వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించిన స్పీకర్.... సభలో వంశీ ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. రెండో రోజు సభ ప్రారంభం కాగానే ప్రత్యేక అనుమతి తీసుకుని ప్రసంగించిన వంశీ… టీడీపీ తనను సస్పెండ్ చేసిందని… కాబట్టి తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరారు. ”ముఖ్యమంత్రి గారిని నా నియోజక వర్గంలోని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు కావాలని అడిగేందుకు కలిశా. టీడీపీ హయాంలో 25వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నాం. ఇవ్వలేకపోయాం. దాంతో సీఎం […]
టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. రెండో రోజు సభ ప్రారంభం కాగానే ప్రత్యేక అనుమతి తీసుకుని ప్రసంగించిన వంశీ… టీడీపీ తనను సస్పెండ్ చేసిందని… కాబట్టి తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరారు.
”ముఖ్యమంత్రి గారిని నా నియోజక వర్గంలోని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు కావాలని అడిగేందుకు కలిశా. టీడీపీ హయాంలో 25వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నాం. ఇవ్వలేకపోయాం. దాంతో సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలిసి పట్టాల కోసం విజ్ఞప్తి చేశా. దాంతో ముఖ్యమంత్రిని ఎందుకు కలిశావ్ అంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో తెలియజేశారు. అందుకే ఈ అంశంపై మాట్లాడేందుకు మీ అనుమతి కోరా” అని వంశీ వివరించారు. సీఎంను కలిస్తే సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
దీంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వంశీ కూడా తీవ్రంగా స్పందించారు. ”హలో.. చంద్రబాబుగారు మీరు ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారు. చంద్రబాబు గారు… ఏం మేం మాట్లాడకూడదా?.” అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని తాను కలవడం ఇదే తొలిసారి కాదని వంశీ వెల్లడించారు. టీడీపీ సభ్యులు పదేపదే వంశీ ప్రసంగానికి అడ్డుపడగా స్పీకర్ తీవ్రంగా స్పందించారు.
సభ ప్రారంభానికి ముందే వంశీ తనకు కొద్దిగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారని.. ఒక సభ్యుడు తన వాదన వినిపించేందుకు అవకాశం ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఒక సభ్యుడి గొంతు నొక్కుతామంటే చూస్తూ ఊరుకోబోనన్నారు స్పీకర్. గతంలో ఇదే అసెంబ్లీని ఎలా నడిపారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు.
జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… వంశీ ఏదో చెబుతుంటే వినకుండానే టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. ఒక సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చే అధికారం పూర్తిగా స్పీకర్‌కు ఉంటుందని… కాబట్టి స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్నారు.
అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించిన వంశీ.. పోలవరం కాలువపై రైతులు పెట్టుకునే మోటార్లకు విద్యుత్‌ను సరఫరా చేయాల్సిందిగా కోరానని అందుకు జగన్‌మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. ఇళ్ల పట్టాల విషయంలోనూ సీఎం సానుకూలంగా చేశారని… ప్రజాసమస్యలపై తాను సీఎంను కలిస్తే టీడీపీ నాయకత్వం వారికున్న మీడియాను, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారని వంశీ విమర్శించారు.
కాలువకు భూమి ఇస్తే నీళ్లు వస్తాయని రైతులను తాను స్వయంగా ఒప్పించి… పోలవరం కాలువకు భూమి ఇప్పించానని చెప్పారు. ఇదే అంశంలో సీఎంను కలిసి మోటార్ల ద్వారా రైతులు నీరు తీసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరామన్నారు. ఆ సమయంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు అభినంధించానన్నారు. గతంలో తాను కూడా తెలుగు మీడియంలో చదవి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలోకి మారినప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని… ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం నిర్ణయాన్ని ఆహ్వానించానన్నారు.
రాజకీయాల్లోకి రాకముందు నుంచే ట్రస్ట్ ద్వారా తన నియోజకవర్గం పరిధిలోని పేదలకు ఫీజులకు కట్టేవాడినని… కానీ అందరికీ సాయం చేయడం వ్యక్తుల వల్ల అయ్యే పని కాదన్నారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ తీసుకురావడంతో ఎంతో మంది పేదలకు లబ్ది జరిగిందన్నారు. ఆరోగ్య శ్రీ వల్ల ఎంతో మంది పేదల జీవితాలు నిలబడిన ఉదంతాలను తాను కళ్లారా చూశానన్నారు.
అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థుల జీవితాలను మారుస్తాయని తాను భావించి వాటిని అభినందిస్తే.. ”పప్పు అండ్ బ్యాచ్ ఒకటి ఉంది అధ్యక్ష.. వాళ్లు బయట కనిపించరు సర్. ట్విట్టర్‌లో కనిపిస్తారు. వారు సోషల్ మీడియాలో నీవు ఏ కులంలో పుట్టావ్?, నీవు మీ నాన్నకే పుట్టావా… మీ తాత ఏ కులం? .. ఇలా ప్రభుత్వానికి సపోర్టు చేస్తావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం మంచి పని చేసినా గుడ్డెద్దు, ముసలెద్దు చేలో పడ్డట్టు మేం ఉండాలా?. మోకాలికి, బోడిగుండుకు లింక్ పెడుతారు అధ్యక్ష. జయంతికి వర్ధంతికి తేడా తెలియదు. కానీ వీరికి ఏం చెప్పినా తప్పు అవుతుంది. ఒక నిమిషం మాట్లాడుతానని కోరగానే…. 40 ఏళ్ల అనుభవం ఉందనే చంద్రబాబు వినేందుకు భయపడి సభ నుంచి ఎందుకు బయటకు ఎందుకు వెళ్లిపోయారు?. ” అని వంశీ ప్రశ్నించారు.
ఇసుక కొరత వర్షాల వల్ల ఏర్పడింది కాబట్టి ప్రభుత్వానికి కొద్దిగా టైం ఇద్దామని చెబితే చంద్రబాబుకు అది రుచించలేదన్నారు. అప్పటి నుంచి తనపై ఇష్టానుసారం ప్రచారం చేసి… సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. కాబట్టి టీడీపీతో తాను కూడా నడిచే పరిస్థితి లేకుండాపోయిందని… కాబట్టి తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి తన హక్కులు కాపాడాల్సిందిగా స్పీకర్‌ను వంశీ కోరారు.
వంశీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన స్పీకర్… ప్రత్యేక సభ్యుడిగా గుర్తించేందుకు అంగీకరించారు. ఖాళీగా ఉన్న సీట్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని కోరారు. 181, 182, 183 సీట్లలో ఏదో ఒకటి తీసుకోవాలని వంశీని కోరారు.