Telugu Global
Others

ఆర్థికాభివృద్ధి ఆమడ దూరం

వస్తు వినియోగం, పెట్టుబడులు, స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గిపోయిన నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నికరమైన చర్యలు తీసుకుంటారని, పెట్టుబడులు ఊపందుకుంటాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని ఆశించాం. ధరలు పెరిగిపోవడం, గత జనవరి నుంచి రెపో రేటు 135 పాయింట్లు తగ్గడంవల్ల ద్రవ్య విధానంలో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేకపోయింది. ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అనుకున్నాం. నిర్మాణాత్మక చర్యలు తీసుకుని ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఈ బడ్జెట్ […]

ఆర్థికాభివృద్ధి ఆమడ దూరం
X

వస్తు వినియోగం, పెట్టుబడులు, స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గిపోయిన నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నికరమైన చర్యలు తీసుకుంటారని, పెట్టుబడులు ఊపందుకుంటాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని ఆశించాం. ధరలు పెరిగిపోవడం, గత జనవరి నుంచి రెపో రేటు 135 పాయింట్లు తగ్గడంవల్ల ద్రవ్య విధానంలో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేకపోయింది.

ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అనుకున్నాం. నిర్మాణాత్మక చర్యలు తీసుకుని ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఈ బడ్జెట్ లో అపారమైన అవకాశం ఉంటుందనుకున్నాం. బడ్జెట్ కు ముందు వెలువరించిన ఆర్థిక సర్వేలో “నికరమైన పెట్టుబడులు తరగి పోవడం, వినియోగం తగ్గడం, 2018-19 రెండవ ఆరు నెలల కాలంలో, 2019-20 మొదటి ఆరు నెలల కాలంలో స్థూల జాతీయోత్పత్తి తగ్గినందువల్ల ప్రభుత్వం తనకు ఉన్న బలం ఆధారంగా ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయవలసిన ఆవశ్యకత ఉంది” అని పేర్కొనడంవల్ల 2020-21లో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే చర్యలు తీసుకుంటారని భావించాం.

దురదృష్టవశాత్తు ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో సమస్య ఉందని అంగీకరించనే లేదు. ఈ ప్రసంగంలో “ఆర్థిక వ్యవస్థ పునాది పటిష్ఠంగానే ఉంది. స్థూల ఆర్థిక వ్యవస్థ పదిలంగానే ఉంది” అని చెప్పారు. సమస్య ఉందని గ్రహించనప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించడం కష్టమే. బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగినా మార్కెట్లను, ప్రజలను ఉత్సాహపరిచే చర్యలు ఏమీ లేవు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గొప్ప లక్ష్యాలు మాత్రం ఆర్థిక మంత్రి ప్రకటించారు.

పెట్టుబడులను ప్రోత్సహించే చర్యలు మాత్రం ఈ బడ్జెట్ ప్రసంగంలో పూజ్యం. పెట్టుబడులు పెరగడానికి అనుకూల చర్యలు, వినియోగం పెంచడానికి, ఎగుమతులు పెంచడానికి ఈ బడ్జెట్ లో ఉత్సాహం కలిగించే ప్రతిపాదనలు ఏమీ లేవు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం, భూమి కౌలుకు ఇవ్వడం లేదా కాంట్రాక్టు సేద్యం రాష్ట్రాలు తీసుకోవలసిన చర్యలే. సబ్సిడీల వ్యవస్థను సంస్కరించడానికి, వ్యవసాయ రంగంలో నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయోత్పత్తులను నిలవచేయడాం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి కిందటేడాది బడ్జెట్ అంచనాలకన్నా 2.83 లక్షల కోట్లు ఎక్కువ ఉన్నా అది వెరసి 2.5 శాతం మాత్రమే. సవరించిన అంచనాల ప్రకారం అది 13.2 శాతమే.

అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అన్న లక్ష్యం చేరుకోవడానికి ఆర్థిక మంత్రి వచ్చే అయిదేళ్లలో రూ. 103 ట్రిలియన్ల పెట్టుబడి సమకూరుస్తామని చెప్పారు. ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టవలసింది ప్రైవేటు రంగమే. ప్రభుత్వం పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా పెంచవలసి ఉంటుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరగాలంటే మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలి, నమ్మకం పెరగాలి, కాంట్రాక్టులను అమలు చేయాలి, అనువైన వాతావరణం ఏర్పాటు చేయాలి.

మౌలిక సదుపాయాలు పెరగాలంటే ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెరగాలి. వాస్తవం ఏమిటంటే పెట్టుబడి వ్యయం కోసం ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 1.8 శాతమే. ఇది గతంలోకన్నా గొప్పగా ఏమీ లేదు. అదే విధంగా రవాణా మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది కేవలం రూ 1.7 లక్షలు మాత్రమే. ఇది 2019-20నాటి సవరించిన అంచనాలకన్నా 7.6 శాతం మాత్రమే ఎక్కువ. నిర్దిష్టమైన మౌలిక సదుపాయ కంపెనీలలో రూ. 20,000 కోట్లు పెట్టుబడి పెడ్తే పరిస్థితి మెరుగయ్యేదేమో. కానీ అదీ నెరవేరలేదు.

