మున్సిపల్ ఎన్నికల వేళ....ఆ మూడు పార్టీల జాడెక్కడ?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది.. పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. ప్రధాన పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడిన పార్టీల్లో మాత్రం ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదు. అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద అన్న ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయి ఆ పార్టీలు. ముఖ్యంగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. […]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది.. పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. ప్రధాన పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడిన పార్టీల్లో మాత్రం ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదు. అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద అన్న ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయి ఆ పార్టీలు.
ముఖ్యంగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. పోటీ చేయాలా.. లేదా ఎన్నికలకు దూరంగా ఉండి పరువు కాపాడుకుందామా అన్న ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ ఈ మూడు పార్టీల్లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కసరత్తు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఆయా పార్టీల నేతలు సైతం అడ్రస్ లేకుండా పోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐతో జట్టుకట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిపోరుకే మొగ్గుచూపుతోంది. పార్టీ నిర్ణయాన్ని క్యాడర్‌కు ఇప్పటికే చేరవేసినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. మూడు ఎంపీ సీట్లు గెలిచింది. మరో రెండు చోట్ల సెకండ్‌ప్లేస్‌లో నిలిచింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒంటరి పోరాటం వైపే మొగ్గు చూపింది. సింగిల్‌గా వెళ్లడం వల్ల లోకల్‌గా కేడర్ బలపడుతుందనేది కాంగ్రెస్ ఆశ.
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్‌ఫ్ పేరిట అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగినా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ మూడు పార్టీల్లో ఒక్కో పార్టీకి కనీసం లక్ష ఓట్లు కూడా దాటలేదు. సీపీఎం ఖమ్మం, నల్గొండలో కూడా ప్రభావం కోల్పోయింది.
హుజూర్‌నగర్ ఎన్నికల ముందు సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌తో సీపీఐ వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు సీపీఐతో పొత్తు ముచ్చట మాత్రం గులాబీ దళం నుంచి రావడం లేదు.
ఇక బీజేపీ సైతం పొత్తులకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో ఎటువంటి పొత్తుల్లేకుండా బరిలో నిలిచిన బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో అనూహ్య విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో టీజేఎస్, సీపీఐ, సీపీఎంలతో ఎటువంటి ఉపయోగం లేదని ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నాయి. పొత్తు పెట్టుకున్నా ఎక్కడా ప్రభావం చూపలేని ఈ మూడు పార్టీలు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎలా నెగ్గుకొస్తాయన్న చర్చ నడుస్తోంది. ఈ పార్టీలను పట్టణ ప్రజానీకం ఎంతమేర ఆదరిస్తారో వేచి చూడాల్సిందే మరీ..!