సొంతంగానే పరీక్షలు రాస్తాం... వీణా వాణి
తెలంగాణకు చెందిన అవిభక్త కవలలు వీణా వాణి.. పట్టుదలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. తలలు అతుక్కుని పుట్టిన ఆ ఇద్దరు అమ్మాయిలు.. శారీరక సమస్యలు అధిగమిస్తూ.. చదువుపై ప్రదర్శిస్తున్న శ్రద్ధతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసే దశలో ఉన్న వీణావాణి.. పరీక్షలను తాము సొంతంగానే రాస్తామని.. ఎవరి పరీక్షలను వారే రాసుకుంటామని.. తమకు ఏ ట్యూటర్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టేట్ హోంలో ఉంటున్న ఈ ఇద్దరిని అధికారులు గత ఏడాది […]

తెలంగాణకు చెందిన అవిభక్త కవలలు వీణా వాణి.. పట్టుదలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. తలలు అతుక్కుని పుట్టిన ఆ ఇద్దరు అమ్మాయిలు.. శారీరక సమస్యలు అధిగమిస్తూ.. చదువుపై ప్రదర్శిస్తున్న శ్రద్ధతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసే దశలో ఉన్న వీణావాణి.. పరీక్షలను తాము సొంతంగానే రాస్తామని.. ఎవరి పరీక్షలను వారే రాసుకుంటామని.. తమకు ఏ ట్యూటర్ అవసరం లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాద్ స్టేట్ హోంలో ఉంటున్న ఈ ఇద్దరిని అధికారులు గత ఏడాది ఆగస్టులో పదో తరగతిలో చేర్పించారు. తమకు శారీరకంగా ఉన్న సమస్యనే.. బలంగా మార్చుకుంటూ వారు చదువుకున్న తీరు.. ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకరు పుస్తకాన్ని పట్టుకుంటే.. మరొకరు అద్దంలో చూసి చదువుకునే ప్రయత్నం చేయడం.. ఒకరు పుస్తకం పట్టుకుని చెబుతుంటే మరొకరు రాస్తుండడం లాంటి చర్యలతో.. తమకు తామే సాటి అని ఈ బంగారు తల్లులు నిరూపించుకుంటున్నారు.
అన్నీ ఉన్నా ఏవీ లేవని బాధపడే వారికి.. ఈ ఇద్దరూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదో తరగతి స్థాయిలో ప్రతి సబ్జెక్టునూ వీరు ఒడిసిపట్టారు. పరీక్షలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించారు.
చదువుపై ఉన్న వీరి ఆసక్తిని గమనించిన అధికారులు.. స్టేట్ హోంకు సమీపంలోనే ఎగ్జామ్ సెంటర్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత తెలివితో ఇద్దరూ పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం.. అసిస్టెంట్ల అవసరం లేదని చెప్పడం.. తమ జీవితాన్ని తామే అభివృద్ధి చేసుకోవాలన్న పట్టుదల చూపడం.. వీణావాణి లను నిజంగానే ప్రత్యేకంగా నిలుపుతోంది.
పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఈ అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.