Telugu Global
NEWS

మహిళోత్తుంగ తరంగాలు!

ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం భారత నవతరం మహిళలు రంగం ఏదైనా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. పురుషులతో పోటీపడుతూ ఆకాశమే హద్దుగా సాగిపోతున్నారు. తాము ఎంచుకొన్న రంగంలో సాధికారిత సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. క్రీడారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన భారత మహిళామణులను ఓసారి గుర్తు చేసుకొందాం.. భారత మహిళలు వినూత్న ఆలోచనలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త దశాబ్దంలోని తొలిసంవత్సరంలోకి అడుగుపెట్టారు. మిగిలిన రంగాలతో పాటే క్రీడారంగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.పురుషులకు […]

మహిళోత్తుంగ తరంగాలు!
X
  • ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం

భారత నవతరం మహిళలు రంగం ఏదైనా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. పురుషులతో పోటీపడుతూ ఆకాశమే హద్దుగా సాగిపోతున్నారు. తాము ఎంచుకొన్న రంగంలో సాధికారిత సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. క్రీడారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన భారత మహిళామణులను ఓసారి గుర్తు చేసుకొందాం..

భారత మహిళలు వినూత్న ఆలోచనలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త దశాబ్దంలోని తొలిసంవత్సరంలోకి అడుగుపెట్టారు. మిగిలిన రంగాలతో పాటే క్రీడారంగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.పురుషులకు తీసిపోని విధంగా రాణిస్తూ తమకుతామేసాటిగా నిలుస్తున్నారు.

జీవితంలో మాత్రమే కాదు… క్రీడాజీవితంలో సైతం సాధికారిత సాధిస్తూ నవతరం మహిళకు సరికొత్త అర్థం చెబుతూ వారేవ్వా!అనిపించుకొంటున్నారు.

నిత్యనూతనం మేరీకోమ్…

ప్రపంచ క్రీడారంగంలో భారత మహిళలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మేరీ కోమ్ మాత్రమే. మణిపూర్ లోని మారుమూల ప్రాంతం నుంచి ప్రపంచ బాక్సింగ్ లోకి దూసుకువచ్చిన మేరీకోమ్..గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా ఓవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే..అంతర్జాతీయ బాక్సర్ గా జాతీయపతాకాన్ని రెపరెపలాడిస్తూ వస్తోంది.

టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం తో పాటు ప్రతిభకు వయసు, కుటుంబబాధ్యతలు ఏమాత్రం అడ్డుకాదని పదేపదే చాటిచెబుతూ వస్తోంది.

మూడుపదుల వయసులోనూ బహుముఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ..భారత మహిళా సాధికారికతకే నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

పద్మశ్రీ నుంచి పద్మభూషణ్ వరకూ….

భారత 71వ గణతంత్రవేడుకల సందర్భంగా..వివిధ క్రీడలకు చెందిన మొత్తం ఏడుగురు విఖ్యాత అథ్లెట్లకు కేంద్రప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించింది.

బాక్సింగ్ ఎవర్ గ్రీన్ క్వీన్ మేరీ కోమ్ పద్మవిభూషణ్ పురస్కారం అందుకొంది. ప్రపంచ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేత, లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలిగా సైతం సేవలు అందిస్తున్నారు.

2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకొన్న మేరీకోమ్ ఇప్పుడు పద్మవిభూషణ్ కు సైతం ఎంపికకావడం విశేషం.

2008లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ లకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేసిన తర్వాత..ఈ గౌరవం మేరీ కోమ్ కు మాత్రమే దక్కింది. జోర్డాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 51 కిలోల అర్హత పోటీలలో క్వార్టర్స్ కు సైతం చేరుకొని తనలో వాడివేడి ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పింది.

తెలుగుతేజానికి పద్మభూషణ్…

రియో ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకం అందించిన తెలుగుతేజం పీవీ సింధు…దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం వద్మభూషణ్ ను అందుకొంది.

తన కెరియర్ లో ఇప్పటికే ప్రపంచ టైటిల్ తో పాటు రెండు ప్రపంచ రజత, కాంస్య పతకాలు సాధించిన సింధు..2015లో పద్మశ్రీ పురస్కారం సాధించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సబ్-కలెక్టర్ గా ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రపంచ బ్యాడ్మింటన్ లో సింధు తన పతకాలవేట కొనసాగిస్తోంది.

