"షేక్ హ్యాండ్ వద్దు.. విదేశాలకు వెళ్లొద్దు.... టవల్ / కర్చీఫ్ లేకుండా తుమ్మొద్దు"
హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు వ్యవహారంపై.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఏకంగా.. వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, పురపాలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంపై చర్చించారు. ప్రజలకు కీలక సూచనలు చేశారు. కరోనా నివారణకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కొంత కాలం పాటు విదేశాలకు యాత్రలు వద్దని.. అత్యంత సన్నిహితులైనా సరే షేక్ హ్యాండ్ వద్దని.. దగ్గు, […]
హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు వ్యవహారంపై.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఏకంగా.. వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, పురపాలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంపై చర్చించారు. ప్రజలకు కీలక సూచనలు చేశారు. కరోనా నివారణకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
కొంత కాలం పాటు విదేశాలకు యాత్రలు వద్దని.. అత్యంత సన్నిహితులైనా సరే షేక్ హ్యాండ్ వద్దని.. దగ్గు, జలుబు ఉన్న వాళ్లు టవల్, కర్చీఫ్ దగ్గర పెట్టుకోవాలని.. తుమ్ములు వస్తే వాటిని అడ్డు పెట్టుకోవాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సోకితే చనిపోతారన్న వదంతుల్లో వాస్తవం లేదని.. వ్యాధిగ్రస్తుల్లో మరణించిన వారు 3 శాతం కూడా లేరని చెప్పారు. వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
కరోనా సోకిన వ్యక్తిని గాంధీ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డులో ఉంచామని.. అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రత్యేక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి.. 11 మంది ఆర్ఎంఓలు, 9 మంది స్పెషలిస్టు వైద్యులు, 20 మంది నర్సులు, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, అయిదుగురు సీనియర్ రెసిడెంట్లు, 12 మంది పేషెంట్ కేర్ సిబ్బంది, ఆరుగురు హెల్ప్ డెస్క్ సిబ్బంది.. దశలవారీగా పని చేస్తున్నట్టు వివరించారు.
కరోనా లక్షణాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు 040 2465 1119 నంబరును అందుబాటులోకి తెచ్చారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఈ నంబర్ ను సంప్రదించాలని కోరారు. ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం, ఒళ్లు.. గొంతు.. తల.. ఛాతి నొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం, పొడి దగ్గు, ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు ఉంటే.. సంప్రదించాలని, పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.