'దొంగలతో దోస్తీ' కథనంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం... ఈనాడుపై దావాకు సిద్దం !
ప్రముఖ తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిషన్‌లో శనివారం బ్యానర్ ఐటెంగా వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులు చాలా బాగా పని చేస్తున్నారని.. ఫ్రెండ్లీ పోలీస్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. నెంబర్ వన్ పోలీసులుగా పేరు తెచ్చుకుంటున్న తెలంగాణ పోలీస్‌పై అసంబద్ద, అబద్ద కథనాలు ప్రచురించడం తీవ్ర విచారకరమైన విషయమని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు […]
ప్రముఖ తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిషన్‌లో శనివారం బ్యానర్ ఐటెంగా వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులు చాలా బాగా పని చేస్తున్నారని.. ఫ్రెండ్లీ పోలీస్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. నెంబర్ వన్ పోలీసులుగా పేరు తెచ్చుకుంటున్న తెలంగాణ పోలీస్‌పై అసంబద్ద, అబద్ద కథనాలు ప్రచురించడం తీవ్ర విచారకరమైన విషయమని ఆయన అన్నారు.
రాజకీయ నాయకులు చెప్తే పోలీసులకు పోస్టింగ్‌లు వస్తాయనేది అవాస్తవమని.. బదిలీల కోసం డిపార్ట్‌మెంట్‌లో ప్రత్యేక విభాగం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని.. తాము రాసిన కథనానికి ఆధారాలు ఇవ్వాలని లేకుంటే క్షమాపణలు చెప్పాలని ఆయన ఈనాడు ఎడిటర్‌ను డిమాండ్ చేశారు. అవాస్తవాలు ప్రచురించినందుకు గాను 1000 కోట్ల రూపాయల దావా వేస్తామని ఆయన హెచ్చరించారు.
నిరాధార వార్తలు రాస్తే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్
గత ఆరేళ్లుగా హైదరాబాద్ నగరం చాలా శాంతియుతంగా ఉందని.. కాని కొన్ని మీడియా సంస్థలు నిరాధార వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. పోలీసులపై కూడా ఆధారాలు లేకుండా వార్తలు వస్తున్నాయని ఆయన చెప్పారు. మీడియాలో కథనాలు ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండాలన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే సహించమని హెచ్చరించారు. దేశంలోనే బెస్ట్ పోలిసింగ్‌గా నిలిచామని, బదిలీలు, ప్రమోషన్లు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని సీపీ పేర్కొన్నారు.
ఈనాడుపై చట్ట ప్రకారం చర్యలు : సజ్జనార్
పోలీసులను, వారి పని తీరును అవమానించేలా ఈనాడు రాసిన కథనం చాలా అభ్యంతరకరమని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పోలీసులు పని చేస్తున్నారని.. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని సీపీ స్పష్టం చేశారు.
ఎవరైనా పోలీసు అధికారులు తప్పు చేశారని తమ దృష్టికి వస్తే వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాని పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు కథనాలు రాయడం బాధాకరమన్నారు. ఈనాడు దినపత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
వెంటనే వివరణ ఇవ్వాలి : అడిషనల్ డీజీపీ
దొంగలతో దోస్తీ పేరుతో అసంబద్ద కథనాలు రాసిన ఈనాడు వెంటనే ఆ కథనంపై వివరణ ఇవ్వాలని శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ జితేందర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాయడం సరికాదన్నారు. మరోవైపు ఈనాడు కథనంపై తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపిరెడ్డి మండిపడ్డారు. పోలీస్ అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటుదన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇలాంటి వార్తలు ప్రచురించడం వలన పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడుపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.