మాట్లాడాలంటే సీసీ కెమెరాల గదికి రావాలంటున్న పృథ్వీ
ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీకి కొత్త కష్టాలు వచ్చాయి. ఆయనను పలువురు వాడేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మంచి తనాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అనుభవాలు ఎదురైన తర్వాత పృథ్వీ కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ అయిన తర్వాత తిరుమలలో దర్శనాల కోసం చాలా మంది ఆయన్ను ఆశ్రయిస్తున్నారు. తన చేతనైన మేర ఆయన సాయం చేస్తున్నారు. కానీ కొందరు హద్దులు దాటే వారు కూడా ఆయనకు తగిలారు. సీఎం బంధువును, టీటీడీ చైర్మన్ బంధువును […]
ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీకి కొత్త కష్టాలు వచ్చాయి. ఆయనను పలువురు వాడేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మంచి తనాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అనుభవాలు ఎదురైన తర్వాత పృథ్వీ కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎస్వీబీసీ చైర్మన్ అయిన తర్వాత తిరుమలలో దర్శనాల కోసం చాలా మంది ఆయన్ను ఆశ్రయిస్తున్నారు. తన చేతనైన మేర ఆయన సాయం చేస్తున్నారు. కానీ కొందరు హద్దులు దాటే వారు కూడా ఆయనకు తగిలారు. సీఎం బంధువును, టీటీడీ చైర్మన్ బంధువును అంటూ కొందరు ఆయన్ను వాడేసేందుకు ప్రయత్నించారు.
సీఎం బంధువును అంటూ ఇటీవల ఒకతను పృథ్వీని కలిశాడు. తనకు ఎస్వీబీసీలో డైరెక్టర్ పోస్టు కావాలని అడిగాడు. దాంతో కంగుతిన్న పృథ్వీ డైరెక్టర్లను నియమించేది ప్రభుత్వం అని, తన చేతుల్లో ఏమీ ఉండదని చెప్పారు.
దాంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తి మరి నువ్వు ఉన్నది ఎందుకంటూ పృథ్వీ పైకి రంకెలేసి వెళ్లిపోయాడట. అప్పటికే అనుమానం వచ్చిన పృథ్వీ అతడిని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తన గదిలోకి తీసుకెళ్లి మాట్లాడారు. దాంతో అతడి బెదిరింపులన్నీ రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఆరా తీయగా అతడు ఎవరికీ బంధువు కాదని… పెద్దలకు బంధువుగా చెప్పుకుంటూ మోసాలు చేసే మోసగాడు అని తేల్చారు.
మరో సందర్భంలో జగన్ బంధువును అంటూ పృథ్వీకి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. తన బంధువులు వస్తున్నారని తిరుమలలో ప్రత్యేక దర్శనాలు చేయించాలని ఆదేశించాడు. ఆ సమయంలో పృథ్వీ తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దే ఉన్నారు. ముఖ్యమంత్రి బంధువు అయితే తనకెందుకు ఫోన్ చేస్తారు అని అనుమానం వచ్చిన పృథ్వీ ఫోన్‌ను సీఎం జగన్‌మోహన్ రెడ్డి పీఏకు ఇచ్చారు. జగన్ పీఏ గట్టిగా నిలదీయడంతో అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. దాంతో పృథ్వీ కంగుతిన్నాడు.
తనను చాలా మంది వాడేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావనకు వచ్చిన పృథ్వీ మరింత జాగ్రత్తపడుతున్నారు. ఆయన్ను కలవడానికి ఎవరొచ్చినా సీసీ కెమెరాల గదిలోకి తీసుకెళ్లి మాట్లాడుతున్నారట పృథ్వీ. ఈ సీసీ ఫుటేజ్‌ను భద్రంగా సేవ్ చేసుకుంటున్నారట.