వైసీపీ సర్కార్ నెక్ట్స్ ప్లానేంటి?
ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ప్రభుత్వం నెక్స్ట్ ప్లానేంటి. ఊహించని విధంగా మండలి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపింది. మరి ఎలాగైనా ఈ బిల్లులను చట్టం చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్ ముందున్న ఆప్షన్లేంటి…? టీడీపీ అడ్డుకునే మార్గాలేంటి..? ఇప్పటిదాకా ఓ ఎత్తైతే… ఇక్కడ నుంచి మరో ఎత్తు. మరి ఇక నుంచి అధికార విపక్షాల మధ్య ఎత్తులు.. పైఎత్తులు ఎలా ఉండబోతున్నాయి. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు మండలికి […]
ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ప్రభుత్వం నెక్స్ట్ ప్లానేంటి. ఊహించని విధంగా మండలి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపింది. మరి ఎలాగైనా ఈ బిల్లులను చట్టం చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్ ముందున్న ఆప్షన్లేంటి…? టీడీపీ అడ్డుకునే మార్గాలేంటి..? ఇప్పటిదాకా ఓ ఎత్తైతే… ఇక్కడ నుంచి మరో ఎత్తు. మరి ఇక నుంచి అధికార విపక్షాల మధ్య ఎత్తులు.. పైఎత్తులు ఎలా ఉండబోతున్నాయి.
ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు మండలికి వచ్చిన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎలాగైనా బిల్లులను అడ్డుకోవాలన్న వ్యూహంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు… తన దగ్గరున్న వ్యూహాలన్నీ అమలు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా రూల్స్ 71ను తెరపైకి తెచ్చి దాన్ని నెగ్గించుకున్నారు. తర్వాత మండలిలో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేవరకు అనైతిక వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. మరి ఇక్కడ నుంచే అసలు ఎపిసోడ్ మరింత ఆసక్తికరం కానుంది.
ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు చూస్తే..ఒకటి ఆర్డినెన్స్ తేవడం..రెండోది శాసనమండలిని రద్దు చేయడం….లేకుంటే సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూడడం…
కానీ ఇవేమీ అంత ఈజీ కాదని తెలుస్తోంది. ముందుగా సెలెక్ట్ కమిటీ వ్యవహారాన్ని పరిశీలిస్తే… అసెంబ్లీ రూల్స్ ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపిన ఏ బిల్లులు అయినా కనీసం నెల రోజుల పాటు ఆగుతాయి. అత్యధికంగా మూడు నెలల పాటు ఆపొచ్చు. అంటే, కనీసం నెల రోజుల పాటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలక్ట్ కమిటీ మార్పులు, చేర్పులు సూచిస్తే మళ్లీ అసెంబ్లీ, శాసనమండలిలో చర్చించి ఆమోదం పొందాలి.
ఇక రెండో ఆప్షన్ ఆర్డినెన్స్ తీసుకురావడం… సెలక్ట్ కమిటీకి బిల్లును పంపకుండా నేరుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేయడం. ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని ఆరు నెలల్లోపు చట్టం చేసుకోవచ్చు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు దాన్ని ఆమోదింపజేసుకోవచ్చు. అయితే ముందుగా అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది.
కానీ ఇక్కడా మరో సమస్య ఉంది. ఆర్డినెన్స్ తీసుకురావాలంటే…ఏదైనా బిల్లు ఆమోదం పొందకపోతే దాని స్థానంలో ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం అంటే ఈ రెండు బిల్లులు సజీవంగా ఉన్నట్లే. రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ తీసుకురావడం కుదిరేపని కాదని కొందరంటున్నారు.
ఇక మూడో ఆప్షన్ శాసనమండలి రద్దు… ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది మాత్రమే కాదు. కేంద్రం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మండలిని రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ స్టేట్ కేబినెట్ తీర్మానం చేయాలి. దానిని శాసనసభ ఆమోదంతో కేంద్రానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది. కేంద్ర చట్టం ద్వారా మాత్రమే శాసన మండలిని రద్దు చేయగలరు. ఈ ప్రక్రియ ముగియడానికి కనీసం ఏడాది పట్టే అవకాశం ఉంది. కానీ రద్దు యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది. వైఎఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన మండలిని తాము రద్దు చేయబోమని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏం జరగవచ్చని పరిశీలిస్తే… బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపడంతో… ముందుగా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ ఛైర్మన్‌ను, సభ్యుల్ని నియమించడంతో పాటు, కాలపరిమితి, విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది. వీటిపై మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. కమిటీ ఛైర్మన్‌గా సంబంధిత మంత్రి ఉంటారు. కమిటీలో 15 మంది వరకు సభ్యులుంటారు. ఇది శాసన మండలికి సంబంధించిన సెలక్ట్ కమిటీ కాబట్టి… కమిటీలో సభ్యులంతా మండలి నుంచే ఉంటారు. మండలిలో పార్టీల బలాబలాల ఆధారంగా కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుంది. శాసన మండలిలో తెదేపా సభ్యుల సంఖ్యే ఎక్కువ కాబట్టి, కమిటీలో మెజారిటీ సభ్యులు ఆ పార్టీ నుంచే ఉంటారు. కమిటీ ఆ బిల్లులను పరిశీలించి నివేదిక అందజేయడానికి కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
ఎటు చూసినా సమయం 3 నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం ఉండడంతో…ప్రభుత్వం న్యాయనిపుణులను సంప్రదిస్తోంది. మరి చూడాలి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందో.