్లు, పురుషుల, మహిళలు అన్న తేడాలేకుండా భారతజట్టు.. ఫైనల్స్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత కుర్రాళ్ళు … బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పొందిన బాధను అభిమానులు దిగమింగకముందే… మహిళా టీ-20 ఫైనల్స్ లో సైతం హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టుకు అదే అనుభవం ఎదురయ్యింది. ఒత్తిడితో భారత మహిళల […]
- టైటిల్ సమరంలో భారత మహిళల చిత్తు
ప్రపంచక్రికెట్ ఫైనల్స్ లో భారతజట్లు బోల్తా కొట్టడం షరామామూలుగా మారింది. సీనియర్లు, జూనియర్లు, పురుషుల, మహిళలు అన్న తేడాలేకుండా భారతజట్టు.. ఫైనల్స్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత కుర్రాళ్ళు … బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పొందిన బాధను అభిమానులు దిగమింగకముందే… మహిళా టీ-20 ఫైనల్స్ లో సైతం హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టుకు అదే అనుభవం ఎదురయ్యింది.
ఒత్తిడితో భారత మహిళల చిత్తు…
గ్రూప్ లీగ్ దశలో వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచిన భారతజట్టు…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక, అదీ ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే జరిగిన టైటిల్ సమరంలో మాత్రం స్ఫూర్తిదాయకమైన ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్… మూడు విభాగాలలోనూ దారుణంగా విఫలమయ్యింది.
టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన భారత్…ప్రత్యర్థి కంగారూ జట్టును నిలువరించలేకపోయింది. ఓపెనర్ అలీసా హేలీ- బెత్ మూనీ మొదటి వికెట్ కు 11.4 ఓవర్లలో 115 పరుగుల భారీభాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. హేలీ 75 పరుగులు, మూనీ 78 పరుగుల స్కోర్లు సాధించారు. కంగారూజట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు సాధించడంతోనే మ్యాచ్ భారత్ చేజారిపోయింది.
99 పరుగులకే భారత్ టపటపా…
సమాధానంగా 185 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్..స్కోరుబోర్డు ఒత్తిడితో చిత్తయ్యింది. 19.1 ఓవర్లలో కేవలం 99 పరుగుల స్కోరుకే కుప్పకూలింది. దీంతో 85 పరుగుల తేడాతో నెగ్గిన కంగారూజట్టు…ఐదోసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
ఆస్ట్ర్రేలియా విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మరో ఓపెనర్ బెత్ మోనీకి ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డులు దక్కాయి. విజేత ఆస్ట్ర్రేలియాకు 10 లక్షల డాలర్లు, రన్నరప్ భారత్ కు 5 లక్షల డాలర్లు ప్రైజ్ మనీ దక్కింది.
సరికొత్త రికార్డులు…
ప్రపంచకప్ చరిత్రలో…ప్రస్తుత టోర్నీ వరకూ జరిగిన ఏడు టైటిల్స్ లో ఆస్ట్రేలియానే ఐదుసార్లు విజేతగా నిలిచిన తొలిజట్టుగా చరిత్ర సృష్టించింది. భారత్ తొలిసారిగా రన్నరప్ గా నిలిచింది.
కంగారూజట్టు గత ఏడు ప్రపంచకప్ టోర్నీలలో ఆరుసార్లు ఫైనల్స్ చేరితే…భారత్ కు ఇదే తొలిఫైనల్స్ కావడం మరో విశేషం
అంతేకాదు…. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులు హాజరైన, టీవీల ద్వారా వీక్షించిన ప్రపంచకప్ ఫైనల్స్ గా.. 2020 టోర్నీ రికార్డుల్లో నిలిచింది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ స్టేడియంలో…ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నిర్వహించిన ఈ టైటిల్ సమరానికి గతంలో ఏ మహిళా క్రికెట్ మ్యాచ్ కూ హాజరుకానంత స్థాయిలో 86 వేల 174 మంది అభిమానులు హాజరయ్యారు.
కంగారూ జట్టు 2010, 2012, 2014, 2018, 2020 సంవత్సరాలలో ప్రపంచ టైటిల్ నెగ్గితే…2009లో ఇంగ్లండ్, 2016లో విండీస్ ప్రపంచకప్ విజేతలుగా నిలిచాయి.