వివాదాల ప్రపంచకప్ సర్కిల్ స్టయిల్ కబడ్డీ
భారత్ పాల్గొనడంపై విచారణకు ఆదేశం పాకిస్థాన్ వేదికగా ముగిసిన ఆరవ ప్రపంచ సర్కిల్ స్టయిల్ కబడ్డీ టోర్నీలో భారతజట్టు ప్రభుత్వ అనుమతి లేకుండా పాల్గొనడం, ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో పరాజయం పొందడం పైన భారత క్రీడామంత్రి కిరణ రిజ్జూ విచారణకు ఆదేశించారు. ఫైసలాబాద్ వేదికగా ముగిసిన తొమ్మిది దేశాల ఈ ప్రపంచకప్ టోర్నీలో భారతజట్టు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్టుగానే ఆడి ఫైనల్స్ చేరింది. అయితే ..ఆతిథ్య పాకిస్తాన్ చేతిలో భారత్ […]
- భారత్ పాల్గొనడంపై విచారణకు ఆదేశం
పాకిస్థాన్ వేదికగా ముగిసిన ఆరవ ప్రపంచ సర్కిల్ స్టయిల్ కబడ్డీ టోర్నీలో భారతజట్టు ప్రభుత్వ అనుమతి లేకుండా పాల్గొనడం, ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో పరాజయం పొందడం పైన భారత క్రీడామంత్రి కిరణ రిజ్జూ విచారణకు ఆదేశించారు.
ఫైసలాబాద్ వేదికగా ముగిసిన తొమ్మిది దేశాల ఈ ప్రపంచకప్ టోర్నీలో భారతజట్టు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్టుగానే ఆడి ఫైనల్స్ చేరింది. అయితే ..ఆతిథ్య పాకిస్తాన్ చేతిలో భారత్ తొలిసారిగా ఓటమి పొంది రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
విజేత పాకిస్థాన్ జట్టు 10 లక్షల రూపాయలు, రన్నరప్ భారత్ ఏడున్నర లక్షల రూపాయలు, ఆస్ట్ర్రేలియా 5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ సొంతం చేసుకొన్నాయి.
ఇమ్రాన్ అభినందనలతో వివాదం…
భారత్ లోని పంజాబ్, పాకిస్థాన్ లోని లాహోర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన సర్కిల్ స్టయిల్ కబడ్డీలో నలుగురు సభ్యులతో కూడిన జట్టు మాత్రమే బరిలో నిలుస్తుంది. కుస్తీకి దగ్గరగా ఉండే సర్కిల్ స్టయిల్ కబడ్డీకి…సాంప్రదాయ కబడ్డీకి ఎంతో తేడా ఉంది.
సాంప్రదాయ కబడ్డీలో ఏడుగురు సభ్యుల జట్టు, పాయింట్ల విధానంతో పాటు నిబంధనలు సైతం వేరుగా ఉంటాయి. పంజాబ్ లోని సిక్కు మతస్తుల్లో ఈ సర్కిల్ స్టయిల్ కబడ్డీకి విశేష ఆదరణ ఉంది. పాకిస్థాన్ లోని పంజాబ్ లో సర్కిల్ స్టయిల్ కబడ్డీ అంటే చెప్పలేని మక్కువ.
ప్రపంచ అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య గుర్తింపు లేకున్నా..గత ఆరు సంవత్సరాలుగా…ప్రపంచకప్ సర్కిల్ స్టయిల్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు.
భారత్ ఇప్పటికే ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిస్తే…పాకిస్తాన్ జట్టు తొలిసారిగా 2020 ప్రపంచకప్ ట్రోఫీ అందుకొంది. ఫైనల్లో తొలిసారిగా భారత్ పై పాక్ జట్టు నెగ్గడంతో…పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ జట్టును అభినందించిన తీరు వివాదాలకు దారితీసింది. యుద్ధంలో భారత్ పై పాక్ విజయం సాధించినంతగా అక్కడి అభిమానులు, ప్రముఖులు, చివరకు పాక్ ప్రధాని సైతం పొంగిపోడాన్ని, సంబరాలు జరుపుకోడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
ప్రభుత్వ అనుమతి లేకుండా భారతజట్టు పాల్గొనడంపై విచారణకు కేంద్రక్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ఆదేశించారు.
ఇది అనధికారిక టోర్నీ మాత్రమే…
ప్రపంచ సర్కిల్ స్టయిల్ కబడ్డీకి గుర్తింపు లేదని, ఇది కేవలం అనధికారిక టోర్నీ మాత్రమేనని, పంజాబ్ లోని ఐదుసంస్థలకు చెందిన ఆటగాళ్లు వ్యక్తిగత హోదాలో మాత్రమే పాల్గొన్నారని విచారణలో తేలింది.
సిక్కు గురువు గురునానక్ దేవ్ 550 జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో తాము వ్యక్తిగత హోదాలో పాల్గొన్నామని, సరైన వీసాలతోనే లాహోర్ వెళ్లివచ్చామని పోటీలలో పాల్గొని వచ్చిన సభ్యుల ప్రతినిధులు చెబుతున్నారు.
మరోవైపు…ఇది అనధికారిక టోర్నీ అయితే ..తాము చేయగలిగింది ఏమీలేదని, వ్యక్తిగత హోదాలో ఎవరు ఏదైనా చేయవచ్చునని క్రీడామంత్రిత్వశాఖ వర్గాలు అంటున్నాయి.