Telugu Global
NEWS

రేప‌టి ఏపీ కేబినెట్‌లో ఏం జ‌ర‌గ‌బోతోంది?

నెల రోజులుగా జరుగుతున్న రాజధాని అమరావతి ఇష్యూ క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడు రాజధానులపై నిర్ణయం ఎలా ఉన్నా… రైతులకు ప్రభుత్వం చేసే న్యాయం ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది. సోమవారం జరిగే ఏపీ కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ ఏపీలో కనిపిస్తోంది. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికపై మంత్రి మండలి […]

రేప‌టి ఏపీ కేబినెట్‌లో ఏం జ‌ర‌గ‌బోతోంది?
X

నెల రోజులుగా జరుగుతున్న రాజధాని అమరావతి ఇష్యూ క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడు రాజధానులపై నిర్ణయం ఎలా ఉన్నా… రైతులకు ప్రభుత్వం చేసే న్యాయం ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది. సోమవారం జరిగే ఏపీ కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ ఏపీలో కనిపిస్తోంది.

ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయించాలనే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.

మూడు రాజధానులు, సీఆర్ డీఏ బిల్లుపై పక్కాగా కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతోంది. అందుకే కేబినెట్‌ సమావేశాన్ని ముందుకు జరిపి… ఆ తర్వాత మళ్లీ 20వ తేదీన పెట్టాలని డిసైడ్‌ అయినట్లు స్పష్టమవుతోంది.

ఆర్థిక పరమైన బిల్లును కేబినెట్‌ ఆమోదించిన తర్వాత గవర్నర్‌ సైతం ఆమోదించాల్సి ఉంటుంది. అసలు ఈ బిల్లుకు ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేదు కాబట్టి… గవర్నర్‌ ఆమోదం అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీనిపైనే సీఎం జగన్‌తో ఆర్థిక మంత్రి బుగ్గన, చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి చర్చలు జరిపారు. మరోవైపు న్యాయనిపుణులతో చర్చిస్తోంది ప్రభుత్వం. గతంకన్నా రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తామంటూ మంత్రి బొత్స చెప్పడం చర్చనీయాంశమైంది. బొత్స వ్యాఖ్యలతో అమరావతి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ ఏంటన్నదే ఆసక్తి రేపుతోంది. దాంతో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారా? లేదంటే తిరిగి భూములను ఇచ్చేస్తారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీ కేబినెట్‌లో ఇదే ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

గత ప్యాకేజీకన్నా మెరుగైనది ఇస్తామని బొత్స చెప్పిన దాని ప్రకారం ఇంటి స్థలం గజాలను, కమర్షియల్‌ ప్లాట్‌ విస్తీర్ణాన్ని పెంచుతారా? ఇంకేమైనా ఆర్థికంగా సాయం చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

మరోవైపు సీఆర్ డీఏ కు రైతులు చేసిన సూచనలు, సలహాల్లో కీలకమైనవి ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ప్రభుత్వం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుంది? అన్నది చర్చనీయాంశమైంది. కొంతమంది భూములు తిరిగి ఇచ్చేయాలంటే ఏం చేస్తుందనేది సస్పెన్స్‌గానే ఉంది.

First Published:  19 Jan 2020 4:58 AM IST
Next Story