జట్కావాలా కూతురికి ప్రపంచ గౌరవం
రాణి రాంపాల్ కు వరల్డ్ గేమ్స్ అవార్డు హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ జట్కావాలా కుమార్తె భారత మహిళలకే గర్వకారణంగా నిలిచింది. భారత మహిళా హాకీజట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాణి రాంపాల్..మరో 24 మంది విఖ్యాత క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకొంది. ఓ నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని 13 సంవత్సరాల చిరుప్రాయంలోనే భారతహాకీలో దూసుకొచ్చిన రాణి 15 సంవత్సరాల వయసులోనే.. భారతజట్టులో సభ్యురాలిగా […]
- రాణి రాంపాల్ కు వరల్డ్ గేమ్స్ అవార్డు
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ జట్కావాలా కుమార్తె భారత మహిళలకే గర్వకారణంగా నిలిచింది. భారత మహిళా హాకీజట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాణి రాంపాల్..మరో 24 మంది విఖ్యాత క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకొంది.
ఓ నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని 13 సంవత్సరాల చిరుప్రాయంలోనే భారతహాకీలో దూసుకొచ్చిన రాణి 15 సంవత్సరాల వయసులోనే.. భారతజట్టులో సభ్యురాలిగా ప్రపంచకప్ బరిలో నిలిచింది.
తన సత్తా చాటుకోడం ద్వారా…ప్రపంచ మహిళా హాకీ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొంది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ కు భారతజట్టు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించిన రాణికి 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయిలో నిర్వహించిన.. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ పోలింగ్ లో లక్షా 99వేల 477 ఓట్లు పోలయ్యాయి. మరో 24 మంది క్రీడాకారులతో ఈ అవార్డు కోసం రాణి రాంపాల్ పోటీపడింది.
ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఈ ఆన్ లైన్ పోలింగ్ లో పాల్గొన్నారు. చివరకు 25 సంవత్సరాల రాణి రాంపాల్ నే అరుదైన ఈ పురస్కారం వరించింది.
భారత క్రీడాప్రాధికార సంస్థలో సహాయ శిక్షకురాలిగా పనిచేస్తున్న రాణి రాంపాల్ కు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇస్తున్నట్లు స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాణి రాంపాల్ కు లెవెల్-10 కోచ్ గా ప్రమోషన్ ఇచ్చినట్లు తెలిపింది.
2016 లో అర్జున పురస్కారం అందుకొన్న రాణి నాయకత్వంలోనే భారతజట్టు 2018 ఆసియాక్రీడల హాకీలో రజత పతకం అందుకొంది. భారతజట్టు తరపున 240 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రాణి రాంపాల్ కు 130కి పైగా గోల్స్ సాధించిన రికార్డు సైతం ఉంది.