చదరంగ సామ్రాట్ విశ్వనాథన్ ఆనంద్
2019తో 50 సంవత్సరాల ప్రస్థానం విశ్వక్రీడారంగానికి భారత్ అందించిన ఆణిముత్యాల వంటి క్రీడాకారుల్లో చదరంగ సామ్రాట్ విశ్వనాథన్ ఆనంద్ కు ప్రత్యేకస్థానమే ఉంది. ఆరేళ్ల వయసులో చదరంగ ఓనమాలు దిద్దుకొని..14 సంవత్సరాల వయసులో జాతీయ జూనియర్ టైటిల్ తో జైత్రయాత్ర మొదలు పెట్టిన ఆనంద్.. ఐదు పదుల వయసులోనూ అదేజోరు కొనసాగిస్తూ ప్రతిభకూ, అంకితభావానికి వయసుతో ఏమాత్రం సంబంధం లేదని చాటి చెప్పాడు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో ఒక్కో క్రీడలో ఒక్కో మేరునగధీరుడు మనకు కనిపిస్తాడు. […]
- 2019తో 50 సంవత్సరాల ప్రస్థానం
విశ్వక్రీడారంగానికి భారత్ అందించిన ఆణిముత్యాల వంటి క్రీడాకారుల్లో చదరంగ సామ్రాట్ విశ్వనాథన్ ఆనంద్ కు ప్రత్యేకస్థానమే ఉంది.
ఆరేళ్ల వయసులో చదరంగ ఓనమాలు దిద్దుకొని..14 సంవత్సరాల వయసులో జాతీయ జూనియర్ టైటిల్ తో జైత్రయాత్ర మొదలు పెట్టిన ఆనంద్.. ఐదు పదుల వయసులోనూ అదేజోరు కొనసాగిస్తూ ప్రతిభకూ, అంకితభావానికి వయసుతో ఏమాత్రం సంబంధం లేదని చాటి చెప్పాడు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో ఒక్కో క్రీడలో ఒక్కో మేరునగధీరుడు మనకు కనిపిస్తాడు. 64 గడులలో సాగే చదరంగం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఐదుసార్లు విశ్వవిజేత, భారత తొలి గ్రాండ్ మాస్టర్, సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే. మేధో క్రీడ చదరంగంలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచిపోయిన ఆనంద్ కేవలం చదరంగ క్రీడ కోసం మాత్రమే పుట్టిన ఆటగాడు.
ఆరేళ్ల చిరుప్రాయం లోనే…
తమిళనాడులోని మైలాతురైలో యాభై సంవత్సరాల క్రితం జన్మించిన విశ్వనాథన్ ఆనంద్ ఆరేళ్ల చిరుప్రాయంలోనే తల్లి సుశీల ప్రేరణతో చదరంగంలో ఓనమాలు దిద్దుకొన్నాడు.
మెరుపువేగంతో ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ…తనకంటే రెట్టింపు వయసున్న ఆటగాళ్లను సైతం అలవోకగా ఓడిస్తూ పిల్లడు కాదు పిడుగు అనిపించుకొన్నాడు.
ఆనంద్ కు భారత చెస్ లో లైట్నింగ్ కిడ్ అన్న పేరు కూడా ఉంది. 14 సంవత్సరాల వయసులో జాతీయ సబ్ జూనియర్ టైటిల్ సాధించడంతో తన జైత్రయాత్రను మొదలు పెట్టిన ఆనంద్ ఆ తర్వాతి 36 సంవత్సరాల కాలంలో అధిరోహించని చదరంగ శిఖరం అంటూ లేదు.
భారత తొలిగ్రాండ్ మాస్టర్….
చదరంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన క్రీడాకారులకు ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్, సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా ఇస్తూ ఉంటారు. సాధించిన విజయాల ప్రాతిపదికన ఎలో రేటింగ్ ఇస్తూ ఉంటారు.
చదరంగ క్రీడకు పుట్టినిల్లులాంటి భారత్ చరిత్రలో మాన్యుల్ ఆరన్, గాలీబ్ లాంటి గతతరం ఆటగాళ్లు ఎందరో ఉన్నా…గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన తొలి క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే. 2008లో 2800 పాయింట్ల ఎలో రేటింగ్ సాధించడం ద్వారా ఈ రికార్డు సాధించిన నాలుగో గ్రాండ్ మాస్టర్ గా నిలిచిపోయాడు.
ఆనంద్ కు ముందే గారీ కాస్పరోవ్, వ్లాదిమీర్ కామినిక్, వేసిలిన్ టొపలోవ్ 2800 ఎలో రేటింగ్ సాధించిన మొనగాళ్లుగా ఉన్నారు.