2013లో అర్జున, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను సింధు సొంతం చేసుకొంది. 2019లో వద్మభూషణ్ పురస్కారం అందుకొనితెలుగు రాష్ట్ర్రాలకే గర్వకారణంగా నిలిచింది. త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ కు సైతం నేరుగా అర్హత సంపాదించింది. 2020 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో సైతం సింధు సత్తా చాటుకోడానికి సిద్ధమయ్యింది

సైనాను మరువగలమా…!

ప్రపంచస్థాయిలో భారత మహిళా బ్యాడ్మింటన్ ఉనికిని తొలిసారిగా చాటిచెప్పిన సైనా నెహ్వాల్..మరోసారి ఒలింపిక్స్ కు గురిపెట్టింది.

లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం, ప్రపంచ, ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో రజత పతకాలు సాధించిన భారత తొలి మహిళ గౌరవం మాత్రం సైనా నెహ్వాల్ కే దక్కుతుంది. హర్యానాలో పుట్టి..హైదరాబాద్ లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగిన సైనా…2015లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది.

ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళ సైనా మాత్రమే. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సైనాకు తన కెరియర్ లో 21 అంతర్జాతీయ టైటిల్స్ సాధించిన రికార్డు ఉంది. దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జునతో పాటు పద్మభూషణ్ అవార్డులు సైతం సైనాను వరించాయి. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడానికి
వెటరన్ సైనా ఆఖరిప్రయత్నాలు మొదలుపెట్టింది.

భారత హాకీ మహరాణి….

హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామంలోని జట్కావాలా కుటుంబం నుంచి భారత, ప్రపంచ మహిళా హాకీలోకి దూసుకొచ్చిన క్రీడాకారిణే 25 సంవత్సరాల రాణి రాంపాల్. తండ్రి జట్కాబండి నడిపి తెచ్చిన సంపాదనతోనే జీవించే ఐదుగురు పిల్లల నిరుపేద కుటుంబానకి చెందిన రాణి 13 సంవత్సరాల వయసులోనే హాకీ స్టిక్ చేతపట్టింది. 15 ఏళ్ల చిరుప్రాయంలోనే భారతజట్టులో సభ్యురాలిగా తొలి ప్రపంచకప్ లో పాల్గొంది.

2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ కు భారతజట్టు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించిన రాణికి 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయిలో నిర్వహించిన.. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నిర్వహించిన ఆన్ లైన్ పోలింగ్ లో లక్షా 99వేల 477 ఓట్లు పోలయ్యాయి.

మరో 24 మంది క్రీడాకారులతో ఈ అవార్డు కోసం రాణి రాంపాల్ పోటీపడింది. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఈ ఆన్ లైన్ పోలింగ్ లో పాల్గొన్నారు. చివరకు 25 సంవత్సరాల రాణి రాంపాల్ నే అరుదైన ఈ పురస్కారం వరించింది.

2016 లో అర్జున పురస్కారం అందుకొన్న రాణి నాయకత్వంలోనే భారతజట్టు 2018 ఆసియాక్రీడల హాకీలో రజత పతకం అందుకొంది. భారతజట్టు తరపున 240 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రాణి రాంపాల్ కు 130కి పైగా గోల్స్ సాధించిన రికార్డు సైతం ఉంది.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రాణి రాంపాల్ హాకీ క్రీడనే తన జీవితంగా చేసుకొని సాధికారత సాధించింది. తన కుటుంబానికే ఆలంబనగా, కొండంత అండగా నిలిచింది.

ఫుట్ బాల్ సంచలనం…..

భారత మహిళా ఫుట్ బాల్ కెప్టెన్, డాషింగ్ ఫార్వర్డ్ బాలాదేవీ ఓ అరుదైన ఘనత సంపాదించింది. విదేశీక్లబ్ కాంట్రాక్టు సాధించిన భారత తొలి మహిళా సాకర్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్ కు చెందిన విశ్వవిఖ్యాత సాకర్ క్లబ్ రేంజర్స్ క్లబ్ తో బాలాదేవి కాంట్రాక్టు కుదుర్చుకొంది.

గత నవంబర్ లో జరిగిన సెలెకషన్ ట్రైల్స్ లో పాల్గొన్న బాలాదేవి ఆటతీరుతో సంతృప్తి చెందిన రేంజర్స్ క్లబ్ 18 మాసాల కాంట్రాక్టు కుదుర్చుకొంది. ఈ ఘనత సాధించిన ఆసియా మహిళా తొలి సాకర్ ప్లేయర్ ఘనతను సైతం …29 సంవత్సరాల బాలా దేవీ దక్కించుకోగలిగింది.

58 మ్యాచ్ ల్లో 52 గోల్స్…..

