Telugu Global
NEWS

తుపాను వల్ల విశాఖలో, వరద వల్ల కర్నూలులో ఎవడూ చావలేదు.. అమరావతిలో ఎండకు మాత్రం చస్తున్నారు...

మూడు రాజధానులు ఏర్పాటు చేసి, పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌. అమరావతిని రాజధాని అని చంద్రబాబు ప్రకటించారే గానీ…రాజధానిని ఫ్రీజోన్‌గా ప్రకటించలేదన్నారు. దాని వల్ల ఇతర ప్రాంతాలకు రాజధాని ప్రాంతంలో ఎలాంటి అవకాశాలు దొరికే అవకాశం లేకుండాపోయిందన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలోనే రాయలసీమలో వింటర్‌ అసెంబ్లీ ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. కానీ అటు ఉత్తరాంధ్ర,ఇటు రాయలసీమ డిమాండ్‌ను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అదృష్టవశాత్తు ఇప్పుడు […]

తుపాను వల్ల విశాఖలో, వరద వల్ల కర్నూలులో ఎవడూ చావలేదు.. అమరావతిలో ఎండకు మాత్రం చస్తున్నారు...
X

మూడు రాజధానులు ఏర్పాటు చేసి, పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌. అమరావతిని రాజధాని అని చంద్రబాబు ప్రకటించారే గానీ…రాజధానిని ఫ్రీజోన్‌గా ప్రకటించలేదన్నారు. దాని వల్ల ఇతర ప్రాంతాలకు రాజధాని ప్రాంతంలో ఎలాంటి అవకాశాలు దొరికే అవకాశం లేకుండాపోయిందన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలోనే రాయలసీమలో వింటర్‌ అసెంబ్లీ ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. కానీ అటు ఉత్తరాంధ్ర,ఇటు రాయలసీమ డిమాండ్‌ను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

అదృష్టవశాత్తు ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమకు కూడా రాజధాని ప్రాంతాన్ని ఇవ్వాలనుకోవడం మంచి నిర్ణయమని… మంచి చేసినప్పుడు తాము సమర్థిస్తామన్నారు. కానీ కేవలం రాజధానులు ప్రకటించడమే కాకుండా మూడు ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జగన్‌మోహన్ రెడ్డిపై ఉందన్నారు.

మూడు రాజధానులపై బీజేపీ హైకమాండ్‌ పెద్దలతో జగన్‌ చర్చించారని… కొన్ని నెలల క్రితమే తాము మీడియాకు చెప్పానని గుర్తు చేశారు. విశాఖ, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో… కర్నూలులో రాయలసీమ ప్రజల కోసం మినీ సెక్రటెరియట్ ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇక ప్రాంతాల మధ్య వైరుధ్యాలు వచ్చే అవకాశం కూడా ఉండదన్నారు. జగన్‌మోహన్ రెడ్డికి కూడా రాజకీయంగా ఎలాంటి తలనొప్పులు ఉండవన్నారు.

రాయలసీమ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారని.. కాబట్టి రాయలసీమలో మిని సచివాలయం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు కూడా రాయలసీమ వారికి మద్దతుగా నిలవాలని కోరారు. తమిళనాడు నుంచి విడిపోయేందుకు రాయలసీమ వాళ్లు తొలుత అంగీకరించలేదని గుర్తు చేశారు. కానీ ఆంధ్రా నాయకులు తెలుగు వారంతా ఒకటిగా ఉండాలి… కావాలంటే రాజధాని ఇస్తామంటూ శ్రీబాగ్ ఒప్పందం చేసుకోవడం వల్లే తమిళనాడు నుంచి రాయలసీమ వారు విడిపోయారన్నారు. కానీ ఆ తర్వాత పదేపదే రాయలసీమ ప్రజల నోళ్ళల్లో మట్టి కొడుతూ వచ్చారన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంపై రాయలసీమ ప్రజలకు అభిమానం ఉందని… అందుకే తాను కూడా పార్లమెంట్ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా తాను ఇక్కడే కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్టు టీజీ వెంకటేశ్ చెప్పారు. రాయలసీమ ప్రజల అవసరాలకు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.

విశాఖకు తుపాను వస్తుంది… కర్నూలుకు వరద వస్తుంది అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంపైనా టీజీ తీవ్రంగా స్పందించారు. అలాంటివి పనికిమాలిన మాటలు అని మండిపడ్డారు. కర్నూలుకు పక్కనే ఉన్న ప్రాంతం చాలా ఎత్తులో ఉందని అక్కడ 30వేల ఎకరాల భూమి ఉందన్నారు. అక్కడ వరద వచ్చినా, ప్రళయం వచ్చినా ఏమీ కాదన్నారు. విశాఖపట్నం చాలా సురక్షితమైన నగరమని అందరికీ తెలుసన్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చిన తుపానును పట్టుకుని భూతద్దంలో చూపడం సరికాదన్నారు.

విశాఖలో తుపాను వల్ల, కర్నూలులో వరద వల్ల ఎవరూ చనిపోయింది లేదని.. కానీ అదే అమరావతి ప్రాంతంలో ఎండల తీవ్రతకు వేసవిలో జనాలు రోజూ చచ్చిపోతుంటారని టీజీ వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతంలో ఎండల దెబ్బకు వడదెబ్బ తగిలి చాలా మంది చచ్చిపోతుంటారని… దానికేమంటారని ప్రశ్నించారు.

మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల నాయకులకు ఆయా ప్రాంతాల్లోని సమస్యలపైనా అవగాహన వస్తుందని… అసెంబ్లీ సమావేశాల సమయంలో అక్కడి ప్రజల సమస్యలను తీర్చేందుకు అవకాశం కూడా ఏర్పడుతుందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైనా మేలు జరుగుతుంది అంటే వెంటనే అందరూ గగ్గోలు పెట్టడం అలవాటుగా మారిందన్నారు.

First Published:  7 Jan 2020 1:32 AM GMT
Next Story