Telugu Global
Cinema & Entertainment

'వెంకీ మామ' సినిమా రివ్యూ

రివ్యూ : వెంకీ మామ రేటింగ్ : 2.25/5 తారాగణం : వెంకటేష్, నాగ చైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్ ఫుత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, పరాగ్ త్యాగి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: ఎస్ ఎస్ థమన్ నిర్మాత : సురేష్ బాబు దర్శకత్వం : కె ఎస్ రవీంద్ర నిజ జీవితంలో మామా మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్య మొట్టమొదటిసారిగా ఒక మల్టీ స్టారర్ సినిమాలో […]

వెంకీ మామ సినిమా రివ్యూ
X

రివ్యూ : వెంకీ మామ
రేటింగ్ : 2.25/5
తారాగణం : వెంకటేష్, నాగ చైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్ ఫుత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, పరాగ్ త్యాగి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ థమన్
నిర్మాత : సురేష్ బాబు
దర్శకత్వం : కె ఎస్ రవీంద్ర

నిజ జీవితంలో మామా మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్య మొట్టమొదటిసారిగా ఒక మల్టీ స్టారర్ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో వెండి తెరపై కనిపించారు. ‘వెంకీ మామ’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి కె ఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో రాశి ఖన్నా మరియు పాయల్ రాజపుత్ హీరోయిన్ లుగా నటించారు. స్వయంగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా డిసెంబర్ 13 న విడుదలైంది.

కథ:

వెంకటరత్నం నాయుడు (వెంకటేష్) ఒక చిన్న పల్లెటూరిలో పెద్దమనిషి. అతని చెల్లెలు, బావ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకైన కార్తీక్ (నాగచైతన్య) బాధ్యత వెంకీ పైన పడుతుంది. తన మేనల్లుడు అంటే వెంకటేష్ కి పంచ ప్రాణాలు. అలాగే మేనమామ అంటే కూడా కార్తిక్ కు ఎనలేని ప్రేమ. కానీ కార్తిక్ శ్రీకృష్ణ అంశతో పుట్టడం వల్ల అతని వల్ల వెంకీ కి ఏమన్నా హాని జరుగుతుందేమోనని వెంకీ తండ్రి రామ్ నారాయణ భయపడుతూ వాళ్ళిద్దరినీ దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు కార్తీక్ వెంకీకి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆర్మీలో చేరతాడు. దీంతో వెంకీ కార్తీక్ కోసం కాశ్మీర్ వెళ్తాడు. అసలు కార్తీక్ ఆర్మీలో ఎందుకు చేరాడు? వెంకీ మరియు కార్తీక్ కలిశారా? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

విక్టరీ వెంకటేష్ అద్భుతమైన నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కామెడీ టైమింగ్ లో వెంకటేష్ కి ఎవరు సాటిరాలేరని ఈ సినిమా చూస్తే మళ్లీ అర్థమవుతుంది. కామెడీ సన్నివేశాల్లో ఎమోషనల్ మరియు యాక్షన్ సన్నివేశాలలో సైతం వెంకటేష్ తన పాత్రలో ఒదిగిపోయి బాగా నటించారు.

నాగచైతన్య కూడా తన పాత్రకి ప్రాణం పోశాడని చెప్పుకోవచ్చు. వెంకీ తో సరి సమానంగా నాగచైతన్య కూడా తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ ఇద్దరు సినిమాలో చాలా అందంగా కనిపించారు. రావు రమేష్ కూడా తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి మరియు పరాగ్ త్యాగి చాలా సహజంగా నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు కేఎస్ రవీంద్ర ఈ సినిమా కోసం ఒక మంచి కథని ఎంపిక చేసుకున్నారు. అయితే సినిమా మొత్తం మీద వెంకటేష్ పాత్ర కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నాగచైతన్య పాత్రకి పర్ఫామెన్స్ స్కోప్ తక్కువ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో నేరేషన్ స్లో అయిపోవడంతో సినిమా కొంచెం బోర్ కొడుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి.

ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం చాలా బాగుంది. పాటల సంగతి పక్కన పెడితే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.

బలాలు:

విక్టరీ వెంకటేష్, ఫస్ట్ హాఫ్, ఎంటర్టైన్మెంట్

బలహీనతలు:

కథ, రెండవ హాఫ్, స్లో నేరేషన్

చివరి మాట:

ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి పది నిమిషాల్లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా చాలా ఆహ్లాదకరంగా రొమాంటిక్ సన్నివేశాలతో మరియు కామెడీ సన్నివేశాలతో చాలా బాగా నడుస్తుంది.

ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గిపోయి ఎమోషన్స్ మాత్రమే కనిపిస్తాయి. అయితే సెంటిమెంట్ సన్నివేశాలు అంత బాగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. కమర్షియల్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ ఫార్ములాలను మళ్లీ వాడినట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో మిలిటరీ సన్నివేశాలలో ఇంకొంచెం బాగుండాల్సింది అని అనిపిస్తుంది. వెంకటేష్ మరియు నాగచైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి ఉన్న అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. చివరిగా ‘వెంకీ మామ’ సినిమా ఒకసారి చూడదగ్గ చిత్రం.

బాటమ్ లైన్:

‘వెంకీ మామ’ మరియు నాగచైతన్య మధ్య అదిరిపోయిన కెమిస్ట్రీ.

First Published:  13 Dec 2019 11:12 AM IST
Next Story