Telugu Global
NEWS

జిమ్నాస్టిక్స్ లో ఉజ్ బెక్ జిమ్నాస్ట్ సరికొత్త చరిత్ర

44 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ కు అర్హత టోక్యో ఒలింపిక్స్ కు చుసోవిటినా సన్నాహాలు శరీరాన్ని విల్లులా వచ్చి ..360 డిగ్రీల కోణంలో విన్యాసాలు చేసే జిమ్నాస్టిక్స్ క్రీడ లో యువక్రీడాకారులు మాత్రమే రాణించగలరని భావిస్తే అంతకు మించి పొరపాటు మరొకటిలేదని ఉజ్బెకిస్థాన్ వెటరన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా చాటి చెప్పింది. 44 సంవత్సరాల లేటు వయసులో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా.. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని, జిమ్నాస్టిక్స్ టీనేజర్ల క్రీడ ఏమాత్రం […]

జిమ్నాస్టిక్స్ లో ఉజ్ బెక్ జిమ్నాస్ట్ సరికొత్త చరిత్ర
X
  • 44 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ కు అర్హత
  • టోక్యో ఒలింపిక్స్ కు చుసోవిటినా సన్నాహాలు

శరీరాన్ని విల్లులా వచ్చి ..360 డిగ్రీల కోణంలో విన్యాసాలు చేసే జిమ్నాస్టిక్స్ క్రీడ లో యువక్రీడాకారులు మాత్రమే రాణించగలరని భావిస్తే అంతకు మించి పొరపాటు మరొకటిలేదని ఉజ్బెకిస్థాన్ వెటరన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా చాటి చెప్పింది.

44 సంవత్సరాల లేటు వయసులో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా.. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని, జిమ్నాస్టిక్స్ టీనేజర్ల క్రీడ ఏమాత్రం కాదని నిరూపించింది.

తాష్కెంట్ కు చెందిన ఒక్సానా… 20 సంవత్సరాల తన కుమారుడితో కలసి సాధన చేస్తూ… టోక్యో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

8వ ఒలింపిక్స్ కు ఒక్సానా తహతహ….

44 సంవత్సరాల ఒక్సానా తన వయసులో నాలుగోవంతైనా లేని జిమ్నాస్ట్ లతో తలపడటానికి సిద్ధమయ్యింది. తన కెరియర్ లో ఇప్పటికే ఏడుసార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న అసాధారణ రికార్డు ఒక్సానాకు ఉంది.

1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో అలనాటి సోవియెట్ యూనియన్ జట్టు లో సభ్యురాలిగా ..ఒక్సానా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సోవియెట్ ముక్కలు చెక్కలు కావడంతో… ఉజ్బెకిస్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తోంది.

టీమ్ విభాగంలో సభ్యురాలిగా బంగారు పతకాలు అందుకొన్న ఒక్సానా వ్యక్తిగతంగా పతకాలు సాధించడానికి ..ఆ తర్వాత 16సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.

2008 బీజింగ్ ఒలింపిక్స్ లో వ్యక్తిగతంగా రజత పతకం సాధించింది.

లుకేమియాతో పోరు….

తన కుమారుడు అలీ షేర్ కు లుకేమియా వ్యాధి చికిత్స కోసం తాత్కాలికంగా జిమ్నాస్టిక్స్ ను ఒక్సానా విడిచిపెట్టింది. చికిత్స తర్వాత కుమారుడు కోలుకోడంతో తిరిగి కొనసాగించింది.

33 మిలియన్ జనాభా మాత్రమే ఉన్న ఉజ్బెకిస్థాన్ తరపున అత్యధిక ఒలింపిక్స్ లో పాల్గొనడంతో పాటు…. అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్ గా నిలిచిన ఒక్సానా చుసోవిటినా చిత్రంతో …. అక్కడి ప్రభుత్వం ఓ తపాలా బిళ్లను సైతం విడుదల చేసి గౌరవించింది.

2016లో ముగిసిన రియో ఒలింపిక్స్ లో పాల్గొనడం ద్వారా …. వరుసగా ఏడు ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి జిమ్నాస్ట్ గా ప్రపంచరికార్డు నెలకొల్పింది.

గాయాల భయం…

ఒలింపిక్స్ కోసం తాను ప్రాక్టీసు చేస్తున్న సమయంలో తన 20 సంవత్సరాల కుమారుడు తెగభయపడిపోతూ ఉంటాడని, ఈ వయసులో కొనసాగటం అవసరమా అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడని ఒక్సానా గుర్తు చేసుకొంది. తనకు కొడుకు ఎంత ముఖ్యమో… జిమ్నాస్టిక్స్ సైతం అంతే ప్రధానమని ఒక్సానా మురిసిపోతూ చెబుతుంది.

తన కెరియర్ లో టోక్యో ఒలింపిక్సే ఆఖరి క్రీడలని, ఆ తర్వాత రిటైర్ కావడం ఖాయమని ప్రకటించింది. తాను జిమ్నాస్ట్ గా కెరియర్ ప్రారంభించిన సమయంలో ఒక్క ఒలింపిక్స్ లో పాల్గొన్నా చాలునని భావించానని…అయితే అనూహ్యంగా ఎనిమిది ఒలింపిక్స్ లో పాల్గొనటాన్ని మించిన అదృష్టం మరొకటి లేదని చెప్పింది.

దశాబ్దాల చరిత్ర కలిగిన ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో 44 సంవత్సరాల వయసులో పాల్గొంటున్న ఒకే ఒక్క, ఏకైక మహిళా జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా కావడం ఓ అరుదైన ఘనతగా, ప్రపంచ రికార్డుగా, చరిత్రగా మిగిలిపోనుంది.

రిటైర్మెంట్ తర్వాత తాష్కెంట్ లో ఓ జిమ్నాస్టిక్స్ అకాడమీ నెలకొల్పి ఉజ్భెక్ భావి జిమ్నాస్ట్ లను తీర్చిదిద్దాలని ఒక్సానా భావిస్తోంది.

First Published:  15 Feb 2020 8:30 PM GMT
Next Story