Telugu Global
NEWS

ఖేలో ఇండియాలో తెలుగు రాష్ట్ర్రాలు వెలవెల!

ప్రధాని నరేంద్ర మోదీ కలల రూపం ఖేలో ఇండియా పరంపరలో భాగంగా అసోంలోని గౌహతీ వేదికగా 2020 ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు విజయవంతంగా ముగిసాయి. హర్యానాలాంటి అతిచిన్న రాష్ట్ర్రాలు అత్యధిక పతకాలతో కళకళలాడితే… మన తెలుగు రాష్ట్ర్రాలు పతకాల పట్టిక అట్టడుగున నిలవడం ద్వారా వెలవెలాపోయాయి.. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం గా, అత్యధిక యువజన జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన భారత క్రీడారంగ పరిస్థితిని సమూలంగా మార్చడానికి ప్రధాని నరేంద్ర […]

ఖేలో ఇండియాలో తెలుగు రాష్ట్ర్రాలు వెలవెల!
X

ప్రధాని నరేంద్ర మోదీ కలల రూపం ఖేలో ఇండియా పరంపరలో భాగంగా అసోంలోని గౌహతీ వేదికగా 2020 ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు విజయవంతంగా ముగిసాయి. హర్యానాలాంటి అతిచిన్న రాష్ట్ర్రాలు అత్యధిక పతకాలతో కళకళలాడితే… మన తెలుగు రాష్ట్ర్రాలు పతకాల పట్టిక అట్టడుగున నిలవడం ద్వారా వెలవెలాపోయాయి..

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం గా, అత్యధిక యువజన జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన భారత క్రీడారంగ పరిస్థితిని సమూలంగా మార్చడానికి ప్రధాని నరేంద్ర మోడీ మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా కార్యక్రమం విజయవంతం కావడమే కాదు…గ్రామీణ ప్రాంతాలకు చెందిన మెరికల్లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకువస్తోంది.

ఖేలో ఇండియా పరంపరలో భాగంగా 2020 యువజన క్రీడోత్సవాలు అసోంలోని గౌహతీ వేదికగా ఘనంగా, పలు సరికొత్త రికార్డులతో ముగిసాయి.

2018 నుంచి 2020 వరకూ…

స్వాతంత్ర్యం వచ్చి ఏడుదశాబ్దాలు దాటినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న భారత క్రీడారంగాన్ని ఉత్తేజపరచడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమమే ఖేలో ఇండియా యువజన క్రీడలు.

న్యూఢిల్లీ వేదికగా తొలి క్రీడలు…

2018 ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ను న్యూఢిల్లీ వేదికగా…విజయవంతంగా నిర్వహించారు.దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిథిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించడం ద్వారా పోటీలలో పాల్గొనటానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించారు.

మొత్తం 16 క్రీడాంశాలలో..12వేల 415 మంది బాలబాలికలను గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాలలోపు వారే.

హర్యానా అగ్రస్థానం….

2018 ఖేలో ఇండియా నేషనల్ స్కూల్ గేమ్స్ లో హర్యానా జట్టు అత్యధిక పతకాలతో ఓవరాల్ విజేతగా నిలిచింది.
ద్వితీయ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ను మహారాష్ట్ర నిర్వహించింది.

360 కోట్ల రూపాయల వ్యయంతో జరిగిన ఈ క్రీడల్లో 10 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువతీయువకులు మాత్రమే పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు.

దేశంలోని 29 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 6వేల మంది క్రీడాకారులు…18 రకాల క్రీడాంశాలలో తలపడగా…తొలిసారిగా మహారాష్ట్ర్ర ఓవరాల్ విజేతగా నిలిచింది.

ఈశాన్యంలో ఖేలో ఇండియా….

ఈశాన్య భారత గడ్డ అసోం వేదికగా 13 రోజులపాటు జరిగిన 2020 ఖేలో ఇండియా గేమ్స్ లో సైతం మహారాష్ట్ర్ర ఆధిపత్యమే కొనసాగింది. 200కు పైగా పతకాలు సాధించడం ద్వారా మహారాష్ట్ర్ర, హర్యానా పతకాల పట్టిక మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా తమ ఆధిక్యాన్ని నిలుపుకోగలిగాయి.

మహారాష్ట్ర్ర మొత్తం 78 స్వర్ణ, 77 రజత, 101 కాంస్యపతకాలు సాధించింది. ఢిల్లీ మూడు, కర్నాటక నాలుగు, ఉత్తరప్రదేశ్ ఐదుస్థానాలలో నిలిచాయి. ఆతిథ్య అసోం ఏడోస్థానం దక్కించుకొంది.

తెలుగు రాష్ట్ర్రాలు దొందూ దొందే…

మొత్తం 28 రాష్ట్ర్రాలు పతకాల పట్టికలో చోటు సంపాదించగా…తెలుగు రాష్ట్ర్రాలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ దొందుదొందే అనిపించుకొన్నాయి. తెలంగాణా 7 స్వర్ణాలతో సహా 21 పతకాలతో 15వ స్థానంలో నిలిచింది.

ఇక…ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మూడు స్వర్ణాలతో సహా మొత్తం 17 పతకాలతో 22వ స్థానానికి దిగజారిపోయింది.

