Telugu Global
NEWS

ఉత్తరాంధ్ర వలసలను, కేరళలో సీమ రైతుల భిక్షాటనను చూసి భావోద్వేగం కలగలేదా వెంకయ్య గారు...

లక్షల్లో ఉన్న భూమి విలువ కోట్లకు వెళ్తుందని చంద్రబాబు చెప్పిన మాటలు విని రైతులు భూములు ఇచ్చారన్నారు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. .ఈ విషయంలో రైతులను తప్పుపట్టలేమన్నారు. కొందరు రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే… మరికొందరి నుంచి బలవంతంగా గత ప్రభుత్వం లాగేసుకుందన్నారు. సింగపూర్ కంపెనీలు వస్తాయంటూ రైతులను చంద్రబాబు మభ్యపెట్టి మోసం చేశారన్నారు. రాజధాని రైతులను చూసి భావోద్వేగానికి లోనయ్యా… అంటున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా […]

ఉత్తరాంధ్ర వలసలను, కేరళలో సీమ రైతుల భిక్షాటనను చూసి భావోద్వేగం కలగలేదా వెంకయ్య గారు...
X

లక్షల్లో ఉన్న భూమి విలువ కోట్లకు వెళ్తుందని చంద్రబాబు చెప్పిన మాటలు విని రైతులు భూములు ఇచ్చారన్నారు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. .ఈ విషయంలో రైతులను తప్పుపట్టలేమన్నారు. కొందరు రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే… మరికొందరి నుంచి బలవంతంగా గత ప్రభుత్వం లాగేసుకుందన్నారు. సింగపూర్ కంపెనీలు వస్తాయంటూ రైతులను చంద్రబాబు మభ్యపెట్టి మోసం చేశారన్నారు. రాజధాని రైతులను చూసి భావోద్వేగానికి లోనయ్యా… అంటున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా విషయాల్లో ఆ భావోద్వేగాన్ని ఎందుకు మిస్ అయ్యారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రకు చెందిన వారు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూలీలుగా మారితే అప్పుడు వెంకయ్యనాయుడికి ఈ భావోద్వేగం ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. వర్షాలు లేక, పంటలు పండక కేరళకు వెళ్లి అనంతపురం రైతులు భిక్షాటన చేసినప్పుడు వెంకయ్యనాయుడికి భావోధ్వేగం ఎందుకు కలగలేదని నిలదీశారు.

ఫ్లోరైడ్ బారిన పడి కనీసం తాగేందుకు నీరు లేక అల్లాడిన ప్రకాశం జిల్లాను చూసినప్పుడు వెంకయ్యనాయుడికి భావోద్వేగం ఎందుకు కలగలేదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు కింద మునుగుతున్న రైతులది త్యాగం కాదా అని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులకు 30వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని… ఆ డబ్బును వెంకయ్యనాయుడు ఇప్పిస్తారా? అని ప్రశ్నించారు.

వెంకయ్యనాయడిని, ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తామని… కానీ ఆ స్థాయికి తగ్గట్టు పనులు చేస్తే సంతోషిస్తామన్నారు. ఐదేళ్లలో ఎందుకు రాజధానిలో నిర్మాణాలు చేపట్టలేకపోయారో చంద్రబాబును ప్రశ్నించారా? అని వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు పెట్టి రాజధాని కట్టడం సాధ్యం కాదని తెలిసి చంద్రబాబు ముందుకు వెళ్లలేదని… ఇప్పుడు ఆ పని ఈ ప్రభుత్వం చేయాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వెనుకబాటుతనం, ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో అనేక ఉద్యమాలు వచ్చాయన్నారు. ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితి రాకుండా సమదృష్టితో జగన్‌మోహన్ రెడ్డి పనిచేస్తుంటే అడ్డుపడడం సరికాదన్నారు. రాష్ట్రం కోసం రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేశామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా రైతులు వేల ఎకరాల భూములను త్యాగం చేశారన్నారు.

ఇప్పుడు పోలవరం కోసం కూడా ప్రజలు భూములను త్యాగం చేస్తున్నారని వివరించారు. అమరావతి రైతులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని… రెండుమూడు రోజుల్లో రైతుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలు టీడీపీకి పర్యాటక ప్రాంతాలుగా కనిపిస్తే… తమకు మాత్రం అక్కడి ప్రజల వెనుకుబాటుతనం కనిపిస్తోందన్నారు. కాబట్టే అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నట్టు చెప్పారు.

ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా మాట్లాడాలని కోరారు. లేదంటే రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాలని కోరారు.

First Published:  26 Dec 2019 9:42 AM IST
Next Story