15 సంవత్సరాల వయసులో సాకర్ ఆడుతూ వస్తున్న బాలాదేవి…భారత సీనియర్ జట్టులో సభ్యురాలిగా ఇప్పటి వరకూ ఆడిన 58 గేమ్స్ లో 52 గోల్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది.

భారత దేశవాళీ సాకర్ టోర్నీల్లో 100కు పైగా గోల్స్ తో తనకు తానేసాటిగా నిలిచింది. 2015, 2016 సీజన్లలో భారత అత్యుత్తమ మహిళా ఫుట్ బాలర్ అవార్డులు గెలుచుకొన్న బాలాదేవి…ఓ విదేశీ సాకర్ క్లబ్ కు ఎంపిక కావడంతో మురిసిపోతోంది.

ఈ ఘనత సాధించడం ఓ భారత మహిళగా తనకు గర్వకారణమని బాలాదేవి ప్రకటించింది. భారత మహిళలు సైతం ఫుట్ బాల్ క్రీడలో విదేశీక్లబ్ జట్లకు ఆడగలరని బాలాదేవి చాటి చెప్పింది.

బంగారు బాణం దీపిక కుమారి..

జార్ఖండ్ రాష్ట్ర్రంలోని ఓ ఆటో డ్రైవర్ కుటుంబం నుంచి భారత విలువిద్య క్రీడలోకి చొచ్చుకు వచ్చిన బంగారు బాణమే దీపిక కుమారి. ఒకదశలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ప్రపంచకప్ లో బంగారు పతకంతో పాటు…కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలు సాధించిన దీపిక…2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి సైతం అర్హత సంపాదించింది.

ఇప్పటికే అర్జున పురస్కారం సాధించిన దీపిక జాతీయస్థాయిలో నంబర్ వన్ ఆర్చర్ గా తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తోంది.

ప్రపంచ, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్ లో భారత ఆశాకిరణం దీపికకుమారి మాత్రమే. ఆటోడ్రైవర్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించిన నాన్న స్ఫూర్తితోనే తాను ఈస్థాయికి చేరుకోగలిగానని దీపిక పొంగిపోతోంది.

రిక్షావాలా బిడ్డ స్వప్న బర్మన్…

ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ లో భారత్ కు బంగారు పతకం సాధించిన ఆల్ రౌండ్ అథ్లెట్ స్వప్న బర్మన్…పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్పాయి గురి నుంచి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి ప్రవేశించింది. పరుగు, జంప్, త్రో లాంటి ఏడు అంశాల సమాహారమే హెప్టాథ్లాన్. బహుముఖ క్రీడాంశాలున్న హెప్టాథ్లాన్ లో భారత్ కు ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందించిన తొలి మహిళ స్వప్న బర్మన్. స్వప్న తండ్రి రిక్షావాలా కాగా…తల్లి టీ -ఎస్టేట్ లో కార్మికురాలిగా పనిచేస్తోంది.

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిన స్వప్న…అంతర్జాతీయ అథ్లెట్ గా ఎదగటానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా తన కుటుంబానికి, దేశానికే స్వప్న గర్వకారణం కాగలిగింది.

మెరుపురన్నర్ ద్యుతీ చంద్….

ఒరిస్సాలోని ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ద్యుతీ చంద్…భారత మహిళా అథ్లెటిక్స్ 100, 200 మీటర్ల పరుగులో నంబర్ వన్ రన్నర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

పలు అంతర్జాతీయ పోటీలతో పాటు జకార్తా ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది.పేదరికంతో పాటు..పలు రకాల సమస్యలు, అవాంతరాలను అధిగమించిన ద్యుతీ…తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మాత్రమే కాదు…తన రాష్ట్ర్రానికి, దేశానికే వన్నె తెచ్చింది.

అసోం ఎక్స్ ప్రెస్ హిమా దాస్….

ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత మెరుపుతీగ హిమ దాస్…అసోంలోని ఓ నిరుపేద కుటుంబం నుంచి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించిన భారత తొలి రన్నర్ గా చరిత్ర సృష్టించింది.

జకార్తా ఆసియా క్రీడల రిలే అంశాలలో రెండు బంగారు పతకాలు, మహిళల 400 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన ఘనత హిమదాస్ కు మాత్రమే దక్కుతుంది. మహిళల 400 మీటర్ల రిలే, మిక్సిడ్ రిలే అంశాలలో బంగారు పతకాలు సాధించిన హిమాదాస్ పలు అంతర్జాతీయ టోర్నీలలో సైతం స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా అసోం ఎక్స్ ప్రేస్ గా గుర్తింపు తెచ్చుకొంది.

