Telugu Global
NEWS

అధికారుల అత్యుత్సాహంతో జగన్‌ కు చెడ్డ పేరు

ఉగాదినాడు ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మందికి ఇళ్ళపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎన్నికల హామీలలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోనున్నారు. అంతవరకూ సంతోషమే. నిరుపేదలకు నిలువనీడ దొరకడం ఆనందదాయకమే. అయితే అధికారుల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ అది గుర్తించినట్లే ఉన్నారు. అందుకే బలవంతపు భూసేకరణ చేయవద్దని అధికారులకు పదేపదే చెప్పారు. అయినా చాలామంది అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదు. అనేకచోట్ల అసైన్డ్‌ భూములను బలవంతంగా సేకరిస్తున్నారు. […]

అధికారుల అత్యుత్సాహంతో జగన్‌ కు చెడ్డ పేరు
X

ఉగాదినాడు ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మందికి ఇళ్ళపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎన్నికల హామీలలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోనున్నారు. అంతవరకూ సంతోషమే.

నిరుపేదలకు నిలువనీడ దొరకడం ఆనందదాయకమే. అయితే అధికారుల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ అది గుర్తించినట్లే ఉన్నారు. అందుకే బలవంతపు భూసేకరణ చేయవద్దని అధికారులకు పదేపదే చెప్పారు. అయినా చాలామంది అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదు. అనేకచోట్ల అసైన్డ్‌ భూములను బలవంతంగా సేకరిస్తున్నారు.

బలవంతంగా అని ఎందుకంటున్నారంటే… అక్కడి మార్కెట్‌ వ్యాల్యూలో చాలా తక్కువ ధరను ప్రభుత్వం ఇవ్వజూపుతోంది. ప్రభుత్వ రికార్డులలో భూమి ధరకు, వాస్తవ మార్కెట్‌ ధరకు చాలా తేడా ఉంటోంది. కానీ ప్రభుత్వం మాత్రం రెండున్నర రెట్లు కాంపెన్సేషన్‌గా ఇస్తానంటోంది. నిజానికి చాలా చోట్ల ప్రభుత్వం ఇస్తానన్న ధర కన్నా మార్కెట్ ధర ఐదారు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందుకే చాలామంది తమ భూములను భూసేకరణకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కోర్టుల్లో కేసులు కూడా వేస్తున్నారు. చివరకు హైకోర్టు కూడా బలవంతపు భూ సేకరణ ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది.

ప్రభుత్వ అధికారులు మాత్రం మేము బలవంతంగా భూ సేకరణ చేయడం లేదు… భూ యజమానులు ఇష్టంతోనే ఇస్తున్నారు… అని చెబుతున్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కూడా బలవంతపు భూ సేకరణ చేయడం లేదని కోర్టుకు చెప్పారు. అదే నిజమైతే మరి ఆ భూ యజమానులు కోర్టులకు ఎందుకు ఎక్కుతున్నట్లు?…

చివరికి అధికారులు ఎంతగా తెగించారంటే… రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లు వేసి అమ్మేసిన స్థలానికి కూడా భూ సేకరణ కింద నోటీసులు ఇచ్చారు. ఇల్లు కట్టుకుందామని ప్లాట్లు కొనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? వాళ్ళు కొన్న ధరలో ఐదో వంతు కూడా ఇప్పుడు కాంపెన్సేషన్‌గా రావడం లేదు.

అలాగే అసైన్డ్‌ భూములే కాకుండా స్వాతంత్ర్య సమరయోధులకు, మాజీ సైనికులకు ఇచ్చిన స్థలాలకు కూడా కొందరు అధికారులు అత్యుత్సాహంతో ఈ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. ఎప్పుడో 60, 70 ఏళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ఇప్పుడు ప్రభుత్వం లాక్కోవడం అంటే ఎంత అన్యాయమో ఈ అధికారులకు పట్టడం లేదు.

మరికొందరు అధికారులు రోడ్డు పక్కన ఉండే కమర్షియల్‌ స్థలాలకు కూడా భూ సేకరణ కింద నోటీసులు ఇచ్చారు. ఎకరం 4, 5 కోట్లు చేసే ఈ భూమికి 70, 80 లక్షలు పరిహారంగా ఇస్తామని చెబుతున్నారు. పేదలకు ఇచ్చే పట్టాల కోసం ఇంత ఖరీదైన కమర్షియల్‌ స్థలాలను సేకరించాల్సిన అవసరం ఉందా? అన్ని లక్షల కాంపెన్సేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?

జగన్‌ ప్రభుత్వం అవినీతిని అంతం చేస్తామని చెబుతోంది. కానీ అధికారులు మాత్రం విలువైన భూములకు ఎడాపెడా భూ సేకరణ నోటీసులు ఇచ్చి లిస్టులోంచి వాళ్ళ భూములు తీసేయ్యాలంటే… అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కూడా భూ సేకరణ జరిగింది. అంతా ఆనందంగా భూములు ఇచ్చారు. ఎందుకంటే కాంపెన్సేషన్‌ వాస్తవ ధర కన్నా చాలా ఎక్కువ ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం చాలామందికి వాస్తవ ధర కన్నా మూడోవంతో నాలుగోవంతో ముట్టే పరిస్థితి. అందుకే ఎక్కువ మంది భూ యజమానులు బాధపడుతున్నారు.

జగన్ భావించినట్లుగా బలవంతపు భూ సేకరణ వద్దనుకుంటే ఇష్టం లేని వాళ్ల దగ్గరనుంచి భూ సేకరణ నిలిపివేయాలి. అలాగే పరిహారం పెంచితే ఎక్కువ మంది సంతోషంగా తమ భూములను ప్రభుత్వానికి ఇస్తారు. కాబట్టి పరిహారమన్నా పెంచాలి.

First Published:  5 March 2020 8:12 AM IST
Next Story