Telugu Global
NEWS

భారత క్రీడారంగంలో ఇద్దరూ ఇద్దరే

తల్లులుగా అపురూప విజయాలు క్రీడారంగంలో భారత మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. గృహిణులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. విజేతలుగా నిలవటానికి వయసు, విరామం, మాతృత్వం ఏమాత్రం అవరోధంకావని చదరంగ రాణి కోనేరు హంపి, టెన్నిస్ డబుల్స్ గ్రేట్ సానియా మీర్జా నిరూపించారు. రంగం ఏదైనా… పురుషులతో సమానంగా రాణించడంలో మహిళలకు మహిళలు మాత్రమే సాటి. క్రీడారంగానికీ, సంసారబంధానికి…. చాంపియన్ హోదాకీ, మాతృత్వానికి ఏమాత్రం పొసగదన్న అభిప్రాయం…. మేధో క్రీడ చదరంగం, ప్రపంచ క్రీడ టెన్నిస్ […]

భారత క్రీడారంగంలో ఇద్దరూ ఇద్దరే
X
  • తల్లులుగా అపురూప విజయాలు

క్రీడారంగంలో భారత మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. గృహిణులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. విజేతలుగా నిలవటానికి వయసు, విరామం, మాతృత్వం ఏమాత్రం అవరోధంకావని చదరంగ రాణి కోనేరు హంపి, టెన్నిస్ డబుల్స్ గ్రేట్ సానియా మీర్జా నిరూపించారు.

రంగం ఏదైనా… పురుషులతో సమానంగా రాణించడంలో మహిళలకు మహిళలు మాత్రమే సాటి. క్రీడారంగానికీ, సంసారబంధానికి…. చాంపియన్ హోదాకీ, మాతృత్వానికి ఏమాత్రం పొసగదన్న అభిప్రాయం…. మేధో క్రీడ చదరంగం, ప్రపంచ క్రీడ టెన్నిస్ లో కేవలం అపోహమాత్రమేనని భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, టెన్నిస్ డబుల్స్ క్వీన్ సానియా మీర్జా సాటి చెప్పారు.

పిల్లలే ప్రేరణగా….

మహిళలు… నేర్పు ఓర్పు, శాంతి, సహనాలకు మారు పేరు. మహిళామ తల్లులు పుట్టుకతోనే శాంతమూర్తులు. ఓవైపు సంసారబాధ్యతలు నిర్వర్తిస్తూనే… మరోవైపు తాము ఎంచుకొన్న రంగంలో విధులను, బాధ్యతలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించే ధీరలు.

ఇన్ డోర్ గేమ్ చెస్, అవుట్ డోర్ గేమ్ టెన్నిస్ భిన్నమైన క్రీడలు. కేవలం మెదడకు మాత్రమే పని చెప్పి..గంటల తరబడి ఎనలేని ఏకాగ్రతతో ఆడే చదరంగ క్రీడలో మాత్రమే కాదు… విపరీతమైన శారీరక శ్రమతో కూడిన టెన్నిస్ లో మాతృత్వం కోసం కొద్దిసంవత్సరాల విరామం తీసుకొని తిరిగి విజేతలుగా నిలవడం సంసారబాధ్యతలు నిర్వర్తించే మహిళలకు ఏమంత తేలికకాదు. అయితే..అంకితభావం, ఎంచుకొన్న క్రీడపట్ల అభిమానం, రాణించాలన్న తపన, కుటుంబసభ్యుల తోడ్పాటు ఉంటే.. తల్లులుగానూ విజయాలు సాధించడం ఏమాత్రం కష్టంకాదని భారత చదరంగ రాణి కోనేరు హంపి మాత్రమే కాదు..టెన్నిస్ డబుల్స్ క్వీన్ సానియా మీర్జా చాటి చెప్పారు.

32 ఏళ్ల వయసులో హంపి విజయం

తెలుగుతేజం కోనేరు హంపి 18 సంవత్సరాల తర్వాత తన కెరియర్ లో అతిపెద్ద విజయం సాధించింది. మాస్కో వేదికగా ముగిసిన 2019 మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించింది. తల్లిహోదాలో, 32 సంవత్సరాల వయసులో విశ్వవిజేతగా నిలిచిన భారత తొలి మహిళా చెస్ ప్లేయర్ గా రికార్డు నెలకొల్పింది.