అసోంలో ముగిసిన ఖేలో ఇండియా గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన హిమ దాస్ భారత నవతరానికే ప్రతీకగా నిలిచింది.యూరోపియన్ అథ్లెటిక్స్ టూర్ లో భాగంగా వివిధ దేశాలలో జరిగిన 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు విభాగాలలో ఐదు బంగారు పతకాలు సాధించి వారేవ్వా అనిపించుకొంది.

మూడువారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. దేశప్రధాని మోడీ నుంచి మాస్టర్ సచిన్ లాంటి దిగ్గజాల తో సైతం వారేవ్వా అనిపించుకొంది.

స్వర్ణ స్వప్నం…

ఆసియా క్రీడల మహిళల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలోని హెప్టాథ్లాన్ లో భారత యువ అథ్లెట్ స్వప్న బర్మన్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

పరుగు, జంప్, త్రో లాంటి బహుముఖ అంశాలతో కూడిన హెప్టాథ్లాన్ లో ఆసియా క్రీడల బంగారు పతకం గెలుచుకొన్న భారత తొలి మహిళగా స్వప్న బర్మన్ రికార్డుల్లో చేరింది.

మోటార్ స్పోర్ట్ లో బుల్లెట్ ఐశ్వర్య…

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మోటార్ బైక్ రేసింగ్ లో పాల్గొనాలంటే మగధీరులే ఒకటికి రెండుసార్లు ఆలోచించడం సాధారణ విషయమే. అయితే..మహిళలు బైక్ రేసింగ్ లో పోటీకి దిగటం…అదీ భారత్ కు చెందిన 23 ఏళ్ల యువతి విశ్వవిజేతగా ఈ ఘనత సాధించడం అపూర్వ ఘటనగా మిగిలిపోతుంది.

హంగెరీలోని వార్పలోటా వేదికగా ముగిసిన ఎఫ్ఐఎమ్ ప్రపంచకప్ మోటార్ రేసింగ్ మహిళ టైటిల్ ను భారత యువతి, బెంగళూరు బుల్లెట్ ఐశ్వర్య పిస్సే నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన భారత తొలిమహిళగా నిలిచింది.

18 సంవత్సరాల వయసు నుంచే మోటార్ బైక్ నడపడం నేర్చుకొన్న ఈ బెంగళూరు యువతి..నిరంతర సాధనతో బైక్ రేసర్ స్థాయికి ఎదిగింది.

దుబాయ్ ఇసుక ఎడారులు, హిమాలయాలలోని మంచుపర్వతాలలో జరిగిన అంతర్జాతీయ బైక్ రేస్ ల్లో పాల్గొని సత్తా చాటుకొంది. మోటార్ స్పోర్ట్ లో అడుగుపెట్టిన ఐదేళ్ల కాలంలోనే ఐశ్వర్య ఆరు జాతీయ టైటిల్స్ తో పాటు…విశ్వవిజేతగా కూడా నిలవడం ద్వారా.. భారత నవతరానికి స్ఫూర్తిగా, గర్వకారణంగా నిలిచింది.

సచిన్ ను మించిన 16 ఏళ్ల షఫాలీ…..

భారత మహిళా క్రికెట్లోకి కేవలం 15 సంవత్సరాల చిరుప్రాయంలోనే ..హర్యానా టీనేజర్ షఫాలీ వర్మ మెరుపులా దూసుకొచ్చింది. అతిపిన్నవయసులో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది.

దూకుడుగా ఆడటానికి, భారీషాట్లు బాదటానికి మరోపేరుగా నిలిచే షఫాలీ చిన్నవయసులోనే అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన యువతిగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును షఫాలీ తిరగరాసింది.2020 మహిళా ప్రపంచకప్ లో భారత్ ప్రధాన అస్త్రంగా నిలిచింది.

లీగ్ దశలోని నాలుగుమ్యాచ్ ల్లోనూ నిలకడగా రాణించడం ద్వారా 161 పరుగులు సాధించడం ద్వారా టీ-20 ల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం సొంతం చేసుకోగలిగింది.

మహిళా క్రికెట్లో మిథాలీ…రాజ్

ప్రపంచ మహిళా వన్డే క్రికెట్లో 6000 పరుగులు సాధించిన భారత తొలి మహిళ హైదరాబాద్ కు చెందిన మిథాలీరాజ్ మాత్రమే. కేవలం 11 ఏళ్ల చిరుప్రాయం నుంచే క్రికెట్ ఆడుతూ వచ్చిన మిథాలీ తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 203 వన్డేలలో 6 వేల 720 పరుగులు సాధించింది.