తెలుగు రాష్ట్ర్రాలు ఎందుకిలా?

జనాభాపరంగా దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో యువజన జనాభా, ప్రతిభాపాటవాలు పుష్కలంగా ఉన్నా… క్రీడలకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం అంతంత మాత్రమే.

కేరళలోని తిరువనంతపురం వేదికగా 2015లో ముగిసిన జాతీయ క్రీడల పతకాల పట్టికలో తెలంగాణా 12, ఆంధ్రప్రదేశ్ 18 స్థానాలలో నిలవడం చూస్తే…క్రీడారంగంలో తెలుగు రాష్ట్రాల సత్తా ఏపాటిదో తెలిసిపోతుంది.

తెలంగాణా 8 స్వర్ణాలతో సహా మొత్తం 29 పతకాలు సాధిస్తే…ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలతో సహా మొత్తం 16 పతకాలు మాత్రమే సంపాదించింది. కేరళ, మణిపూర్, హర్యానా లాంటి చిన్నరాష్ట్రాలు పతకాల పట్టికలో పైపైకి దూసుకుపోతుంటే….తెలుగు రాష్ట్రాలు మాత్రం పాతాళానికి పడిపోతూ వస్తున్నాయి. ఖేలో ఇండియా క్రీడల్లోనూ రెండు రాష్ట్ర్రాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది.

క్రీడలకు అరకొర నిధులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ 2017-18 సంవత్సరానికి లక్షా 56వేల 999 కోట్లుగా ఉంటే…క్రీడలు, టూరిజం, సాంస్కృతికవ్యవహారాల శాఖ కోసం 330 కోట్ల రూపాయాలు మాత్రమే కేటాయించారు.

ఇందులో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాథికార సంస్థకు ఎంత మొత్తం కేటాయించారో….క్రీడల అభివృద్ధి కోసం ఎంత మొత్తం వ్యయం చేశారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.

తెలంగాణాలోనూ అదేతంతు… !

తెలంగాణా…దేశంలోనే అత్యధిక ధనికరాష్ట్రాలలో ఒకటి. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రం. అయితే…క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం…కేటాయించిన నిధులు నామమాత్రంగానే ఉన్నాయి.

తెలంగాణా వార్షిక బడ్జెట్ లక్షా 74వేల 453 కోట్ల రూపాయలుగా ఉంటే…క్రీడారంగానికి కేటాయించింది 57 కోట్ల 89 లక్షల రూపాయలు మాత్రమే.

ఈ మొత్తంలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఉద్యోగుల వేతనలు, పింఛన్లు, ఇతర ఖర్చుల కోసం 12 కోట్ల 89 లక్షల రూపాయలు కేటాయించారు. మిగిలిన 45కోట్ల రూపాయలను ఇతర సహాయక గ్రాంట్ల కోసం ఉంచారు. అంతేకాదు…వీటిలో 9 కోట్ల రూపాయలను క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం, క్రీడా సమాఖ్యల గ్రాంట్ల కోసం అంటూ బడ్జెట్ లో పేర్కొన్నా…ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రెండు విడతలుగా 4 కోట్ల 85 లక్షలు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని ఇవ్వాల్సి ఉన్నా తెలంగాణా క్రీడాప్రాధికార సంస్థకు మొండిచేయి చూపారు.

ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ….గోపీచంద్ అకాడమీ…సింధు, శ్రీకాంత్ ల చుట్టూ పరిభ్రమిస్తూ బతికేస్తున్నాయి. మిగిలిన క్రీడలను ఏమాత్రం పట్టించుకోకుండా…క్రీడాసంఘాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా క్రీడారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి.

ఖేలో ఇండియాలోనూ……

దేశంలో క్రీడారంగ అభివృద్ధి, 2024 ఒలింపిక్స్ లో పతకాల సాధనే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకాన్ని సైతం తెలుగురాష్ట్రాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి.

మొత్తం 19 రకాల క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ఎనిమిదేళ్ల శిక్షణతో పాటు…ఆర్థికసాయం సైతం అందిస్తారు. ఈ పథకానికి ఎంపికైన క్రీడాకారుల శిక్షణ కోసం3 లక్షల 80 వేల రూపాయలు, క్రీడాకారుల వ్యక్తిగత ఖాతాలో నేరుగా లక్షా 20 వేల రూపాయలు జమ చేస్తారు.

ఖేలో ఇండియా పథకం కోసం దేశవ్యాప్తంగా మొత్తం 734 మందిని ఎంపిక చేస్తే…అందులో తెలంగాణా రాష్ట్ర క్రీడాకారులు నలుగురంటే నలుగురు మాత్రమే. 500 కోట్ల రూపాయల నిధులతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకానికి తెలుగురాష్ట్రాల క్రీడాకారులు తగిన సంఖ్యలో ఎంపికకాలేకపోడానికి….రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడాసంఘాల నిర్లక్ష్యం, చేతకానితనమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సమగ్రాభివృద్ధిలో క్రీడలు కూడా ఓ ప్రధాన భాగమని తెలుగు రాష్ట్రాలు గుర్తించనంత వరకూ తెలుగు రాష్ట్ర్రాల క్రీడారంగ పరిస్థితి రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అని చెప్పక తప్పదు.

First Published:  25 Jan 2020 2:57 AM IST
Next Story