2001లో ప్రపంచ జూనియర్ బాలికల టైటిల్ నెగ్గిన కోనేరు హంపి ఆ తర్వాత మరో ప్రపంచటైటిల్ కోసం 2019 వరకూ వేచిచూడాల్సివచ్చింది.

12 రౌండ్ల ఈ టోర్నీలో పాల్గొన్న 32 సంవత్సరాల హంపి…ఓ బిడ్డకు తల్లిగా ప్రపంచ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి .
తన కుటుంబసభ్యుల సహకారంతోనే తాను ఓ బిడ్డకు తల్లిగా ప్రపంచ టైటిల్ నెగ్గగలిగానని, ఇదో మధురానుభవమని కోనేరు హంపి ప్రకటించింది.

33 సంవత్సరాల వయసులో సానియా…

మరోవైపు..భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా సైతం 33 సంవత్సరాల వయసులో… తల్లిహోదాలో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించి తనకు తానేసాటిగా నిలిచింది. ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం గత రెండుసంవత్సరాలుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా..పునరాగమనాన్ని గొప్పగా మొదలుపెట్టింది.

ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనోవ్ తో జంటగా హోబర్ట్ ఓపెన్ మహిళల డబుల్స్ బరిలోకి దిగిన సానియాజోడీ విజేతగా నిలిచారు.తమ తొలిప్రయత్నంలోనే ట్రోఫీ అందుకోగలిగారు.

కఠోర సాధనతో…..

ఏడాదిక్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నుంచి సానియా పూర్తిపిట్ నెస్ కోసం రోజుకు నాలుగుగంటల పాటు శ్రమిస్తూ వచ్చింది.తన కుమారుడు ఇజాన్ ఆలనాపాలనా చూస్తూనే…పూర్తిస్థాయి ఫిట్ నెస్ కోసం రోజుకు రెండు విడతలుగా నాలుగు గంటలపాటు కఠోర సాధన చేసింది ప్రసవం తర్వాత సానియా అనూహ్యంగా బరువు పెరిగింది.

దీంతో బరువు తగ్గడం ద్వారా ప్రొఫెషనల్ టెన్నిస్ కు అవసరమైన ఫిట్ నెస్ కోసం జిమ్ లోనే గంటలతరబడి చెమటోడ్చింది. మూడుపదుల వయసులో తల్లిగా మారిన సానియా..రోజుకు నాలుగు గంటలపాటు జిమ్ లో వర్కవుట్ చేయడం ద్వారా 26 కిలోల మేర బరువు తగ్గింది.

తన కెరియర్ రెండో ఇన్నింగ్స్ తొలిటోర్నీలో కాస్త భయపడ్డానని…నాడియాతో జంటగా తొలిటోర్నీలోనే ట్రోఫీ అందుకోడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, 27 మాసాల సుదీర్ఘవిరామం తర్వాత తిరిగి విన్నర్ గా నిలవడం తనకు పట్టలేని ఆనందం కలిగించిందని పొంగిపోతూ చెప్పింది.

అమ్మానాన్నలతో పాటు తన కుమారుడు ఇజాన్ సమక్షంలో డబుల్స్ ట్రోఫీ అందుకోడం ఓ మధురానుభవమని ప్రకటించింది.33 సంవత్సరాల సానియా కు తన కెరియర్ లో ఇప్పటికే మూడు మిక్సిడ్ టైటిల్స్ తో సహా మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డుతో పాటు..మహిళల డబుల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సైతం సాధించింది. ఆసియా క్రీడలు,శాఫ్ గేమ్స్, జాతీయ క్రీడల టెన్నిస్ సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో పతకాలు సాధించింది.

తమ క్రీడాజీవితంలో ఎన్ని ఘనతలు సంపాదించినా…ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత…తల్లి హోదాలో సాధించిన విజయాలే మధురమని, అపూర్వమని కోనేరు హంపి, సానియా మీర్జాలను చూస్తేనే తెలుస్తుంది. అమ్మలుగా సాధించిన గొప్పవిజయాలకు ప్రతీకలుగా హంపి, సానియా నిలిచిపోతారు.

First Published:  20 Jan 2020 9:33 PM GMT
Next Story