2019-20 బడ్జెట్ లో నిర్ధారించిన లక్ష్యం కన్నా ద్రవ్య లోటు పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ప్రభుత్వ రెవెన్యూ తగ్గడమే. దీనికి మూడు కారణాలున్నాయి. మొదటిది, నామమాత్ర స్థూల జాతీయోత్పత్తి 12 శాతం ఉంటుందని అంచనా వేసినా అది 7.5 శాతానికి కుదించుకు పోయింది. రెండవది, మునుపటి ఏడాదిలో రెవెన్యూ రాబడి 18.3 శాతం ఉంటుందన్న అంచనా అత్యాశగానే మిగిలిపోయింది. మూడవది, రూ. 1.03 లక్షల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా సమకూరుతాయనుకున్న ఆశ అడియాసే అయింది.

అందుకే ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టంలోని క్లాజును ఉపయోగించుకుని ద్రవ్య లోటు-జి.డి.పి. నిష్పత్తిని 0.5 శాతం కుదించి ఈ ఏడాది ద్రవ్య లోటు మునుపనుకున్న 3.8 శాతం కాకుండా 3.5 శాతం ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం ద్రవ్య లోటు విషయంలో మునుపు పెట్టుకున్న లక్ష్యాన్ని వచ్చే ఏడాదైనా సాధించాలన్న నిబంధన ఉంది. ఈ లక్ష్యం ప్రభుత్వం సాధించగలుగుతుందన్నది అనుమానమే. వాస్తవం ఏమిటంటే ద్రవ్య లోటు అధికంగా ఉంది. ఎందుకంటే బడ్జెట్ లో చూపని ఆర్థిక భారం జి.డి.పి.లో 0.8 శాతం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల సమకూరింది కేవలం రూ. 18,000 కోట్లు మాత్రమే. సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ. 65,000 కోట్లు ఉంది. వచ్చే సంవత్సరం నామ మాత్రపు జి.డి.పి. వృద్ధి రేటు 10 శాతం ఉంటుందని అంచనా వేసినా పన్నుల వసూళ్లు 1.2 శాతం కన్నా పెరిగే ఆశ లేదు. ఆర్థిక సంఘం రాష్ట్రాలకు చెల్లించవలసిన గ్రాంట్లకు పూర్తిగా బడ్జెట్ లో నిధులు కేటాయించనే లేదు. ద్రవ్య లోటు తక్కువగా చూపాలన్న ఆర్థిక సంఘం సిఫార్సును మాత్రం అంగీకరించింది.

పన్నుల సంస్కరణల విషయానికి వస్తే వ్యక్తులకు వర్తించే ఆదాయపు పన్నులో కల్పించిన రాయితీ పూత మెరుగులకే ప్రరిమితమైంది. మినహాయింపులు, రాయితీలు వినియోగించుకోకపోతేనే తక్కువ పన్ను రేట్లు వర్తిస్తాయి. ప్రభుత్వం చేసిందల్లా పన్నులు వర్తించే అంతరువులను ఆరుకు పెంచి పన్నుల వ్యవస్థను మరింత సంక్లిష్టం చేసింది. దీనికి బదులు ప్రభుత్వం దశలవారీగా పన్నుల రాయితీలను తొలగించి ఉండాల్సింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సింది. పన్ను రేట్లను తగ్గించాల్సింది. కస్టమ్స్ సుంకాలను పెంచడం “మేక్ ఇన్ ఇండియా”కు అనుగుణంగానే ఉంది. అంటే దిగుమతులకు ప్రత్యామ్నాయం వెతికే స్థితికి వెళ్తున్నామా?

దురదృష్టం ఏమిటంటే కేంద్ర బడ్జెట్ సవ్యంగా లేనందువల్ల రాష్ట్రాల బడ్జెట్ నిర్వహణ అస్తవ్యస్తమై పోతుంది. పన్నుల ద్వారా వచ్చే రాబడులలో రాష్ట్రాలకు చెల్లించవలసింది బడ్జెట్ అంచనాల కన్నా రూ. 1.5 లక్షల కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి బదిలీ అయ్యే నిధుల ఆధారంగా రాష్ట్రాలు తమ బడ్జెట్లు రూపొందించుకుంటాయి. కేంద్రం నుంచి బదిలీ అయ్యే నిధులు విపరీతంగా తగ్గినందువల్ల రాష్ట్రాలు తాము పెట్టే ఖర్చులు తగ్గించుకోక తప్పదు. అంటే పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవలసి ఉంటుంది. రెవెన్యూ లోటు వల్ల కేంద్రం కేటాయింపుల్లో కోత పెడ్తుంది. ఈ కోత కేంద్ర పథకాల అమలుకు కూడా వర్తిస్తుంది. ప్రణాలికేతర వ్యయంలో కోత ఉత్పాదకతను, రాష్ట్రాలు పెట్టే ఖర్చుపై ప్రతికూల ప్రభావం చూపక తప్పదు.

ఈ బడ్జెట్ నుంచి చాలా ఆశించాం. దురదృష్టం ఏమిటంటే పెట్టుబడులు పెరగడానికి అభివృద్ధి చెందడానికి సుదీర్ఘ కాలం వేచి ఉండక తప్పదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  14 Feb 2020 6:06 AM IST
Next Story