2019 సీజన్ వన్డేల్లో రోహిత్ టాప్
1998 సీజన్లో సచిన్ 9 శతకాల రికార్డు భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 28వ శతకం నమోదు చేయడం ద్వారా… 2019 సీజన్లో ఏడు వన్డే శతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన రెండో వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రోహిత్ ధూమ్ ధామ్ సెంచరీ సాధించాడు. సహ ఓపెనర్ రాహుల్ తో కలసి రోహిత్ చెలరేగిపోయాడు. నెగ్గితీరాల్సిన విశాఖ వన్డేలో […]
- 1998 సీజన్లో సచిన్ 9 శతకాల రికార్డు
భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 28వ శతకం నమోదు చేయడం ద్వారా… 2019 సీజన్లో ఏడు వన్డే శతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన రెండో వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రోహిత్ ధూమ్ ధామ్ సెంచరీ సాధించాడు. సహ ఓపెనర్ రాహుల్ తో కలసి రోహిత్ చెలరేగిపోయాడు.
నెగ్గితీరాల్సిన విశాఖ వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ మొదటి వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. 36.6 ఓవర్లలోనే 227 పరుగుల భారీ భాగస్వామ్యంతో విండీస్ బౌలర్ల వెన్ను విరిచారు.
రాహుల్ 102 పరుగులకు అవుట్ కాగా…రోహిత్ 159 పరుగుల స్కోరు నమోదు చేశాడు. రోహిత్ మొత్తం 138 బాల్స్ లో 17 బౌండ్రీలు, 5 సిక్సర్లతో రోహిత్ శర్మ 159 పరుగులకు కోట్రెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వన్డే క్రికెట్లో 150కి పైగా స్కోరు సాధించడం రోహిత్ శర్మకెరియర్ లో ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.
సచిన్ రికార్డు బ్రేక్…
మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న ఐదు 150కి పైగా స్కోర్ల రికార్డును రోహిత్ గత ఏడాదే అధిగమించాడు. ముంబై వేదికగా… వెస్టిండీస్ తో ముగిసిన నాలుగో వన్డేలో 162 పరుగుల స్కోరు సాధించడం ద్వారా తన రికార్డును తానే మెరుగు పరచుకొన్నాడు.
గౌహతీలో ముగిసిన తొలివన్డే ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఐదు 150 స్కోర్ల రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ ప్రస్తుత విశాఖ వన్డే ద్వారా ఎనిమిదోసారి అదే ఘనతను సొంతం చేసుకొన్నాడు.
విశాఖ వన్డే వరకూ రోహిత్ శర్మ సాధించిన మొత్తం 28 సెంచరీలలో ఎనిమిది 150కి పైగా స్కోర్లు ఉండటం విశేషం.
2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా పై 209, కోల్ కతా వేదికగా 2014లో శ్రీలంకపై 264 పరుగులు, 2015లో కాన్పూర్ వేదికగా సౌతాఫ్రికా పై 150 స్కోరు, 2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా పై 171 నాటౌట్ స్కోరు, 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపై 208, వెస్టిండీస్ తో గౌహతీ వేదికగా ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల నాటౌట్, ముంబై వన్డేలో 162 పరుగుల స్కోరు, విశాఖ వన్డేలో 159 పరుగుల రికార్డులను కేవలం రోహిత్ శర్మ మాత్రమే సాధించాడు.
వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన భారత ఏకైక క్రికెటర్ కూడా రోహిత్ శర్మే కావడం మరో రికార్డు.
2019 సీజన్లో రోహిత్ టాప్…
2019 వన్డే సీజన్లో రోహిత్ శర్మ అత్యధికంగా ఏడు శతకాలు సాధించాడు. 2000 సీజన్లో సౌరవ్ గంగూలీ, 2016 సీజన్లో డేవిడ్ వార్నర్ ఏడేసి సెంచరీల చొప్పున సాధిస్తే.. 2019 సీజన్లో రోహిత్ ఆదే ఘనతను సొంతం చేసుకోగలిగాడు.
అయితే…ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రపంచ రికార్డు మాత్రం …మాస్టర్ సచిన్ పేరుతో ఉంది. 1998 సీజన్లో సచిన్ టెండుల్కర్ 9 వన్డే సెంచరీలతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
ప్రస్తుత విశాఖ వన్డే వరకూ 220 మ్యాచ్ లు ఆడి 213 ఇన్నింగ్స్ లో 8 వేల 881 పరుగులు సాదించాడు. ఇందులో 28 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.
వన్డే క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలతో పాటు…2019 వన్డే ప్రపంచకప్ లో అత్యధికంగా ఐదు సెంచరీలు బాదిన మొనగాడు రోహిత్ మాత్రమే.. ఐపీఎల్ ట్రోఫీని ఐదుసార్లు అందుకొన్న ఏకైక క్రికెటర్ సైతం రోహిత్ శర్మ మాత్రమే.