మత కలహాల సృష్టికి ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు కుట్ర...
ఆంధ్రప్రదేశ్‌లో కలిసి మెలిసి ఉంటున్న ప్రజల మధ్య మత కలహాలు సృష్టించేందుకు చంద్రబాబు, ఆయన కనుసన్నల్లో ఏబీఎన్ రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే తిరుమలపై పదేపదే తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ అంశమూ లేకపోవడం, ప్రజలంతా సంతోషంగా ఉండడంతో చివరకు చంద్రబాబు, రాధాకృష్ణలు మత కలహాలను ఆశ్రయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘వెంకయ్య సైట్‌లో ఏసయ్య’ అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన […]
ఆంధ్రప్రదేశ్‌లో కలిసి మెలిసి ఉంటున్న ప్రజల మధ్య మత కలహాలు సృష్టించేందుకు చంద్రబాబు, ఆయన కనుసన్నల్లో ఏబీఎన్ రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.
ఇందులో భాగంగానే తిరుమలపై పదేపదే తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ అంశమూ లేకపోవడం, ప్రజలంతా సంతోషంగా ఉండడంతో చివరకు చంద్రబాబు, రాధాకృష్ణలు మత కలహాలను ఆశ్రయిస్తున్నారని ఫైర్ అయ్యారు.
‘వెంకయ్య సైట్‌లో ఏసయ్య’ అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై టీటీడీ ఈవో సింఘాల్, ఈవో అనిల్‌కుమార్‌తో కలిసి సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. స్వార్థ రాజకీయం కోసం వెంకటేశ్వరస్వామిని కూడా వాడుకునే నీచ స్థితికి చంద్రబాబు, రాధాకృష్ణ దిగజారిపోయారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
టీటీడీ వెబ్‌సైట్లో అసలు యేసయ్య అనే పదమే లేదని… గూగుల్ సెర్చ్‌లో ఉన్న పదాన్ని టీటీడీకి ఆపాదించి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీటీడీ క్యాలెండర్‌లో గానీ, వెబ్‌సైట్‌లో గానీ ఆ పదం ఉంటే చూపాలని సవాల్ విసిరారు.
ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్టశక్తులు అన్యమత ప్రచారం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కొండ మీద శిలువ ఉందంటూ ప్రతిపక్షం అసత్య ప్రచారం చేసిందని… విచారణలో దీని వెనుక ఉన్నది టీడీపీ సానుభూతిపరులేనని వెల్లడైందని గుర్తు చేశారు.
బస్సు టిక్కెట్లపై కూడా ఇలాగే అసత్య ప్రచారం చేసిందని.. దీనిపై విచారణ చేయిస్తే అవి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించినవేనని తేలిందన్నారు. ఆన్‌లైన్ వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామని వివరించారు.
టీటీడీ పంచాంగం మొదటి పేజీలో తెలుగులో ‘శ్రియై నమః’ అనే పదం కనిపిస్తుందని.. దీనిని ‘శ్రీ యేసయ్య‘గా ట్రోల్ చేసి ఉండవచ్చన్నారు. ఇది టీటీడీ పంచాంగంలో దొర్లిన తప్పు కాదన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి గూగుల్‌కు రిపోర్టు చేసి వివరణ కోరామని సింఘాల్ చెప్పారు. ఇప్పటికే గూగుల్ వారికి లేఖ కూడా రాశామన్నారు.
గూగుల్ వల్ల జరిగిన తప్పుకు టీటీడీని నిందించడం, టీటీడీపై లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని సింఘాల్ ప్రశ్నించారు.