Telugu Global
NEWS

దేశవాళీ క్రికెట్లో వాసిం జాఫర్ మరో అరుదైన రికార్డు

150 రంజీ మ్యాచ్ ల ఒకేఒక్కడు జాఫర్ 2019-20 సీజన్లో ఆంధ్రతో మ్యాచ్ ద్వారా ఘనత విదర్భ కమ్ భారత మాజీ ఓపెనర్ వాసిం జాఫర్ …దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో మరో అరుదైన రికార్డు నమోదు చేశాడు. నాలుగు పదుల లేటు వయసులోనూ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఇప్పటికే పలు అసాధారణ రికార్డులు సాధించిన 41 సంవత్సరాల వాసిం జాఫర్ 2019-20 రంజీ సీజన్లో తన తొలిమ్యాచ్ ను విజయవాడ వేదికగా ఆంధ్రతో ఆడటం ద్వారా..150 […]

దేశవాళీ క్రికెట్లో వాసిం జాఫర్ మరో అరుదైన రికార్డు
X
  • 150 రంజీ మ్యాచ్ ల ఒకేఒక్కడు జాఫర్
  • 2019-20 సీజన్లో ఆంధ్రతో మ్యాచ్ ద్వారా ఘనత

విదర్భ కమ్ భారత మాజీ ఓపెనర్ వాసిం జాఫర్ …దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో మరో అరుదైన రికార్డు నమోదు చేశాడు. నాలుగు పదుల లేటు వయసులోనూ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

రంజీ ట్రోఫీలో ఇప్పటికే పలు అసాధారణ రికార్డులు సాధించిన 41 సంవత్సరాల వాసిం జాఫర్ 2019-20 రంజీ సీజన్లో తన తొలిమ్యాచ్ ను విజయవాడ వేదికగా ఆంధ్రతో ఆడటం ద్వారా..150 రంజీ మ్యాచ్ లు ఆడిన తొలి, ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

రంజీట్రోఫీ చరిత్రలో అత్యధిక రంజీమ్యాచ్ లు ఆడిన క్రికెటర్లలో దేవేంద్ర బుండేలా (145 ), అమోల్ ముజుందార్ ( 136 ) మాత్రమే ఉన్నారు.

గత సీజన్ ముగిసే సమయానికే 149 రంజీమ్యాచ్ ల రికార్డు సాధించిన జాఫర్ ప్రస్తుత సీజన్ తొలిమ్యాచ్ తోనే 150 మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగాడు.

డబుల్ సెంచరీల మొనగాడు…

నాలుగు పదుల వయసులోనూ రంజీట్రోఫీలో డబుల్ సెంచరీలు సాధించడంలో జాఫర్ తనకు తానే సాటిగా నిలుస్తూ వస్తున్నాడు.

గత కొద్దిసీజన్లుగా విదర్భ జట్టులో సభ్యుడిగా ఆడుతున్న జాఫర్ .. 2018-19 సీజన్ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 206 పరుగుల స్కోరు సాధించాడు. 296 బాల్స్ లోనే జాఫర్ డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఆసియా, భారత క్రికెట్ చరిత్రలోనే 40 ఏళ్ల ప్రాయంలో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. జాఫర్ రంజీ కెరియర్ లో ఇది 9వ డబుల్ సెంచరీ కావడం మరో రికార్డు.

గత సీజన్లో…జాఫర్ వరుసగా మూడుమ్యాచ్ ల్లో భారీస్కోర్లు సాధించడం ద్వారా…ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని చాటుకొన్నాడు. బరోడా పై 153 పరుగులు, గుజరాత్ పై 126, ముంబై పై 178, సౌరాష్ట్ర పై 98 పరుగుల స్కోర్లు నమోదు చేశాడు.

అత్యధిక పరుగుల ఓపెనర్ జాఫర్…

రంజీట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ రికార్డు జాఫర్ పేరుతోనే ఉంది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 250 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో…జాఫర్ 56 శతకాలు, 88 హాఫ్ సెంచరీలతో 19వేల 873 పరుగులు సాధించాడు.

అంతేకాదు… ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 19వేల పరుగుల మైలురాయిని చేరాడు. ఇంతకు ముందే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మొనగాళ్లలో …సునీల్ గవాస్కర్ 25 వేల 834 పరుగులు, సచిన్ టెండుల్కర్ 25 వేల 396, రాహుల్ ద్రావిడ్ 23వేల 794, వీవీఎస్ లక్ష్మణ్ 19 వేల 730 పరుగులు సాధించారు.

లేటు వయసులో రంజీ మొనగాళ్లు….

  • 1945- 46 సీజన్లో తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్య నాయుుడు.. 50 సంవత్సరాల 142 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించారు.
  • 1940-41 సీజన్లో దేవధర్ 48 ఏళ్ల 306 రోజుల వయసులో ద్విశతకం సాధించారు.
  • 1957-58 సీజన్లో విజయ్ హజారే 43 సంవత్సరాల 20 రోజుల వయసులో డబుల్ సాధించారు.
  • 2018-19 సీజన్లో వాసిం జాఫర్ 40 సంవత్సరాల 335 రోజుల వయసులో డబుల్ నమోదు చేశారు.
  • 1957-58 సీజన్లో వినూ మన్కడ్ 40 సంవత్సరాల 272 రోజుల వయసులో డబుల్ సెంచరీ.
  • 2017-18 సీజన్లో వాసిం జాఫర్ 40 సంవత్సరాల 26 రోజుల వయసులో ద్విశతకం సాధించాడు.
First Published:  10 Dec 2019 6:04 AM IST
Next Story