ఇందులో ఏడు సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2003లో అర్జున పురస్కారం, 2015 లో పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్నమిథాలీకి 2017 లో ఐసీసీ అత్యుత్తమ మహిళా వన్డే క్రికెటర్ అవార్డు సైతం అందుకొన్న ఘనత ఉంది.

200 వికెట్ల తొలిబౌలర్ జులన్….

భారత జట్టుకు ఓపెనింగ్ బౌలర్ గా గత దశాబ్దకాలంగా అరుదైన సేవలు అందిస్తూ వచ్చిన వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి..మరోసారి టాప్ ర్యాంక్ సాధించింది. ఇంగ్లండ్ తో సిరీస్ లో ఏడు వికెట్లు సాధించడం ద్వారా..వన్డే క్రికెట్లో తన వికెట్ల సంఖ్యను 218కు పెంచుకోగలిగింది.

1873 రోజులపాటు నంబర్ వన్…

బెంగాల్ నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన 36 ఏళ్ల జులన్ గోస్వామి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ ను 1873 రోజులపాటు నిలుపుకొన్న ఒకే ఒక్క భారత బౌలర్ గా, భారత తొలి మహిళా క్రికెటర్ గా చరిత్రలో నిలిచిపోయింది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 177 వన్డేలు ఆడిన జులన్ 218 వికెట్లు సంపాదించింది.

మహిళా క్రికెట్ చరిత్రలోనే టాప్ ర్యాంక్ సాధించడంతో పాటు 200 వికెట్లు పడగొట్టిన భారత తొలి మహిళ జులన్ గోస్వామి మాత్రమే. మహిళల వన్డే ప్రపంచకప్ లో శతకం బాదిన భారత తొలిమహిళ ఘనతను హర్మన్ ప్రీత్ కౌర్ సొంతం చేసుకొంది. ఇంగ్లండ్ వేదికగా గత ఏడాది ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో హర్మన్ ప్రీత్ కౌర్ ఈ ఘనత సాధించింది.

టీ-20 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ కు భారతజట్టును తొలిసారిగా చేర్చిన కెప్టెన్ గౌరవాన్ని సైతం హర్మన్ ప్రీత్ కౌర్ సంపాదించింది.

సానియా….వారేవ్వా…!

భారత మహిళా టెన్నిస్ లో ఎందరో క్రీడాకారిణులు ఉన్నా…హైదరాబాదీ షాన్ సానియా మీర్జా తర్వాతే ఎవరైనా. భారత టెన్నిస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత సానియాకు మాత్రమే దక్కుతుంది.

డబ్లుటిఏ సింగిల్స్ టైటిల్, గ్రాండ్ స్లామ్ డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన భారత తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్ సానియా మాత్రమే. మూడు మిక్సిడ్, మూడు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు..ఆరు స్వర్ణాలతో సహా మొత్తం 14 పతకాలు సాధించిన అరుదైన రికార్డు సానియా మీర్జా పేరుతో ఉంది. 2015 మహిళా టెన్నిస్ డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సంపాదించిన భారత తొలి మహిళ సానియా మీర్జా మాత్రమే.

సానియా 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ, 2015లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2016లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకొని..భారత టెన్నిస్ లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం ఏర్పాటు చేసుకొంది.

గత ఏడాదే ఓ మగబిడ్డకు జన్మనివ్వటం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా..కఠోరసాధనతో పునరాగమనం చేసి… తల్లిహోదాలో హోబర్ట్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సాధించింది.అదృష్టం కలసి వస్తో టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనాలని కలలు కంటోంది.

చదరంగరాణి కోనేరు హంపి…

ప్రపంచ చదరంగం మహిళల విభాగంలో భారత మహిళల సత్తాను చాటుతున్న తెలుగుతేజం కోనేరు హంపి…ఓ బిడ్డకు తల్లిగా అరుదైన విజయాలు సాధించడం ద్వారా.. ప్రపంచ రెండోర్యాంకులో నిలిచింది. ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ టైటిల్ సాధించడం ద్వారా పడిలేచిన కెరటంలా తిరిగి ప్రపంచ చెస్ లోకి దూసుకు వచ్చింది.

మేరీ కోమ్ నుంచి కోనేరు హంపి వరకూ…ఎందరో మహిళా మణులు తాము ఎంచుకొన్న క్రీడల్లో సాధికారిక విజయాలు, రికార్డులు సాధించడం ద్వారా… క్రీడారంగంలోనూ భారత మహిళలు వేరెవ్వరికీ తీసిపోరని నిరూపించారు.

First Published:  8 March 2020 2:15 PM IST
Next Story