భారత తొలి విశ్వవిజేత….
గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన రెండేళ్లకే ఆనంద్ ఫిడే ప్రపంచ టైటిల్ గెలుచుకొన్నాడు. ఈ ఘనత సాధించిన ఆసియాఖండ తొలి క్రీడాకారుడి గౌరవాన్ని సొంతం చేసుకొన్నాడు.
2000 నుంచి 2002 సంవత్సరాల వరకూ విశ్వవిజేతగా కొనసాగిన ఆనంద్…ఆ తర్వాత 2007లోమరోసారి ప్రపంచ టైటిల్ అందుకొన్నాడు. 2008లో గ్రాండ్ మాస్టర్ వ్లాదిమీర్ క్రామినిక్ ను ఓడించడం ద్వారా తిరుగులేని ప్రపంచ చాంపియన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. మొత్తం మీద ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసియా, భారత తొలి క్రీడాకారుడు ఆనంద్ మాత్రమే.
2007 లో ప్రపంచ లైట్నింగ్ టైటిల్
ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ 2017 లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ ను సైతం సాధించాడు. రియాద్ వేదికగా ముగిసిన జరిగిన 2017 ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీ..మొత్తం 15 రౌండ్లలో ఆనంద్ 10.5 పాయింట్లు సాధించడం ద్వారా..14 ఏళ్ల తర్వాత తిరిగి విశ్వవిజేతగా నిలువగలిగాడు. ఆఖరి రౌండ్లో రష్యా గ్రాండ్ మాస్టర్ వ్లాదిమీర్ ఫెదోసివ్ కు టై బ్రేక్ ద్వారా 2-0తో ఆనంద్ చెక్ చెప్పాడు.
ప్రారంభరౌండ్లలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నుస్ కార్ల్ సన్ పైన సంచలన విజయం సాధించిన ఆనంద్..ఆ తర్వాతి రౌండ్లలో తన అపారఅనుభవాన్ని ఉపయోగించి ఆడి..ఆశించిన ఫలితాన్ని సాధించాడు. 48 ఏళ్ల వయసులో …ప్రపంచ ర్యాపిడ్ చెస్ ట్రోఫీ తో పాటు కోటీ 60 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా అందుకొన్నాడు.
ఐదుపదుల వయసులోనూ….
2019 డిసెంబర్ 11న విశ్వనాథన్ ఆనంద్ 50వ పడిలో ప్రవేశించాడు. గత నాలుగున్నర దశాబ్దాల తన చదరంగ ప్రస్థానాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తానని ప్రకటించాడు. చదరంగం ఆడటాన్ని ఆస్వాదిస్తున్నంత కాలం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. ప్రపంచ చదరంగ మూడుఫార్మాట్లలోనూ ప్రపంచ టైటిల్స్ నెగ్గిన మొనగాడు ఆనంద్ మాత్రమే.
భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అందుకొన్న తొలి భారత క్రీడాకారుడి గౌరవం ఆనంద్ కు మాత్రమే సొంతం. భారత పౌరపురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ లాంటి అవార్డులన్నీ అందుకొన్న ఆనంద్..స్పెయిన్ అత్యున్నత పౌరపురస్కరాన్ని సైతం సాధించడం విశేషం.
ఆనంద్ స్ఫూర్తితో గ్రాండ్ మాస్టర్ల వెల్లువ…
కేవలం విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితోనే భారత చెస్ లో గ్రాండ్ మాస్టర్ల సంఖ్య 64కు పెరగడం విశేషం. ప్రపంచ చెస్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 15వ స్థానంలో ఉన్న ఆనంద్ తనకంటే ముందు తరాలవారితోనూ, తన తరం వారితోనూ, తన తర్వాతి తరాలవారితోనూ చదరంగ సమరంలో తలపడుతూ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తున్నాడు.
ఆనంద్ పుట్టిపెరిగిన తమిళనాడులోనే 23 మంది గ్రాండ్ మాస్టర్లు ఉండటం కేవలం ఆనంద్ ఘనతే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఆనంద్ క్రీడాజీవితంలో సాధించిన విజయాలు, అనుభవాలు, మధురఘట్టాలను పేర్చికూర్చిన మైండ్ మాస్టర్ అనే పుస్తకాన్ని 50వ పుట్టిన రోజు సందర్భంగా వెలువరించారు.
చదరంగ ప్రపంచంలో ఎందరు గొప్పగొప్ప ఆటగాళ్ళున్నా…భారత చదరంగ సామ్రాట్ గా విశ్వనాథన్ ఆనంద్ కు ప్రత్యేకస్థానమే ఉండితీరుతుంది.